గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 20, 2020 , 01:36:34

పల్లె ప్రగతే సమ్మేళనం

పల్లె ప్రగతే  సమ్మేళనంపెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో పల్లె ప్రగతే ప్రథమ కర్తవ్యంగా ముందుకుసాగాలనీ, పల్లె, పట్టణాల అభివృద్ధితోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి మండలం బంధంపల్లిలోని స్వరూప గార్డెన్స్‌లో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జిల్లాస్థాయి ‘పంచాయతీరాజ్‌ సమ్మేళనం’ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామ అభివృద్ధి సర్పంచ్‌తోనే సాధ్యమవుతుందని, స ర్పంచ్‌లు, ఎంపీటీసీలు అభివృద్ధికి పోటీ పడి పనిచేయాలని పేర్కొన్నారు. ఐదేళ్ల పాలనా కాలంలో మంచిపనులు చేసి ప్రజలతో శభాష్‌ అనిపించుకోవాలని ఉద్భోదించారు. చేసిన పనులే చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచేలా చేస్తాయని దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వాలు గ్రామాల్లో శ్మశానవాటిక, డంప్‌యార్డ్‌, పరిసరాల పరిశుభ్రత కల్పన గురించి ఏనాడైనా పట్టించుకున్నాయా అని విమర్శించారు.


60ఏళ్లల్లో రాష్ట్రంలో 34లక్షల మొక్క లు నాటితే ఆరేండ్లలోనే 150కోట్ల మొక్కలను నాటిన ఘనచరిత్ర టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మన ఇంటిని ఎలా ఉంచుకుటామో ఊరిని కూడా అలానే ఉంచుకోవాలనే సంకల్పం తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. జీపీలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దనే ఉద్దేశంతో  రాష్ట్రంలో 6వేల పైచీలుకు కోట్ల కరెంటు బకాయిలు రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దని చెప్పారు. పంచాయతీరాజ్‌ చట్టం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. గుడుంబా, పేకాట వంటివి పూర్తిగా నివారించి కైంరేటును తగ్గించామని స్పష్టం చేశారు. కరెంటు వ్యవస్థ ప్రక్షాళనకు గ్రామాల్లో థర్డ్‌ వైర్స్‌, పోల్‌ షిఫ్టింగ్స్‌, విద్యుత్‌ లైన్ల క్రమబద్ధీకరణ చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద మెటీరియల్‌ కంపోనెంట్‌ రూ.20కోట్ల 89వేల నిధులు రోడ్ల నిర్మాణానికి మంజూరయ్యాయన్నారు. జీపీల కరెంట్‌ బిల్లు కోసం ప్రతీనెలా రూ. 339కోట్లు మొదటి వారంలోనే పంచాయతీ అకౌంట్లల్లో జమ చేస్తున్నారని వివరించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలోని అంశాలు సంపూర్ణంగా అమలు చేస్తే 60ఏళ్ల దరిద్య్రాన్ని మనం దూరం చేసిన వాళ్లమవుతామన్నారు. అందరూ కలిసికట్టు గా పనిచేసి సీఎం కేసీఆర్‌ కలలుకన్న  


తెలంగాణనుసాధిద్దామని పిలుపునిచ్చారు. 

