శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 13, 2020 , 03:20:05

‘రైతు బంధు’వు

 ‘రైతు బంధు’వు

(పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ):రైతులకు పంట పెట్టుబడి కష్టాలను దూరం చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘రైతుబంధు’ను అమల్లోకి తెచ్చారు. తనకు అన్ని విధాలా కలిసొచ్చిన ఉమ్మడి జిల్లాలోనే ఈ పథకాన్ని ప్రారంభించారు. 2018 మే 10న హుజూరాబాద్‌ మండలం ఇందిరానగర్‌- శాలపల్లిలో స్వయంగా సీఎం ప్రారంభించారు. ఏటా రెండు సీజన్లలో సాయం అందిస్తున్నారు. మొదట 2018 వానాకాలం పంటల కోసం ఎకరాకు 4 వేల చొప్పున రైతులకు చెక్కుల రూపంలో అందించారు. జిల్లాలో తొలి విడత వానాకాలం పంటకు 1,27,733 మంది రైతులకు 95.77 కోట్ల విలువైన చెక్కులు ఇచ్చారు. రెండో విడత కింద 1,16,731 మంది పట్టాదారులకు 99.3 కోట్లు మంజూరు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం కేసీఆర్‌ ఎకరాకు అందించే సాయాన్ని 4 వేల నుంచి 5 వేలకు పెంచారు. గత వానాకాలం సీజన్‌ నుంచి ఎకరాకు 5 వేల చొప్పున ఏటా 10 వేల పెట్టుబడి సాయం ఇస్తున్నారు. ఇక ప్రస్తుత యాసంగి సీజన్‌లో 1,06,320 మంది రైతులకు 113.94 కోట్లు మంజూరు చేసి, ఇప్పటికే 56,148మంది రైతుల ఖాతాల్లో 28 కోట్లు జమ చేశారు. మిగతా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని వ్యవసాయ శాఖ అధికారులు శరవేగంగా జమ చేస్తున్నారు. 

కష్టకాలంలోనూ అండ.. 

దేశంలో ఆర్థిక మాద్యం చోటు చేసుకున్న ప్రస్తుత సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలిచింది. రైతు పక్షపాతిగా పేరున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఏనాడు వెనకడుగు వేయలేదు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, రైతులను ఆదుకునేందుకు రైతుబంధు నిధులను విడుదల చేశారు. ప్రతి సీజన్‌లో ఎకరాకు 5 వేల చొప్పున ఇస్తుండగా, ఈ సీజన్‌లో జిల్లా రైతుల కోసం 113.94 కోట్లు మంజూరు చేశారు. వచ్చిన సాయాన్ని అధికారులు శరవేగంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ సమాచారం మేరకు ఇప్పటి వరకు 1,06,320 మంది రైతులకు పెట్టుబడి సాయం మంజూరు చేస్తూ ట్రెజరీకి పంపించారు. ఇందులో 56,148 మంది ఖాతాల్లో 28 కోట్లు జమ చేశారు. ఇంకా కేవలం 50,172 మందికి అందించాల్సి ఉండగా, త్వరలోనే జమ చేయనున్నారు. కష్టకాలంలోనూ పెట్టుబడి సాయాన్ని అందించాలని సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో కాస్త ఆలస్యంగా పెట్టుబడి అందినా ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకొని సర్దుకుపోతున్నారు.

అన్నదాతల ధీమా.. 

రెండేళ్ల కిత్రం వరకు పెట్టుబడి కోసం రైతులు పడరాని పాట్లు పడేవారు. బ్యాంకుల చుట్టూ రుణాల కోసం తిరిగే వారు. అక్కడ రుణం లభించకపోతే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకొని పెట్టుబడులు నెట్టుకొచ్చేవారు. ఇలా చేసిన అప్పులు తీర్చలేక, నెల నెలా వడ్డీలు కట్ట లేక సతమతమయ్యే వారు. వీటన్నింటిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, పెట్టుబడి కోసం ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునే లక్ష్యంతో రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. ఎకరాకు 5వేల చొప్పున పెట్టబడి సాయం అందుతుండగా రైతులు సంతోషంగా సాగుకు సిద్ధమవుతున్నారు. అప్పుల జోలికి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయంతో విత్తనాలు, ఎరువులు కొంటున్నారు. ఇటు నిరంతర ఉచిత కరెంట్‌, పుష్కలంగా కాళేశ్వర జలాలు వస్తుండడంతో సంబురంగా సేద్యం చేసుకుంటున్నారు. కలుపు కూలీలు, ఎరువుల కోసం ఇప్పుడు అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు.


logo