శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - Mar 07, 2020 , 00:48:56

డయల్‌ ‘100’కు విశేష స్పందన

డయల్‌ ‘100’కు విశేష స్పందన

ఫెర్టిలైజర్‌సిటీ : రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల శాంతి భద్రతల సమస్యల సత్వర స్పందన పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన డయల్‌ 100 సేవలకు విశేష స్పందన లభించిందని సీపీ సత్యనారాయణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ప్రమాదాలు, అసాంఘీక కార్యకలాపాలు, ఆపద సందర్భాలలో డయల్‌ 100 సేవలను ప్రజలు ఉపయోగించుకున్నారన్నారు. ఫిబ్రవరి నెలలో 4509 ఫిర్యాదులు రాగా, సంబంధిత పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందించి 100 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. శారీరక నేరాలకు సంబంధించిన 606 ఫిర్యాదులకు 23 కేసులు, స్త్రీలపై జరిగే నేరాలకు సంబంధించి 608 ఫిర్యాదులకు 6 కేసులు, రోడ్డు ప్రమాదాలకు, ఇతర ప్రమాదాలకు సంబంధించి 501 పిర్యాదులకు 40 కేసులు నమోదయ్యాయన్నారు. స్థిర, చర ఆస్తి నేరాలకు సంబంధించి 106 ఫిర్యాదులకు ఎనిమిది కేసులు, ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నానికి సంబంధించి 111 ఫిర్యాదులకు 15 కేసులు, ప్రజాశాంతి భంగంకు సంబంధించి 8  కేసులు నమోదు చేశామన్నారు. ఇతర నేరాలకు సంబంధించి 2569 ఫిర్యాదులకు ఏడు కేసులు నమోదు చేశామని చెప్పారు. ప్రజలు ఆపద సమయంలో డయల్‌ 100 సేవలను సద్వినియోగం చేసుకొని పోలీసులకు సహకరించాలన్నారు.


నిషేధాజ్ఞలు పొడగింపు.. 

సాధారణ పౌరుల ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్‌ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమలులో ఉన్న నిషేధాజ్ఞలు పొడిగిస్తున్నట్లు రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి, వారు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ ఆజ్ఞలు మార్చి 17 వరకు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ పరిమితి పొడిగించే అవకాశం ఉన్నదన్నారు. ఐపీసీ 188, హైదరాబాద్‌ నగర పోలీస్‌ చట్టం నిబంధనలు అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. అలాగే, కమిషనరేట్‌ పరిధిలో డీజే సౌండ్‌లు, డ్రోన్లపై ఉన్న నిషేదాజ్ఞలు సైతం పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. 


పోలీసులకు వీక్లీ పరేడ్‌.. 

రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు స్థానిక పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసులకు వీక్లీ పరేడ్‌ నిర్వహించారు. ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీస్‌, సివిల్‌, హోంగార్డు ఆఫీసర్‌, వివిధ విభాగాల సిబ్బంది ప్రతి వారం నిర్వహించే పరేడ్‌లో భాగంగా శుక్రవారం అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ ఆధ్వర్యంలో క్రమశిక్షణ, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఇందులో 46 మంది ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీస్‌ ఆఫీసర్స్‌, 98 మంది వివిధ పోలీస్‌స్టేషన్ల సిబ్బంది, 21 మంది స్పెషల్‌ పార్టీ, 55 మంది హోంగార్డు ఆఫీసర్లు కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ రవికుమార్‌, ఏఆర్‌ ఏసీపీ సుందర్‌ రావు, ఆర్‌ఐలు మధుకర్‌, శ్రీధర్‌, ఆర్‌ఎస్‌ఐ సంతోష్‌, రాకేశ్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.