గురువారం 09 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 03, 2020 , 02:25:13

జోరుగా హుషారుగా..

జోరుగా హుషారుగా..

( పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ):  నగరాల, పట్టణాల రూపురేఖలు మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తేవడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రగతి బాటలో పయనిస్తున్నది. రామగుండం కార్పొరేషన్‌ సహా పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ పట్టణాల్లో విజయవంతంగా కొనసాగుతున్నది. కొద్దిరోజులుగా నగరంలో ముమ్మరంగా పనులు, నిర్వహిస్తూ ప్రణాళికలు రచిస్తున్న మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌ సోమవారం 15, 16, 17, 18, 19వ డివిజన్‌లలో కార్యక్రమాన్ని నిర్వహించగా, ఎమ్మెల్యే చందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు డివిజన్లలో పర్యటించి, ఇంటింటా తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా డివిజన్ల పరిధిలో హరితహారంపై చర్చించారు. చెత్తా చెదారాన్ని తొలగించేందుకు చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. అలాగే మంథని మున్సిపాల్టీ పరిధిలోని 11వ వార్డులో మంథని మున్సిపల్‌ చైర్మన్‌ పుట్ట శైలజ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ హాజరయ్యారు. మంథని మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులతోపాటు కూరగాయల మార్కెట్‌లో పర్యటించారు. ప్రజలు, వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలపై అధికారులతో చర్చించడంతో పాటు పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. అలాగే చెత్త సేకరణ, పచ్చదనం పెంపు కోసం తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు. ఇక పెద్దపల్లిలో పలువురు కౌన్సిలర్లు శ్రమదానం చేశారు. చెత్త తొలగించడంతోపాటు సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు. పలు వార్డుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను అధికారులు కూల్చివేయించారు. ఇక జిల్లాలోని డివిజన్లు, వార్డుల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఖాళీ స్థలాలు, ప్లాట్లలో పిచ్చిమొక్కలను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అవసరమైన చోట్ల రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు ప్రణాళికలు వేశారు. వంగిపోయిన విద్యుత్‌ స్తంభాలు, వదులుగా ఉన్న విద్యుత్‌ తీగల స్థానంలో కొత్తవి పెట్టేందుకు చర్యలు చేపట్టారు. అలాగే హరితహారం మొక్కలను నాటేందుకు తీసుకోవాల్సిన ఏం చేయాలనే దానిపై చర్చించారు. ఎక్కడెక్కడ ఏ మొక్కలు నాటాలనే విషయమై నిర్ణయాలు తీసుకున్నారు.  అలాగే పట్టణ ప్రగతిలో భాగంగా రామగుండం కార్పొరేషన్‌, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపాల్టీల పరిధిలో ఏకీకృత మార్కెట్‌ల ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నారు.  వార్డు కమిటీలతో మీటింగులు నిర్వహించుకొని అభివృద్ధి ప్రణాళికల తయారీలో నిమగ్నమయ్యారు. 


logo