ఇదిలా ఉండగా జిల్లాలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు,  పంచాయతీ కార్యదర్శులకు పల్లె ప్రగతికి పటిష్ట ప్రణాళికలు తయారు చేసి అమలు చేసే విధంగా అవగాహన కల్పించారు. తెలంగాణ పంచాయతీ రాజ్‌-2018చట్టంలోని ముఖ్యాంశాలను కొప్పుల వివరించారు. ప్రజా ప్రతినిధుల విధులు, బాధ్యతలు గుర్తెరిగి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో పెద్దపల్లి డీపీఓ వేముల సుదర్శన్‌, జడ్పీ సీఈఓ వినోద్‌, ఇన్‌చార్జి డీఆర్వో నర్సింహమూర్తి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ మంగిడి రేణుక, పెద్దపల్లి ఆర్డీఓ శంకర్‌కుమార్‌, ఎంపీపీలు కొండా శంకర్‌, ముత్యాలు, బండారి స్రవంతి, బాలాజీరావు, నూనేటి సంపత్‌, జడ్పీటీసీలు తగరం సుమలత, కందుల సంధ్యారాణి, చెల్కల స్వర్ణలత, బండారి రామ్మూర్తి, మ్యాదరబోయిన శారద, మినుపాల స్వరూప, గంట రాములు పాల్గొనగా, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా కలుగుతున్న ప్రయోజనాలను పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, మంథని ఎంపీపీ కొండా శంకర్‌, జూలపల్లి సర్పంచ్‌ శంకర్‌గౌడ్‌, నాగారం సర్పంచ్‌ బూడిద మల్లేశ్‌, పన్నూరు ఎంపీటీసీ అల్లం శ్రీదేవి ప్రసంగించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.  


పట్టుదలతో పనిచేయాలి: జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

కాంగ్రెస్‌, టీడీపీల 60ఏళ్ల నిర్లక్ష్యపు పాలనలో మరుగునపడిన అభివృద్ధిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంచేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా కడిగేద్దామని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పిలుపునిచ్చారు. గ్రామాల్లో కనీసం శ్మశానవాటికలు, డంప్‌యార్డ్‌, మరుగుదొడ్డి వంటివి కనీస సౌకర్యాలు కల్పించలేదంటే ఆ పాలన ఎంత దారుణమైనదో అర్థం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పట్టుదలతో పనిచేసి అన్నిసౌకర్యాలు కల్పించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టంపై ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించుకోవాలని  సూచించారు. చిత్తశుద్ధితో పనిచేసే ప్రజాప్రతినిధులు చట్టంలోని రీకాల్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని పుట్ట మధు పేర్కొన్నారు.


పంచాయతీరాజ్‌ చట్టం  గొప్పది: ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పంచాయతీరాజ్‌ చట్టం-2018 గొప్పదని, ఈ చట్టంతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అన్నారు. ఈ చట్టంలో ప్రజాప్రతినిధుల విధులు, బాధ్యతలను గొప్పగా పేర్కొన్నారని ప్రశంసించారు. ఒక ప్రజా ప్రతినిధి తలుచుకుంటే గ్రామాన్ని ఎలా చేయాలో, ఒక ప్రజా ప్రతినిధి పట్టించుకోకుంటే వారిని ఎలా రీకాల్‌ చేయాలో ఈ చట్టంలో పొందుపర్చారని తెలిపారు. పనిచేయకుండా నిర్లక్ష్యం వహించేవారిపై వేటు వేసే వి ధంగా చట్టం ఉందన్నారు. పల్లె ప్రగతితోనే గ్రామాలు సస్యశ్యామలమవుతాయన్నారు. 


పక్కా ప్రణాళితో ముందుకుసాగాలి: రామగుండం ఎమ్మెల్యే చందర్‌

సీఎం కేసీఆర్‌ కలలుకంటున్న హరిత, బంగారు తెలంగాణ సాకారం కావాలంటే పక్కా ప్రణాళితో ప్రతీ ఒక్క రూ ముందుకు సాగాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పిలుపునిచ్చారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామ, పట్టణాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు తయారు చేసి అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఇటీవల హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో సూచించిన విధంగా పనిచేయాలని పేర్కొన్నారు. స్థానిక సమస్యలను గుర్తించి సత్వర పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. 


సమన్వయంతో పనిచేయాలి: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘవీర్‌సింగ్‌

జిల్లాను అన్నిరంగా ల్లో అభివృద్ధి చేసేందుకు అధికార యం త్రాంగంతో పాటుగా ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ వినూత్న ఆలోచనలతో పల్లె, పట్టణ ప్రగతి కోసం బాటలు వేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కల సాకారానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలు సమగ్రాభివృద్ధిని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని దిశానిర్దేశం చేశారు.


logo
>>>>>>