సోమవారం 30 మార్చి 2020
Peddapalli - Mar 01, 2020 , 02:00:49

సమష్టిగా పనిచేస్తేనే సత్ఫలితాలు

సమష్టిగా పనిచేస్తేనే సత్ఫలితాలు

గోదావరిఖని, నమస్తే తెలంగాణ/ పెద్దపల్లిటౌన్‌/పెద్దపల్లి జంక్షన్‌: అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయనీ, అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం మంత్రి పెద్దపల్లి పట్టణంలోని 19, 34వ వార్డుల్లో పర్యటించి కార్యక్రమ అమలుతీరును పరిశీలించారు. బండారికుంటలోని అంబేద్కర్‌ విగ్రహానికి మం త్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే రామగుండం నగర పాలకసంస్థ పరిధిలోని 30వ డివిజన్‌లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి వేర్వేరుగా మాట్లాడుతూ, పల్లెప్రగతి స్ఫూర్తితో సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ క్రమంలో పట్టణ ప్రగతిని ఉద్యమంలా చేపట్టాలనీ, సమస్యలను గుర్తించి వాటికి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే చేపట్టాల్సిన అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందించాలని చెప్పా రు. జిల్లా కేంద్రం కావడంతో పెద్దపల్లిని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందన్నారు.  పట్టణాల్లో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషిచేస్తామని అన్నా రు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం తో పనిచేయాలని సూచించారు. అలాగే ఈ కారక్రమంలో ప్రజలందరూ భాగస్వాములవ్వాలని కోరారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలనీ, ప్లాస్టిక్‌ నిషేధానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం పెద్దపల్లిలోని 19వ వార్డు పరిధిలోని బండారికుంటలో మంత్రి ఈశ్వర్‌, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మొక్కలు నాటి నీళ్లు పోశారు. 


ప్లాస్టిక్హ్రిత పెద్దపల్లియే ధ్యేయం: ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి 

పెద్దపల్లి పట్టణాన్ని ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. పట్టణంలో తాగునీరు, పారిశుధ్యం వంటివాటిపై సమస్యలున్నాయనీ, వాటిని పరిష్కరించేందుకు సహకారం అందించాలని మంత్రిని కోరారు. పాత పైపులైన్‌ స్థానంలో కొత్తది వేసేందుకు సహకరించాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. అలాగే మున్సిపాల్టీలో పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేందకు కృషి చేయాలని కోరారు. మినీ ట్యాంక్‌బండ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణం లో కన్వెన్షన్‌ హాల్‌, ఆడిటోరియం నిర్మాణాలకు కావాల్సిన స్థలసేకరణకు ప్రభుత్వానికి నివేదిక  పంపించాలన్నారు. అధునాతమైన హంగులతో నూన మున్సిపల్‌ భవనాన్ని నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 


మోడల్‌ సిటీగా మార్చుతాం: ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ 

రామగుండం పారిశ్రామిక ప్రాంత రూపురేఖలు మార్చి రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడుతామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. ఇందుకు తగిన ప్రణాళికలు సైతం రూపొందించామని చెప్పారు. అంతర్గాం మండలంలో ఇండస్ట్రీయల్‌ పార్కు నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందనీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కూడా ఉత్పత్తి ప్రారంభమై స్థానికులకు ఉద్యోగావకాశాలను మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతీ డివిజన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని స్పష్టం చేశారు. పరిపాలన విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదన్నారు. పట్టణ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే చందర్‌ పిలుపునిచ్చారు.


ప్రతి రోజూ పర్యవేక్షణ: కలెక్టర్‌ 

పట్టణ ప్రగతిని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతిరోజూ అధికారులు పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. రామగుండం కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాల్టీలో జరుగుతున్న పట్టణ ప్రగతిని ఏరోజుకారోజు నివేదికలు తయారు చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయిస్తున్నామని వెల్లడించారు. అలాగే వార్షిక ప్రణాళికలు తయారు చేస్తున్నామని మంత్రి ఈశ్వర్‌కు కలెక్టర్‌ వివరించారు. 


ప్రణాళిక బద్ధంగా పట్టణ ప్రగతి : మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మమతారెడ్డి 

పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా ముం దుకుసాగుతున్నామని చైర్‌పర్సన్‌ డాక్టర్‌ మమతారెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో గల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నివేదిక రూపొందిస్తున్నామని ఆమె ఉద్ఘాటించా రు. కాగా, పెద్దపల్లిలో జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, పెద్దపల్లి ఆర్డీఓ శంకర్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, వైస్‌ చైర్‌పర్సన్‌ నజ్మీన్‌ సుల్తానా మోబిన్‌, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, మున్సిపల్‌ కౌన్సిలర్లు బెక్కం అంజమ్మ, నూర్జాహాన్‌, సుదమళ్ల అమ్రేశ్‌, చంద్రశేఖర్‌, మాధవి, రమాదేవి, ఉప్పు స్వరూప, కూనారం సింగిల్‌ విండో చైర్మన్‌ గజవెల్లి పురుషోత్తం, నాయకులు బండారి శ్రీనివాస్‌గౌడ్‌, జడల సురేందర్‌, బెక్కం ప్రశాంత్‌, లక్ష్మీనారాయణ, మున్సిపల్‌, విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 30వ డివిజన్‌లో జరిగిన కార్యక్రమంలో నగర మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌కుమార్‌, డిప్యూటీ కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, నగర కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, స్త్రీశిశు సంక్షేమ శాఖ రీజినల్‌ ఆర్గనైజర్‌ మూల విజయారెడ్డి, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్‌, అడ్డాల స్వరూప, బాల రాజ్‌కుమార్‌, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, మొగిలి, మండ రమేశ్‌, అడప శ్రీనివాస్‌, దేవరాజ్‌తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.  


logo