గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 19, 2020 , 02:49:47

తండ్రి మరణం తట్టుకోలేక..

తండ్రి మరణం తట్టుకోలేక..

ఫెర్టిలైజర్‌ సిటీ: తండ్రి మరణం తట్టుకోలేక కూతురు నదిలో దూకిన సంఘటన మంగళవారం గోదావరిఖనిలోని వంతెనపై చోటుచేసుకుంది. సోమవారం రోడ్డు ప్రమాదంలో సాయిప్రియ తండ్రి వసంతం గాయపడి మంగళవారం మృతిచెందాడు. అం బులెన్స్‌లో చెన్నూర్‌కు బయల్దేరారు. మార్గమధ్యలో ఈ సంఘటన జరుగగా, ఆమె కోటపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్టు ఉపాధ్యాయురాలి(సీఆర్‌టీ)గా పనిచేస్తోంది. 

కంటి ఆపరేషన్‌ కోసం వెళ్లి తండ్రి..

చెన్నూర్‌ పట్టణానికి చెందిన ఆరవెల్లి వసంతం సోమవారం తన కంటి పరీక్షల కోసం తన కొడుకు వెంకటసాయితో కలిసి మంచిర్యాలకు బయలుదేరాడు. జైపూర్‌ సమీపంలోని పవర్‌ప్లాంట్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వసంతం గాయపడగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఆయన మృతదేహంతో ఆంబులెన్స్‌లో చెన్నూర్‌కు బయల్దేరారు. సాయిప్రియతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఆంబులెన్స్‌ను అనుసరిస్తూ వెనుక వస్తున్నారు. గోదావరిఖని సమీపంలో ఉన్న గోదావరి నది బ్రిడ్జి వద్దకు రాగానే సాయిప్రియ తనకు వాంతి అయ్యేలా ఉందనడంతో వాహనాన్ని నిలిపారు. ఆ తర్వాత వాహనం దిగిన ఆమె వంతెనపై కొద్దిసేపు అటూ ఇటూ తిరిగి ఒక్కసారిగా నదిలోకి దూకింది. పెద్దగా శబ్దం రావడంతో కుటుంబ సభ్యు లు ఏం జరిగిందోనని వాహనం దిగి చూసి.. సాయిప్రియ గోదావరిలో దూకినట్టు నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గల్లంతైన ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు. సాయంత్రం వరకు ఆచూకీ దొరకలేదు. తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న సాయిప్రియ తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఇలా నదిలో దూకడం బంధువులను మరింత కుంగదీసింది.

చెన్నూర్‌, కోటపల్లిలో విషాదం..

కోటపల్లి ఆశ్రమ పాఠశాలలో సీఆర్‌టీగా పనిచేస్తున్న సాయిప్రియ తన తండ్రి మరణం తట్టుకోలేక గోదావరి నదిలోకి దూకడంతో స్వగ్రామం చెన్నూర్‌తో పాటు కోటపల్లి ఆశ్రమ పాఠశాలలో విషాదం నెలకొంది. ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న ఆమె నదిలోకి దూకిందనే వార్త విని తోటి ఉపాధ్యాయులు విలపించారు. వసంతానికి మొత్తం ఏడుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు కాగా సాయిప్రియ చిన్న కుమార్తె.


logo
>>>>>>