మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Mar 07, 2020 , 00:54:15

ప్రగతి మెరిసే పట్టణ మురిసే

ప్రగతి మెరిసే పట్టణ మురిసే

(పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ / మంథనిటౌన్‌/ సుల్తానాబాద్‌/ గోదావరిఖనిటౌన్‌/ పెద్దపల్లిటౌన్‌): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి బల్దియాల్లో అభివృద్ధి వెలుగులు నింపింది. రామగుండం కార్పొరేషన్‌, పెద్దపల్లి, మంథని, సు ల్తానాబాద్‌ మున్సిపాల్టీల్లోని 50 డివిజన్లు, 64వార్డుల్లో ఈ కార్యక్రమం వేడుకలా కొనసాగి,  పదిరోజుల్లోనే నగరం, పట్టణాలకు కొత్తరూపు వచ్చింది. ఇన్నాళ్లూ అభివృద్ధికి దూరంగా కనీస సౌకర్యాలు లేకుండా మగ్గిన నగర, పట్టణాల్లోని పలు డివిజన్లు, వార్డుల్లో ఘననీయమైన మార్పు వచ్చింది. దశాబ్దాల కాలంగా పేరుకుపోయిన అనేక సమస్యలకు ఈ కార్యక్రమం పరిష్కారాన్ని చూపింది. అనేక ఏళ్లుగా ఉన్న విద్యుత్‌ సమస్యలకు పరిష్కారం ల భించింది. ప్రధానంగా వంగిన, తప్పుపట్టిన, రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్‌ స్తంభాలు, లూజు లైన్ల తిప్పలు తీరింది. 


పలు ప్రాంతాల్లో తాత్కాలిక రోడ్లు వేసి ప్రజల దారి కష్టాలు తీర్చారు. ఆయా పట్టణా ల్లో 20,259 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. అనుమతి లేకుండా 17 స్థలాల్లో 690 ప్లాట్లను గుర్తించి వాటికి నోటీసులు ఇచ్చారు. ఇక జిల్లా పట్టణ జనాభా 3,11,443 మంది ఉండగా, అందుకు తగ్గ పారిశుధ్య సిబ్బంది అవసరమని అంచనాలు వేశారు. రామగుండం కార్పొరేషన్‌ పరిధిలో 643 మంది, మంథనిలో ఆరుగురు, పెద్దపల్లిలో 72 మంది, సుల్తానాబాద్‌లో 56 మంది సానిటేషన్‌ సిబ్బంది అవసరమని గుర్తించారు. ఈ పదిరోజుల్లో సమస్యల పరిష్కారమే కాదు చేపట్టాల్సిన పనుల ప్రగతిపైనా అధికారులు ప్రణాళికలు రూపొందించడంతోపాటు అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. 


మంథని మున్సిపాలిటీ పరిధిలో 12 ఎకరాల స్థలంలో రెండు డంప్‌యార్డులు, 17 గుంటల్లో ఒక వైకుంఠధామ నిర్మాణం, ఎకరం స్థలంలో పబ్లిక్‌ పార్క్‌ నిర్మాణం, 1.2 ఎకరం స్థలంలో సమీకృత మార్కెట్‌, 3.5 ఎకరాల స్థలంలో క్రీడా మైదానం, 12 గుంటల స్థలంలో  వాహనాల పార్కింగ్‌కు, వ్యాపార కూడళ్లలో రెండు చోట్ల పురుషుల, స్త్రీల మరుగుదొడ్ల నిర్మాణం. చెత్త సేకరణ కోసం అదనంగా మరో రెండు ట్రాక్టర్లు, ఒక ఆటో ట్రాలీ, ఒక స్వీపింగ్‌ మిషన్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించారు.పట్టణంలోని చైతన్యపురికాలనీలో 4 గుంటల స్థలంలో మిని మార్కెట్‌ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. పట్టణంలోని 9 సీసీ రోడ్లను, 8 డ్రైనేజీలతో పాటు ఖాళీ ఇండ్ల స్థలాలను పట్టణ ప్రగతిలో శుభ్రం చేశారు. ఒక పాడుబడ్డ బావిని గుర్తించారు. మున్సిపాలిటీ పరిధిలో 4 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు.


సుల్తానాబాద్‌లో..

సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 2 గుంటల స్థలంలో  డంప్‌యార్డు, మరో 2 గుంటల స్థలంలో ఒక వైకుంఠధామం నిర్మాణం, 2 గుంటల స్థలంలో సమీకృత మార్కెట్‌ నిర్మాణం, 6 ఎకరాల స్థలంలో ఒక క్రీడా మైదానం నిర్మించనున్నారు. చెత్త సేకరణకు ఒక ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రూ. 4.50లక్షలతో అదనపు విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు, రూ. 2.50 లక్షలతో థర్డ్‌వైరు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటనున్నారు. మున్సిపాలిటీ పరిధిలో మూడు చోట్ల శ్మశానవాటికల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేశారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ సమీపంలో రూ. 1.56 కోట్లతో సమీకృత కూరగాయల మార్కెట్‌ నిర్మించనున్నారు. అలాగే కార్యక్రమంలో భాగంగా 21 ప్రధాన, అంతర్గత రహదారులను, 19 డ్రైనేజీలతో పాటు ఖాళీ ఇండ్ల స్థలాలను పట్టణ ప్రగతిలో శుభ్రం చేశారు. 3 పాడుబడ్డ బావులను, 10 పాత బోరుబావులను పూడ్చివేసేందుకు గుర్తించారు. వార్డుల్లో 3 పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించాలని నిర్ణయించారు. 


logo
>>>>>>