మంగళవారం 07 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 03, 2020 , 02:30:32

ఇంటర్‌ పరీక్షలకు వేలాయె

ఇంటర్‌ పరీక్షలకు వేలాయె

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఈ నెల 4న ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల కోసం సర్వం సిద్ధమైంది. జిల్లాలో 14ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ఒక ఎస్టీ సంక్షేమ గురుకుల కళాశాల, ఏడు మోడల్‌ స్కూళ్లు, ఐదు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలు, నాలుగు కేజీబీవీలు, 20 ప్రైవేట్‌ కళాశాలలు ఉండగా, వీటిలో 12,788 విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరంతా పరీక్షలు రాయనుండగా, అధికారయంత్రాంగం 24కేంద్రాలు ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పిస్తున్నది. ఇప్పటికే ఫిబ్రవరి 1నుంచి 20వరకు నాలుగు విడతల్లో సైన్స్‌ విద్యార్థులకు, ఒకేషనల్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలను ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు నిర్వహించనున్నారు. పరీక్షకు ఉదయం 8:30గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 8:45లోపు విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాలి. 9గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరు. అన్ని కేంద్రాల వద్ద 144సెక్షన్‌ విధించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 24మంది పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు, 24మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, 351మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. సెంటర్లలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యార్థులకు వైద్య సదుపాయం అందించేందుకు ఏఎన్‌ఎంలను మందులతో సహా అందుబాటులో ఉంచనున్నారు.  ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపనున్నారు.   

12, 788మంది విద్యార్థులు

జిల్లాలో ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జనరల్‌, ఒకేషనల్‌ రెగ్యులర్‌ విద్యార్థులు 12, 788 మంది పరీక్షలు రాయనున్నారు. ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో 4801, ఒకేషనల్‌ విభాగంలో 1321 మంది, మొత్తం  6122 మంది హాజరుకానున్నా రు. ద్వితీయ సంవత్సరం జనరల్‌ విభాగంలో 5, 446మంది, ఒకేషనల్‌ విభాగంలో 1220 మంది, మొత్తంగా 6,666 మంది పరీక్ష రాయనున్నారు. 

హై పవర్‌ కమిటీ 

పరీక్షలను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం హై పవర్‌ కమిటీని నియమించింది. కలెక్టర్‌  సిక్తాపట్నాయక్‌, ఆర్జేడీ, జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్య నోడల్‌ అధికారి దాసరి కల్పన సభ్యులుగా ఉన్నారు. డిస్ట్రిక్ట్‌ ఎగ్జామినేషన్‌ కమి టీ (డెక్‌) కూడా ఏర్పాటైంది. జిల్లా నోడల్‌ అధికారి కల్పన కన్వీనర్‌గా, డెక్‌ 1గా సీనియర్‌ ప్రిన్సిపాల్‌, డెక్‌ 2గా సీనియర్‌ లెక్చరర్‌ పనిచేయనున్నారు.

సిట్టింగ్‌, ఫ్లైయింగ్‌ స్కాడ్‌ బృందాలు 

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఒక ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సీనియర్‌ లెక్చరర్‌, రెవెన్యూ అధికారి, పోలీసు అధికారి పనిచేయనున్నారు. పరీక్ష జరిగే 3గంటల వ్యవధిలో జిల్లాలోని వివిధ పరీక్షా కేంద్రాలను వీరు ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. ఇద్దరిని సిట్టింగ్‌ స్వాడ్‌గా నియమించగా, పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి పరీక్ష ముగిసేంత వరకు కళాశాలలోనే ఉండి పకడ్బందీ నిర్వహణకు సహకరిస్తారు. డెక్‌ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేస్తారు. 

పరీక్షా కేంద్రాలు ఇవే..

పరీక్షల కోసం జిల్లాలోని పలు కళాశాలల్లో 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్‌ కళాశాలలు, వికాస్‌, ట్రినిటీ, గాయత్రీ, శ్రయ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలతో పాటుగా గోదావరిఖనిలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్‌ కళాశాలలు, సచ్చిదేవ్‌, కృష్ణవేణి వికాస్‌, రామగుండం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మంథనిలోని ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్‌ కళాశాలలు, ధర్మారం మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, సాధన జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌ కళాశాల, సుల్తానాబాద్‌లోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్‌ కళాశాలలు, శ్రీవాణి జూనియర్‌ కళాశాల, కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల, ముత్తారం, కమాన్‌పూర్‌, జూలపల్లి మండలాల్లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు.     


logo