శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 04, 2020 , 05:04:00

అక్రమలే అవుట్లపై ఉక్కుపాదం

అక్రమలే అవుట్లపై ఉక్కుపాదం
  • రాష్ట్ర సర్కారు సీరియస్‌
  • అనుమతి లేని వెంచర్లను గుర్తించాలని ఆదేశాలు
  • మున్సిపాలిటీల వారీగా రంగంలోకి అధికారులు
  • 67 ఎకరాల్లో 25 అక్రమ వెంచర్లు ఉన్నట్లు గుర్తింపు
  • కఠిన చర్యలకు సిద్ధం.. హద్దురాళ్ల తొలగింపు
  • పలువురికి నోటీసులు జారీ
  • రిజిస్ట్రేషన్లు నిలిపివేతకు లేఖలు
 బల్దియాల్లో ‘అక్రమ లేఅవుట్ల’పై రాష్ట్ర సర్కారు సీరియస్‌గా వ్యవహరిస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే రియల్టర్లపై ఉక్కుపాదం మోపుతున్నది. ఈ మేరకు ‘పట్టణ ప్రగతి’లో భాగంగా అనుమతిలేని వెంచర్లను గుర్తించి, ఆన్‌లైన్‌లో నమోదు చేయాలంటూ ‘సీడీఎంఏ’ ఐదు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేయగా, అన్ని మున్సిపాలిటీల్లోనూ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీల్లో మొత్తం 67 ఎకరాల్లో  25 అక్రమ లే అవుట్లున్నట్లు గుర్తించడంతోపాటు యజమానులకు నోటీసులిస్తూనే హద్దురాళ్లను తొలగిస్తున్నారు. మరోవైపు ఆ ప్లాట్లకు రిజిస్ట్రేషన్లను ఆపేయాలంటూ జిల్లా రిజిస్ట్రార్లకు మున్సిపల్‌ కమిషనర్లు లేఖలు రాస్తుండడంతో క్రయవిక్రయాలను నిలిపేస్తున్నారు.


(పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ ఫెర్టిలైజర్‌సిటీ/ పెద్దపల్లిటౌన్‌/ సుల్తానాబాద్‌):జిల్లాలో రామగుండం నగరపాలక సంస్థతో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీలు ఉన్నాయి. మంథని మినహా మిగతా వాటిల్లో ఇప్పటి వరకు 25 అక్రమ లే అవుట్లను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందు లో 67 ఎకరాల్లో ప్లాటింగ్‌ జరిగినట్లు పేర్కొంటుండగా.. ఆయా లే అవుట్లలో సుమారు భారీగానే ప్లాట్ల విక్రయాలు జరిగినట్లు అంచనా వేస్తూనే, అక్రమ లే అవుట్‌లపై కొరఢా ఝులిపిస్తున్నారు. కొత్త జిల్లాగా ఏర్పడ్డ పెద్దపల్లి జిల్లా కేంద్రం పెద్దపల్లి మున్సిపాల్టీతో పాటుగా రామగుండం కార్పొరేషన్‌, సుల్తానాబాద్‌లో పరిధిలో రోజు రోజుకూ రియల్‌ ఎస్టేట్‌ దందా పెరిగిపోతుతుండగా, పలువురు రియల్టర్లు లే అవుట్‌ నిబంధనలను పాటించకుండానే వెంచర్లు చేసి ప్లాట్లను విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో పట్టణ ప్రగతిలో భా గంగా ఎక్కడెక్కడ అక్రమ వెంచర్లు ఉన్నాయో గుర్తించాలని సర్కారు జిల్లా యంత్రాంగాన్ని ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వార్డులవారీగా ప్రత్యేకాధికారులను నియమించిన జిల్లా యంత్రాంగం ఈ వెంచర్లను గుర్తించడంతోపాటు ప్రభుత్వానికి నివేదించారు. అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నారు. అక్రమంగా వెంచర్లు వెలిస్తే విక్రయాలు, భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరు. 


