శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 17, 2020 , 01:57:22

మొక్కలు నాటుదాం..కానుక ఇద్దాం..

మొక్కలు నాటుదాం..కానుక ఇద్దాం..

( పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ) తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం తగ్గిపోయి, ప్రకృతి విధ్వంసం పెరిగిన తర్వాత వన్యప్రాణులు జనారణ్యంలోకి రావడం ప్రారంభించాయి. ముఖ్యంగా కోతులు నివాస ప్రాంతాల్లో చొరబడి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అడవుల్లో వాటికి ఆహారాన్ని అందించే చెట్లను నరకడంవల్ల కోతులు జనజీవనంలోకి వస్తున్నాయనే యధార్థాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమా న్ని ప్రారంభించారు. విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పెంచడమే లక్ష్యంగా ఏటా ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 


మొక్కల పెంచడం కోసం చట్టం.. 

మొక్కలను నాటడమే కాదు, వాటిని సంరక్షించే బాధ్యతలను చట్టం రూపంలో తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. పంచాయతీ రాజ్‌ చట్టంతో నర్సరీల పెంపకం బాధ్యతలను పంచాయతీలకు అప్పగించారు. నాటిన మొక్కల్లో 85 శాతం బతికించని పక్షంలో సంబంధిత పంచాయతీలపై కఠిన చర్యలు తీసుకునేలా పంచాయతీ రాజ్‌ చట్టం-2018లో రూపొందించారు. ఈ చట్టంతో ప్రజల్లో అవగాహన పెరిగింది. నాటిన మొక్కలను సంరక్షించాలనే బాధ్యతను ఈ చట్టం తప్పనిసరి చేసింది. ఇప్పుడు గ్రామా ల్లో హరిత హారం మొక్కలంటే ప్రత్యేకంగా చూడబడుతున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలను పీకేసినా, పశువులచే మేపినా పంచాయతీలు పెద్ద మొత్తంలో జరిమానాలు వసూలు చేస్తున్నాయి. అంతే కాకుండా ప్రతి పంచాయతీ పరిధిలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుకొని వాటిని అదే గ్రామా ల్లో నాటుకుని సంరక్షించించుకునే విధంగా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకున్నారు. గతంలో మొక్కలు కావాలంటే ఎక్కడికి వెళ్లి తెచ్చుకోవాలో తెలియని పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రతి గ్రామంలో మొక్కలు లభించే పరిస్థితిని సీఎం తెచ్చారని చెప్పవచ్చు. దీంతో గ్రామాల్లో ఇపుడు ఏ కాలంలోనైనా మొక్కలు నాటుకుని సంరక్షించుకోవాలనే సామాజిక బాధ్యత ప్రజకు క్రమంగా అలవడుతున్నది. పూలు, పండ్ల మొక్కలే కాదు నీడ నిచ్చేవి, భవిష్యత్తులో ఆదాయాన్ని సమకూర్చే మొక్కలు కూడా ఇపుడు గ్రామాల నర్సరీల్లో అందుబాటులో ఉంటున్నాయి. 


పుట్టిన రోజు కానుకగా.. 

పర్యావరణ ప్రేమికుడుగా, తెలంగాణను ఆకుపచ్చ లోగిలా మార్చాలని కలలుగంటున్న సీఎం కేసీఆర్‌ 66వ పుట్టిన రోజు సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఇటు ప్రభుత్వ యంత్రాంగం, అటు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు నిర్ణయించుకోవడం హర్షనీయం. సో మవారం ఆయన పుట్టిన రోజున ఒక్కో కార్యకర్త ఒక్కో మొక్కను నాటాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీ రామారావు పిలుపు నిచ్చారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సిద్ధపడుతున్నారు. ఎక్కడి వారు అక్కడే మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు కార్యకర్తలను పెద్ద ఎత్తున కదిలించే పరిస్థితి కనిపిస్తున్నది. ఇక ప్రభుత్వ పరంగా కూడా కేసీఆర్‌ పుట్టిన రోజు మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. . పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆధ్వర్యంలో సైతం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు గాను నూతన కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. ఇటు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తమ ప్రియతమ నేత పుట్టిన రోజున నాటిన మొక్కలను కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.. 


గ్రీన్‌ పట్టణాలకు శ్రీకారం.. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా రామగుండం నగరంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో 1500 మొక్కలను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హరిత కానుకగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పెద్దపల్లి మున్సిపాల్టీ ఆధ్వర్యంలో, మంథని మున్సిపాల్టీ పరిధిలో 500 చొప్పున మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ దాసరి మమతారెడ్డి, మంథని మున్సిపల్‌ చైర్మన్‌ పుట్ట శైలజ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  ఇక పెద్దపల్లి మున్సిపల్‌ పరిధిలో 18వ వార్డు కౌన్సిలర్‌ కొలిపాక శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో తెనుగువాడలో భారీ సంఖ్యలో నాటేందుకు ఏర్పాట్లు చేశారు. logo