గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 25, 2020 , 02:11:35

అభివృద్ధి పథకం

అభివృద్ధి పథకం

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పల్లె ప్రగతి స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రూపకల్పన చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమం సోమవారం జిల్లాలోని రామగుండం కార్పొరేషన్‌ సహా అన్ని మున్సిపాలిటీల్లో ప్రారంభమైంది. పట్టణాల్లో పేరుకుపోయిన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కమిటీల సభ్యులతో కలిసి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాద యాత్రలు నిర్వహించారు. పెద్దపల్లి మున్సిపాల్టీ 19వ వార్డు పరిధిలోని బండారికుంటలో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మొక్కను నాటి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి వార్డులో పాదయాత్రలు చేపట్టి, ప్రజా సమస్యలను గుర్తించాలని కలెక్టర్‌ సూచించారు. పెద్దపల్లిలోని 7వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిరెడ్డి మమతా రెడ్డి శ్రీకారం చుట్టారు. నూతనంగా రోడ్డు పనులను, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటును ప్రారంభించారు. మంథని మున్సిపాల్టీ పరిధిలోని 2వ వార్డులో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌తో కలిసి ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. మంథనిలో చేపట్టాల్సిన పనుల గురించి కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ, వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌ ప్రజలతో చర్చించారు. 


పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జడ్పీ చైర్మన్‌ కోరారు. అనంతరం 2వ వార్డులోని పలు కాలనీల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ అధికారులతో కలిసి పర్యటించారు. రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 7, 8, 9, 12, 33వ వార్డుల్లో మేయర్‌ బంగి అనిల్‌ కుమార్‌, బల్దియా కమిషనర్‌ ఉదయ్‌ కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పర్యటించారు. కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు. కార్పోరేషన్‌ పరిధిలోని పలు డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు తీసుకోవాల్సిన చర్యల గురించి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావుతో కలిసి చర్చించారు. సుల్తానాబాద్‌ మున్సిపాల్టీ పరిధిలోని పలు వార్డుల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముత్యం సునీత పట్టణ సభలు నిర్వహించారు. సమస్యలను గుర్తించడంతోపాటు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలతో చర్చించారు. పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని పలు వార్డుల్లో జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 


వీఆర్వోకు రూ.1000 జరిమానా.. 

మంథనిటౌన్‌ : ఇంటి ఎదుట రోడ్డుపై నిర్మాణ సామగ్రి ఉంచడంతోపాటు డ్రైనేజీ నీటిని రోడ్డుపైకి వదిలిన వీఆర్వోకు ఉన్నతాధికారులు రూ.వెయ్యి జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. మంథనిలో సోమవారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 2వ వార్డులో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ, స్పెషల్‌ ఆఫీసర్‌, డీఆర్వో నర్సింహమూర్తి పర్యటించారు. ఈ సందర్భంగా గురుమూర్తి అనే వ్యక్తం ఇంటి ఎదుట రోడ్డుపై ఇసుక, కంకర, గేట్‌ ఉండడంతోపాటు డ్రైనేజీ నీటిని రోడ్డుపైకే వదలడాన్ని గమనించారు. వెంటనే సదరు ఇంటి సభ్యులను పిలిచి, వాటిని తొలగించాలని సూచించారు. ఈ క్రమంలో అక్కడి వచ్చిన గురుమూర్తి తాను వీఆర్వోననీ, తనకు అన్ని తెలుసుననీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అక్కడే ఉన్న డీఆర్వో ఆరా తీశారు. గురుమూర్తి కాల్వశ్రీరాంపూర్‌ వీఆర్వోగా పనిచేస్తున్నట్లు తెలియడంతో విధులకు గైర్హాజరు కావడంతోపాటు ఇంటి వద్ద అపరిశుభ్రతకు కారణమవుతున్నందుకు డీఆర్వో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుమూర్తికి వెంటనే షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయాలని కార్యాలయ అధికారులను ఫోన్‌లోనే ఆదేశించారు. తన కార్యాలయానికి వచ్చి కలవాలని గురుమూర్తికి చెప్పారు. రోడ్డుపై నిర్మాణ సామాగ్రి ఉంచడంతో గురుమూర్తికి మున్సిపల్‌ అధికారులు రూ.1000 జరిమానా విధించారు. 


logo
>>>>>>