సోమవారం 06 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 11, 2020 , 03:52:46

సహ‘కారు’ జోరు

సహ‘కారు’ జోరు
  • టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థుల విజయభేరి
  • ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
  • 260స్థానాల్లో 107 ఏకగ్రీవం
  • జిల్లాలో ఐదు పీఏసీఎస్‌లు కైవసం
  • నందిమేడారం, మేడిపల్లి, ధూళికట్టలో క్లీన్‌స్వీప్‌
  • అప్పన్నపేట, చిన్నకల్వలలో సంపూర్ణ మెజారిటీ

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ నాడే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయభేరి మోగించారు. ఆయాచోట్ల సింగిల్‌ నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికై, జిల్లాలోని ఐదు పీఏసీఎస్‌లను కైవసం చేసుకున్నారు. మొత్తంగా మెజార్టీ స్థానాల్లో గులాబీ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికవడంతో శ్రేణుల్లో నయాజోష్‌ నెలకొన్నది. జిల్లాలో మొత్తం 20 ప్రాథమిక సహకార సంఘాలు ఉండగా, ఒక్కో పీఏసీఎస్‌ పరిధిలో 13 ప్రాదేశిక నియోజకవర్గాలచొప్పున మొత్తంగా 260 డెరెక్టర్‌ స్థానాలు ఉన్నాయి. ఈ నెల 6 నుంచి 8 వరకు నామినేషన్ల స్వీకరించగా, మొత్తంగా 934 మంది దరఖాస్తులు సమర్పించారు. అయితే ఉససంహరణ నాటికి మెజార్టీ స్థానాల్లో సింగిల్‌ నామినేషన్లు మాత్రమే ఉండడంతో పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 


మూడు సంఘాల్లో క్లీన్‌ స్వీప్‌..

ధర్మారం మండలం నందిమేడారం పీఏసీఎస్‌ పరిధిలో మొత్తం 13స్థానాలకు 13 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే క్లీన్‌ స్వీప్‌ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ సమయానికి కేవలం సింగిల్‌ నామినేషన్లు మాత్రమే ఉండడంతో ఇక్కడ పోటీలో ఉన్న టీఆర్‌ఎస్‌ మద్దతురాలే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అలాగే అంతర్గాం మండలం మేడిపల్లి సంఘం, ఎలిగేడు మండలం ధూళికట్టలోనూ 13 స్థానాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఎన్నికలకు ముందే ఈ మూడు సొసైటీల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. 


అప్పన్నపేట, చిన్నకల్వల కైవసం.. 

పెద్దపల్లి మండలం అప్పన్నపేట పరిధిలో 13స్థానాల్లోనూ తొమ్మిదిచోట్ల సింగిల్‌ నామినేషన్‌ మాత్రమే దాఖలు కావడంతో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అలాగే చిన్న కల్వల పీఏసీఎస్‌ పరిధిలోని 13స్థానాల్లో మెజార్టీ స్థానాలైన ఏడు చోట్ల సింగిల్‌ నామినేషన్‌ మాత్రమే మిగలడంతో ఏక్రగ్రీమైనట్లు ప్రకటించారు. దీంతో ఈ రెండు సంఘాల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులకు సంపూర్ణ మెజార్టీ ఉం డడంతో చైర్మన్‌ గిరి పార్టీ ఖాతాలోనే పడబోతున్నది. 


260లో 107 ఏకగ్రీవం.. 

జిల్లాలోని 20 పీఏసీఎస్‌ల పరిధిలో 260ప్రాదేశిక నియోజకవర్గాలుండగా, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 107 చోట్ల ఒకరు మాత్రమే బరిలో ఉండడంతో వారంతా ఏకగ్రీవమైనట్లు జిల్లా సహకార అధికారి చంద్రప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఏకగ్రీవమైన వారంతా టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులే కావడం విశేషం. అయితే, ఇప్పటికే ఐదు సొసైటీల్లో టీఆర్‌ఎస్‌ఖాతాలోనే పడగా, మరికొన్ని చోట్లా మెజార్టీకి దగ్గరగా ఉన్నారు. కూనారంలో 6, జూలపల్లిలో 6, మంథని 5, కనుకుల 5, ఎలిగేడుల్లో 5, కమాన్‌పూర్‌లలో 5, పత్తిపాకలో 4, సుల్తానాబాద్‌ 4, పెద్దపల్లి 4 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పొత్కపల్లి పీఏసీఎస్‌ మినహా, ఆయా సంఘాల్లో ఒకటి, రెండు స్థానాల చొప్పున యునానిమస్‌ అయ్యాయి. 


logo