మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Mar 05, 2020 , 02:03:12

‘పట్టణ ప్రగతి’

‘పట్టణ ప్రగతి’

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 50 డివిజన్లు, పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 36, మంథనిలోని 13 వార్డులు, సుల్తానాబాద్‌ పరిధిలోని 15 వార్డుల్లో ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం వేడుకలా కొనసాగింది. ఫిబ్రవరి 24న సుల్తానాబాద్‌ మున్సిపాల్టీ పరిధిలో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ లాంఛనంగా ప్రారంభించగా, చివరిరోజు రామగుండం కార్పొరేషన్‌ పరిధిలో కలెక్టర్‌ పర్యటనతో ముగిసింది. 


తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకం చేపట్టిన ఈకార్యక్రమంతో ఎన్నో ఏళ్లుగా పేరుకు పోయిన సమస్యలకు పరిష్కారం లభించింది. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, పచ్చదానికి ప్రాధాన్యతనిచ్చేలా ‘పట్టణ ప్రగతి’ కొనసాగింది. రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌ పాల్గొని, ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. పట్టణవాసుల సమస్యలు తెలుసుకొని, పరిష్కారం కోసం ప్రణాళికలను సిద్ధం చేయించారు. పది రోజుల కార్యక్రమాలతో పట్టణాల్లో పారిశుధ్యం మెరుగుపడగా, వీధుల్లోని డ్రైనేజీలు పరిశుభ్రంగా మారాయి. అనేక ఏళ్లుగా ఉన్న విద్యుత్‌ సమస్యలకు పరిష్కారం లభించింది. ప్రధానంగా వంగిన, తప్పుపట్టిన, రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్‌ స్తంభాలు, లూజు లైన్లను సరి చేసే పనులు చేపట్టారు. పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాల్టీల పరిధిలో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తుండగా, మంథని మార్కెట్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు మరో రెండు మినీ మార్కెట్ల ఏర్పాటు కోసం కసరత్తు చేస్తున్నారు. పట్టణ ప్రజల సౌకర్యార్థం పలు చోట్ల సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం రూపొందిస్తున్నారు. డంప్‌ యార్డుల్లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే ప్రక్రియ మొదలు పెట్టడంతోపాటు వైకుంఠధామాల్లో మౌలిక వసతుల కల్పనకు కసరత్తు చేస్తున్నారు. అవసరమైన చోట కొత్తగా డంప్‌ యార్డులు, వైకుంఠధామాలు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు. 


మెరుగైన పారిశుధ్యం..

పది రోజుల పట్టణ ప్రగతి కార్యక్రమంతో రామగుండం కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ పట్టణాల్లో పారిశుధ్యం మెరుగైంది. రహదారులకు ఇరువైపులా పెరిగిన మొక్కలు, వ్యర్థ పదార్థాలను తొలగించారు. డ్రైనేజీల్లో పూడిక తీయడం, ప్రజోపయోగ స్థలాలను శుభ్రం చేయడం, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను తలగించడంలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయా డివిజన్లు, వార్డుల్లో హరిత ప్రణాళికను సిద్ధం చేశారు. అవసరమైన చోట మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టారు. 


విద్యుత్‌ సమస్యలకు పరిష్కారం..

బల్దియాల్లో ఎన్నో ఏళ్లుగా పేరుకు పోయిన విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ. 7కోట్లతో పనులను చేపట్టేందుకు నిర్ణయించారు. 360 వంగిన, 557 తుప్పుపట్టిన, 932 విరిగిన స్తంభాలను గుర్తించారు. రోడ్డుకు అతి సమీపంలో, రోడ్డు మధ్యలో ఉన్న 523 స్తంభాలను మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న 27 ట్రాన్స్‌ఫార్లను మార్చేందుకు చర్యలు చేపట్టారు.


నేడు ప్రభుత్వానికి నివేదిక..

పట్టణ ప్రగతిలో చేపట్టిన కార్యక్రమాలు, ప్రజల విజ్ఞాపనలు, వారి అవసరాలు, కల్పించాల్సిన మౌలిక వసతులకు సంబందించి జిల్లాలోని నగరపాలక సంస్థ, మున్సిపాల్టీల కమినషనర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అయితే 10 రోజులకు సంబంధించిన సమగ్ర నివేదికను ఆయా వార్డులు, డివిజన్ల ప్రత్యేక అధికారుల నుంచి తీసుకొని, గురువారం కలెక్టర్‌కు సమర్పించనున్నారు. అక్కడి నుంచి ప్రభుత్వానికి నివేదిక వెళ్లనుండగా, తర్వలోనే గుర్తించిన సమస్యలన్నింటికీ పరిష్కారం లభించనున్నది. logo
>>>>>>