గురువారం 09 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 20, 2020 , 01:43:22

గోదారమ్మ పరుగులు

గోదారమ్మ పరుగులు


కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, కరీంనగర్‌ /పెద్దపల్లిప్రతినిధి/    కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లింక్‌-1, 2లలో గోదారి జలాల ఎత్తిపోతలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేటలోని సరస్వతి పంప్‌హౌస్‌లో అధికారులు 1, 3, 5, 7, 8 పంపులు నడిపిస్తూ, మంథని మండలం సిరిపురంలోని పార్వతి బరాజ్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇక అంతర్గాం మండలంలోని గోలివాడలో నిర్మించిన పార్వతీ పంప్‌హౌస్‌ 3, 6, 7, 8 మోటర్ల ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇటు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని 6వ ప్యాకేజీలో నంది పంప్‌హౌస్‌లో ఎత్తిపోతలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి వరకు 3 ,5,6 మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోసిన అధికారులు, బుధవారం తెల్లవారు జామున 3వ మోటర్‌ను నిలిపివేసి, 4 మోటర్‌ను ఆన్‌ చేశారు. దీంతో 4,5, 6 మోటర్ల ద్వారా 9,450  9,450 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నట్లు అధికారులు తెలిపారు. నంది రిజర్వాయర్‌ నుంచి 7వ ప్యాకేజీలోని జంట సొరంగాల ద్వారా 8 ప్యాకేజీలోని కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలుతున్నాయి. ఇక్కడ బుధవారం 1, 2, 4 పంపులు నీటిని ఎత్తిపోస్తుండగా, ఇక్కడి నుంచి అటు ఎస్సారార్‌ రిజర్వాయర్‌తోపాటు తాజాగా ఎస్సారెస్పీ పునర్జీవన పథకానికి నీటిని తరలిస్తున్నారు. కాగా, ఎత్తిపోతల ప్రక్రియను ప్రాజెక్టు ఈఎన్సీ వేంకటేశ్వర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఏఈఈలు శ్రీనివాస్‌, సురేష్‌కుమార్‌, రమేశ్‌ నాయక్‌, వెంకటేష్‌, మెగా ఏజెన్సీ ప్రతినిధులు ఉన్నారు.


ఎల్‌ఎండీకి 8,600 క్యూసెక్కుల నీరు

రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి ఎల్‌ఎండీకి మంగళవారం 8,600 క్యూసెక్కుల నీటిని పంపించారు. నాలుగు రివర్స్‌ స్లూయిస్‌ గేట్ల ద్వారా దిగువకు నీటిని పంపుతున్నారు. శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో 25 టీఎంసీల నీరు నిలువ ఉన్నది. లక్ష్మీపూర్‌ పంపు హౌస్‌ నుంచి వచ్చిన నీటిని యథావిధిగా దిగువకు వదలుతున్నట్లు అధికారులు తెలిపారు.  


10.714 టీఎంసీలకు ఎల్‌ఎండీ నీటిమట్టం

ఎస్సారార్‌ జలాశయం స్లూయిస్‌ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో తిమ్మాపూర్‌ మండలంలోని ఎల్‌ఎండీలో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లోకి 5894 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంగా వస్తుండగా, 5500 క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లో రూపంలో వెళ్తున్నది. ఎల్‌ఎండీలో ప్రస్తుతం 10.714 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 


ఎస్సారెస్పీ పునర్జీవన పథకానికి ఎత్తిపోతలు మొదలు.. 

ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా జగిత్యాల రాంపూర్‌, రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్‌ల ద్వారా నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు అధికారులు నీటిని వదిలారు. గాయత్రి పంప్‌హౌస్‌లో 1,2,4 మోటర్ల ద్వారా ఎత్తిపోస్తున్న 9,500 క్యూసెక్కుల నీటిలో 6000 క్యూసెక్కులు ఎస్సారార్‌కు తరలిస్తుండగా, మరో 3500 క్యూసెక్కుల నీటిని రామడుగు మండలం షానగర్‌ సమీపంలోని వరదకాలువ 102 కిలోమీటర్‌ వద్ద రెగ్యులేటరీ గేట్లు మూసి ఎగువకు తరలిస్తున్నారు. ఎగువకు విస్తరించిన జలాలు కొద్దిసేపటికే వరదకాలువ 74 కిలోమీటర్‌ వద్ద ఉన్న రాంపూర్‌ పంప్‌హౌస్‌కు చేరుకోగా, రాత్రి 10 గంటలకు 1వ మోటర్‌ను ఆన్‌ చేసి ఎత్తిపోతలు ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు మరో మోటర్‌ను ఆన్‌ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.


logo