శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 29, 2020 , 01:00:10

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం కావాలి

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం కావాలి

కమాన్‌పూర్‌: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకుసాగాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. మండలంలోని నాగారం గ్రామంలో ఆయన గురువారం రాత్రి పల్లెనిద్రలో పాల్గొని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో బసచేశారు. శుక్రవారం ఉదయం గ్రామంలోని శ్మశానవాటిక, డంప్‌యార్డు, దోబీఘాట్‌, లింగాలచెరువు, నాగారం గ్రామం నుంచి పంట పొలాలకు వెళ్లే గుట్టరోడ్డును పరిశీలించారు. అలాగే గ్రామంలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ తీరు, ఇంకుడుగుంతలు, సామూహిక మరుగుదొడ్డిని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. పల్లెలు ప్రగతికి నిలయాలుగా మారేందుకు సీఎం కేసీఆర్‌ పాటుపడుతున్నారని అన్నారు. కేవలం మూడేళ్ల లోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కిందని కొనియాడారు.  చెరువులు, కుంటలు నిత్యం జలకళతో సంత రించుకోనున్నాయని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతతో పనిచేయాలని సూ చించారు. గతంలో గ్రామపంచాయతీల్లో నిధుల కొరత ఉండేదనీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. నాగారం గ్రామ పంచాయతీలో రూ.10 లక్షల నిధులు నిలువ ఉన్నాయంటే కారణం దీనికి సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కొత్త పంచాయతీ రాజ్‌ చట్టమేనని ఉద్ఘాటించారు. పల్లెప్రగతి కార్యక్రమం తో గ్రామాల్లో అభివృద్ధి పనులు మరింత వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఇంకాఏమైనా సమస్యలున్నా తెలుసుకొని పరిష్కరించేందుకే పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. 


గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాగారం నుంచి ప్రధానరహదారి నిర్మాణపు పనులు జరుగుతున్నాయని, ఈ నిర్మాణం పూర్తయ్యాక ఆర్టీసీ బస్సు నడిపించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ స్ఫూర్తితో సర్పంచ్‌లంతా గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి పనిచేయాలని సూచించారు. నాగారం సర్పంచ్‌ ఇటవేన కొమురమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్‌ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్‌ యాదవ్‌, కమాన్‌పూర్‌, కన్నాల పీఏసీఎస్‌ చైర్మన్లు ఇనగంటి భాస్కర్‌రావు, బయ్య పు మనోహర్‌రెడ్డి, ఎంపీటీసీ గొడిసెల ఉమ, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ చిందం తిరుపతి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి, మైనింగ్‌ ఏడీ సాయినాథ్‌, ఎంపీడీఓ వెంకటేశ్‌జాదవ్‌, తాసిల్దార్‌ పాల్‌సింగ్‌,  ఎంపీవో అబ్దుల్‌ వాజీద్‌, ఏపీఓ రమేశ్‌, ఏపీఎం శైలజాశాంతి, మాజీ జడ్పీటీసీ మేకల సంపత్‌ యాదవ్‌, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ పొనగంటి కనుకయ్య, జూలపల్లి సర్పంచ్‌ బొల్లపెల్లి శంకర్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ మాడిశెట్టి శంకర్‌, వార్డుసభ్యులు, స్థానికులు పలువురు పాల్గొన్నారు. 


logo