ఎల్‌ఆర్‌ఎస్‌లో స్పందించని రియల్టర్లు..

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిల్లో అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద అవకాశం ఇచ్చింది. దీని గడువు గత నెల 28తో ముగిసిపోయింది. అయినా రియల్టర్లు మాత్రం స్పందించలేదు. దీంతో ఇక నుంచి అక్రమ లే అవుట్లపై చర్యలు చేపట్టేందుకు అధికారులు దృష్టి సారించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంలోనూ అక్టోబర్‌ 2015కు ముందు లే అవుట్లు చేసిన వాటిని క్రమబద్ధీకరించేందుకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం అధికారులు ఈ కట్‌ ఆఫ్‌ తేదీ దాటిన తర్వాత అయిన లే అవుట్లనే గుర్తిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 


అక్రమాలకు అడ్డాలుగా లే అవుట్లు..

ఏదైనా వ్యవసాయ, ఇతర భూములను నివాస స్థలాలుగా మార్చాలంటే దానికి పెద్ద తతంగమే ఉంటుంది. భూముల్లో ఫ్లాట్లు పెట్టి వెంచర్లుగా మార్చాలంటే ముందుగా ఆ భూమిపై నాలా పన్ను చెల్లించి రెవెన్యూ శాఖ నుంచి ఎన్‌ఓసీ పొందాల్సి ఉంటుంది. లే అవుట్‌ నిబంధనల ప్రకారం రోడ్లు వేయడంతో పాటుగా వెంచర్‌ మొత్తంలోని 10శాతం భూమిని సంబంధిత మున్సిపాల్టీ, కార్పొరేషన్‌, గ్రామ పంచాయతీ పేరున ముందు రిజిస్ట్రేషన్‌ చేయించాలి. రిజిస్ట్రేషన్‌ నిబంధనల ప్రకారం పెద్ద రోడ్లు, మురుగు కాల్వలు, వీధిదీపాల స్తంభాలు ఏర్పాటు చేయాలి, రోడ్లు, మురుగు కాల్వలకు కేటాయించిన స్థలాన్ని మున్సిపాలిటీల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాల్సి ఉంటుంది. కానీ అవేమీ లేకుండా తమకు నచ్చినట్టుగా 30, 24, 18 అడుగుల రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. డీటీసీపీ నుంచి లే అవుట్‌ అనుమతులు పొందిన తర్వాత ఫ్లాట్లను విక్రయించాలి. కానీ ఇందుకు విరుద్దంగా రియల్టర్లు ఎకరం నుంచి మొదలుకొని 40ఎకరాల వరకూ వ్యవసాయ భూములను కొనుగోలు చేసి అందులో రోడ్లను తీసి నేరుగా వెంచర్లు పెట్టి, బ్రోచర్లను ముద్రించి నేరుగా ఫ్లాట్లుగా రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. వీరు 10శాతం భూమిని మున్సిపాల్టీలకు, పంచాయతీలకు ఇవ్వకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నట్లు తెలుస్తున్నది.  


పెద్దపల్లిలో 15 అక్రమ లే అవుట్లు.. 

పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రంగంపల్లి, పెద్దబొంకూర్‌ శివారు ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపు 45 ఎకరాల్లో 15 అక్రమ లే అవుట్లను గుర్తించినట్లు పెద్దపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ సీహెచ్‌. తిరుపతి వెల్లడించారు. ఈ మేరకు అక్రమ లే అవుట్లలో హద్దురాళ్లను తొలగించినట్లు చెప్పారు. మున్సిపల్‌ అధికారులు గుర్తించిన 15 లే అవుట్ల వివరాలను సబ్‌ రిజిస్ట్రార్‌కు అందజేసి వాటిల్లోని ఫ్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయకుండా అడ్డుకునే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.  


