సోమవారం 30 మార్చి 2020
Peddapalli - Feb 12, 2020 , 04:27:13

ఆదర్శవంతమైన పాలన కొనసాగిద్దాం

ఆదర్శవంతమైన పాలన కొనసాగిద్దాం

గోదావరిఖని టౌన్‌: రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఆదర్శవంత పాలన కొనసాగిద్దామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేషన్‌కు అవినీతి మచ్చరాకుండా అధికారులు సంబంధిత సిబ్బంది నీతివంతమైన పాలన వైపు అడుగులు వేయాలని సూచించారు. ప్రస్తుత పాలకవర్గంలో మేయర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌, కమిషనర్‌గా నూతనంగా వారంరోజుల క్రితం ఓ ఐఏఎస్‌ అధికారిని నియమించారన్నారు. ఈ ప్రాంతానికి, పరిపాలనకు కొత్త వారైన వీరు ఆచితూచి అడుగులు వేయాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ నగరాలకు ఏటా రూ.100కోట్లు ప్రత్యేక నిధులు కింద కేటాయించి స్మార్ట్‌ సిటీలుగా రూపుదిద్దేందుకు కృషి చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు లబ్ధిదారులకు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు. అధికారి నుంచి సిబ్బంది వరకు అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించరాదని నొక్కి చెప్పారు. పేద ప్రజలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్లు జవాబుదారీతనంగా ఉండే విధంగా సంబంధిత అధికారులు, సిబ్బంది వ్యవహరించాలని పేర్కొన్నారు. పరిశుభ్రత కార్యక్రమాలకు వినియోగిస్తున్న వస్తువులు నాణ్యమైనవి కొనుగోలు చేయాలని  సూచించారు. సమావేశంలో నగర కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌రావుతోపాటు వివిధ శాఖల అధిపతులు, అధికారులు మహేందర్‌, సుచరణ్‌, కిష్టఫర్‌, శంకర్‌రావు, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.  


logo