బుధవారం 08 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 24, 2020 , 02:38:29

ఇక ‘పట్టణ’ బాట

ఇక ‘పట్టణ’ బాట

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నగరాలు, పట్టణాల్లో మొదటిసారిగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ముఖ్యంగా ఆయా వార్డుల్లోని సమస్యలను గుర్తించడంపైనే ప్రధాన దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా ఆయా వార్డులు, డివిజన్లలోని రోడ్లపై విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, పోల్స్‌, వైర్లను గుర్తించడం, పారిశుధ్య పనులను పరిశీలించడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇలా అన్నింటినీ గుర్తించి నివేదికను సిద్ధం చేస్తారు. గుర్తించిన సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సినా కార్యక్రమాలపై స్థానికంగా ఉండే వార్డు కమిటీల సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిసి ప్రణాళికలు తయారు చేసి మున్సిపాలిటీలకు అందించాల్సి ఉంటుంది. ఈ సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో తీసుకొని వచ్చే ఏడాదిన్నరలోగా పరిష్కరించే దిశగా పాలకవర్గాలు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే ఒక్కొక్క డివిజన్‌, వార్డుకు 15 మంది సభ్యులతో కూడిన నాలుగు చొప్పున కమిటీలు వేశారు. పట్టణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు ప్రణాళికా బద్ధమైన ప్రగతి జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీల మరమ్మతులు, పార్కులు, జంక్షన్ల సుందరీకరణ, చెత్తను తొలగించడం, కూరగాయల మార్కెట్లు, మాంసం, చేపల మార్కెట్లకు స్థలాలు గుర్తించి కొత్తగా నిర్మాణాలు చేపట్టడం తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాల్టీల వారీగా నిధులు కేటాయించనుంది. 


జిల్లాలో 50డివిజన్లు, 64వార్డుల్లో అమలు  

జిల్లాలో రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 50డివిజన్లు, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మూడు మున్సిపాల్టీ పరిధిలోని 64వార్డుల్లో పట్టణ ప్రగతి చేపట్టనున్నారు. ఈ మేరకు ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహించాలో సైతం షెడ్యూల్‌ సిద్ధం చేశారు. అలాగే ఆయా డివిజన్లు, వార్డుల పరిధిలో ఉన్న ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలో పేర్కొంటూ ప్రణాళికలు సైతం రెడీ చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాల్టీల వారీగా నిధులను విడుదల చేయనుంది. ఇప్పటకే జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు. 


60 మందితో వార్డు కమిటీలు

పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం ప్రభుత్వం భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తున్నది. భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన అభివృద్ధి పనుల వివరాలు సేకరించి, వాటి అమలు బాధ్యతను అధికార యంత్రాంగానికి అప్పగించింది. ఇప్పటికే పల్లె ప్రగతిలో జిల్లా వ్యాప్తంగా 265 పంచాయతీలలో గుర్తించిన అభివృద్ధి పనులు దాదాపుగా పూర్తి చేసింది. రెండో విడత పల్లె ప్రగతి పూర్తి చేసుకుని మూడో విడతకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పట్టణ ప్రగతి చేపట్టాలని ప్రజల నుంచి డిమాండ్‌ పెరిగింది. ప్రజల అభిప్రాయాల మేరకు ప్రభుత్వం సోమవారం(నేటి నుంచి) పట్టణ ప్రగతి నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. పల్లె ప్రగతిలో గ్రామానికో 15 మంది చొప్పున కమిటీలు వేయగా, పట్టణ ప్రగతిలో మున్సిపాల్టీలో వార్డుకు  60 మంది చొప్పున అభివృద్ధి కమిటీ వేశారు. జిల్లాలోని కార్పొరేషన్‌, మూడు మున్సిపాలిటీల్లో వార్డులవారీగా కమిటీలు వేశారు. అదే సమయంలో వార్డుకు ఒక ప్రత్యేక అధికారి చొప్పున నియమించారు. పది రోజులపాటు కార్యక్రమాల పనితీరును పరిశీలించేందుకు ఫ్లయింగ్‌ స్వాడ్‌ బృందాలు పర్యటించనున్నాయి.logo