గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 06, 2020 , 03:15:31

తెలంగాణ పోలీస్‌ దేశానికే ఆదర్శం

తెలంగాణ పోలీస్‌ దేశానికే ఆదర్శం

ఫెర్టిలైజర్‌సిటీ : తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ స్పష్టం చేశా రు. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న గోదావరిఖని వన్‌ టౌన్‌ మోడల్‌ పోలీస్‌స్టేషన్‌, పోలీస్‌ విశ్రాంతి భవనం, పోలీస్‌ కమిషనరేట్‌ నూతన కార్యాలయాన్ని ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం రామగుండం సీపీ సత్యనారాయణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పోలీసులకు తెలంగాణ సర్కారు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నదని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా భారీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని, నేర నియంత్రణకు ఇవి ఎంతగానో దోహదపడుతాయని పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్లలో ఖర్చుల కోసం నగరంలో నెలకు రూ.75వేలు, జిల్లా కేంద్రంలో రూ.50వే లు, మండలాల్లో రూ.21వేలు మంజూరు చేస్తున్నదని చెప్పారు. మహిళల రక్షణ కోసం షీ టీం ఏర్పాటు చేశారని, 28వేల మందిని కొత్తగా పోలీ స్‌ శాఖలో నియమించారని తెలిపారు. హోంగార్డుల వేతనాన్ని రూ.23వేలకు పెంచడంతోపాటు రోజుకు రూ.635 డ్యూటీ అలవెన్సు, రూ.1000 ఇంక్రిమెంట్‌ మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు నూతన ఇండ్లు నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం హరితహారంలో భాగంగా హెడ్‌ క్వార్టర్‌లో మొక్కలు నాటారు. 


భవన నిర్మాణాల పరిశీలన..

రామగుండం కమిషనరేట్‌ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న గోదావరిఖని వన్‌ టౌన్‌, పోలీస్‌ విశ్రాంతి భవనం, సీపీ కార్యాలయ భవనాలను రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ గురువారం పరిశీలించారు. నిర్మాణాల్లో తీసుకుంటున్న నాణ్యతతో పాటు మౌలిక సదుపాయాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. భీమారం, కన్నెపల్లి, అంతర్గాం లో త్వరలోనే నూతన పోలీస్‌స్టేషన్లను నిర్మించనున్నుట్ల తెలిపారు. భవనాల నిర్మాణానికి స్థలాన్ని, ఆర్థికంగా సహకారం అందించిన సింగరేణి సీఎం డీ శ్రీధర్‌తోపాటు ఎన్టీపీసీ సీఎస్‌ఆర్‌ అధికారులకు చైర్మన్‌ కృతజ్ఞతలు తెలిపారు. 


సీపీకి సన్మానం..

ఇటీవల డీఐజీగా ఉద్యోగోన్నతి పొందిన రామగుండం సీపీ సత్యనారాయణను కోలేటి ఘనంగా సత్కరించారు. హైదరాబాద్‌ సౌత్‌ జోన్‌ డీసీపీగా ఎన్నో కఠినమైన కేసులను, శాంతి భద్రతల పరిరక్షణకు సీపీ తీసుకున్న చొరవ అద్భుతమని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్‌ డీసీ పీ అశోక్‌కుమార్‌, లా అండ్‌ ఆర్డర్‌ అడ్మిన్‌ డీసీపీ రవికుమార్‌, ఏఆర్‌ ఏసీపీ సుందర్‌ రావు, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌, సీఐ పర్స రమేశ్‌, రాజ్‌కుమార్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఈఈ శ్రీనివాస్‌, డీఈ విశ్వనాథం, ఏఈ ప్రసాద్‌ పాల్గొన్నారు. 


logo
>>>>>>