రామగుండంలో 8.. 

రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 18ఎకరాల్లో 15అక్రమ లే అవుట్లను కార్పొరేషన్‌ అధికారులు గుర్తించారు. నగర పాలక సంస్థ పరిధిలోని జనగామ శివారులో 8/1 ఏ అండ్‌ బీలో 7 ఎకరాలు, మల్కాపూర్‌ శివారులో 42/చలో 2 ఎకరాలు, 61 సర్వే నంలో 3 ఎకరాలు, ప్రశాంత్‌నగర్‌లోని సర్వే నం.93లో 5 ఎకరాలు, మల్కాపూర్‌ సర్వే నం.172లో 2 ఎకరాలు, జనగామలోని 667 సర్వే నంబర్‌లో 2.27 ఎకరాలు, మల్కాపూర్‌లోని 46బీ/ఎఫ్‌/2, 46బీ/జీ/2, 46బీ/హెచ్‌/2లో 1.2 ఎకరాలు, మేడిపల్లి శివారులోని సర్వే నం.562లో 1.28 ఎకరాలుగా గుర్తించి, హద్దు రాళ్లు తొలగింపజేసినట్లు నగర పాలక సంస్థ అసిస్టెంట్‌ సిటి ప్లానర్‌ కృష్టఫర్‌ తెలిపారు. అలాగే అక్రమ లే అవుట్ల వివరాలు సేకరించి డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేట్‌కు నివేదికను పంపడంతో పాటు సబ్‌ రిజిస్ట్రార్‌కు సైతం వివరాలతో కూడిన లేఖలను అందజేసినట్లు వివరించారు. అయితే ఈ అక్రమ లే అవుట్‌లలో కొనుగోలు చేసిన భూములకు బిల్డింగ్‌ అనుమతులు ఇచ్చేది లేదని పేర్కొన్నారు. 


సుల్తానాబాద్‌లో 2.. 

సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు నాలుగు ఎకరాల్లో వెలసిన రెండు అక్రమ లే అవుట్లను మున్సిపల్‌ అధికారులు గుర్తించారు. మున్సిపాల్టీ పరిధిలోని సుగ్లాంపల్లిలో సర్వే నంబర్‌ 282/7/2, సర్వేనంబర్‌ 483/12/1లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లను గుర్తించి, హద్దులు రాళ్లను తొలగించిన ట్లు సుల్తానాబాద్‌ మున్సిపల్‌ కమీషనర్‌ శ్యాంసుందర్‌రావు తెలిపారు. నాలా చట్టం ద్వారా వ్యవసాయ భూములను కన్వర్షన్‌ చేసుకోకుండానే చేసిన ఈ ప్లాట్లపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. 


అక్రమ నిర్మాణాల కూల్చివేత

పెద్దపల్లిటౌన్‌: పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలో అక్ర మ నిర్మాణాలను కమిషనర్‌ తిరుపతి ఆధ్వర్యంలో తొలగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపల్‌ నిబంధనలకు విరుద్ధంగా చందపల్లి, చీకురా యి, కూనారం రో డ్ల పక్కన నూతనంగా నిర్మాణా లు చేపడుతున్న, చేపట్టిన వాటిని  మంగళవారం ఎక్స్‌కవేటర్‌ సహాయంతో కమిషనర్‌ ఆధ్వర్యం లో అధికారులు, సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.. నూతన మున్సిపాల్టీ చట్టం ప్రకారం నిబంధనలకు లోబడి ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని స్పష్టంచేశారు. నిబంధనలు పాటించాలని చెప్పారు. అలాగే రంగంపల్లి, చందపల్లి శివారులో వెలసిన అక్రమ లేఅవుట్లను తొలగించారు. కార్యక్రమంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికా రి శ్రీధర్‌ప్రసాద్‌, టెక్నికల్‌ అధికారి అభినవ్‌, సిబ్బంది శంకర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


logo