మంగళవారం 07 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 27, 2020 , 00:17:51

పాదయాత్రలు.. ప్రణాళికలు

పాదయాత్రలు.. ప్రణాళికలు

( పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ ఉత్సాహంగా సాగుతున్నది. మూడో రోజూ చైతన్యం వెల్లివిరిసింది. రామగుండం నగరంలో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆకస్మికంగా పర్యటించారు. రాంనగర్‌, కూరగాయాల మార్కెట్‌, ఐడీఎస్‌ఎంటీ షాపింగ్‌ కాంప్లెక్స్‌, ప్రజా మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం కార్పొరేషన్‌ కార్యాలయంలో పట్టణ ప్రగతిపై కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, మానిటరింగ్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌ పలు అంశాలను కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నగరంలో 50 డివిజన్లలో ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించామనీ, కార్పొరేటర్లతో కలిసి క్షేత్ర స్థాయిలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఒక నివేదిక తయారు చేయాలని కోరారు. డివిజన్‌ వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, పారిశుధ్య నిర్వహణ ఇతర అంశాలు, గుర్తించిన సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఇక 36వ డివిజన్‌లో స్థానిక కార్పొరేటర్‌ బొంతల రాజేశ్‌తో కలిసి మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ కలియతిరిగారు. ఇక మంథని పట్టణంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ విస్తృతంగా పర్యటించారు. 4, 11వ వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. 4వ వార్డు పరిధిలోని  లైన్‌గడ్డ, గంగాపురి పార్ట్‌-1 ఏరియాల్లో, 11వ వార్డు పరిధిలోని పెంజేరుకట్ట పార్ట్‌-1, ఎస్బీఐ ఏరియా, గాంధీచౌక్‌, మార్కెట్‌ ఏరియా, మజీద్‌వాడ పార్ట్‌-1, భిక్షేశ్వరస్వామి దేవాలయం పార్ట్‌-1 ఏరియాల్లో మంథని కౌన్సిలర్లు, అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక పెద్దపల్లి మున్సిపాలిటీలో అధికారులు, కౌన్సిలర్లు ఉత్సాహంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమ వార్డుల్లో సమస్యలను తెలుసుకుంటూ, పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్‌ను ఏరివేస్తూ, డ్రైనేజీలను శుభ్రం చేశారు. శ్రమదానాలు చేశారు.  వీధి దీపాలు, కొత్త స్థంభాలు, విరిగిన సిమెంట్‌ స్థంభాలను తొలగించారు. logo