సోమవారం 06 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 11, 2020 , 03:51:04

ప్రజా సమస్యలపై అలసత్వం వద్దు

ప్రజా సమస్యలపై అలసత్వం వద్దు
  • ప్రజావాణి అర్జీదారులందరికీ రసీదులు ఇవ్వాలి
  • కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ దరఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ ప్రారంభం
  • ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు
  • ఇక నుంచి ప్రతి శనివారం సమీక్ష ఉంటుందని వెల్లడి


కలెక్టరేట్‌ : ప్రజా సమస్యలు పరిష్కరించడం లో సంబంధిత శాఖల అధికారులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని కలెక్టర్‌ సిక్తా పట్నాయ్‌ ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మం దిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జేసీ వనజాదేవితో కలిసి కలెక్టర్‌ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాలు, ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 62 దరఖాస్తులు రాగా, వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని సంబంధిత శాఖలకు బదిలీ చేశారు. ప్రజావాణి సందర్భంగా వచ్చిన ప్రజల సమస్యలు వింటూనే, వెంటనే సంబంధిత శాఖల అధికారులకు ఫోన్‌ చేసి సమస్యను వివరిస్తూ పరిష్కారం చూపాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజ ల దరఖాస్తులకు పరిష్కారం చూపుతూ లిఖితపూర్వక సమాధానాలు అందించాలనీ, ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారికి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని ఆదేశించారు. 


సమస్యల పరిష్కారానికే ఆన్‌లైన్‌.. 

జిల్లాలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. పెద్దపల్లి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాక మొట్టమొదటిసారిగా ప్రజావాణిలో పాల్గొన్న సిక్తా పట్నాయక్‌, ఓ వైపు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటూనే సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభించి, మండలకేంద్రాల్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమ వివరాలను సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ పరిష్కార మార్గాలు చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శనివారం ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులపై తీసుకున్న చర్యలపై సమీక్ష ఉంటుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లాలోని తాసిల్‌ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులెవరూ కూడా నిర్లక్ష్యం ప్రదర్శించరాదన్నారు. ఇన్‌చార్జి ఆర్డీవో కే నర్సింహమూర్తి, పెద్దపల్లి ఆర్డీవో శంకర్‌కుమార్‌, కలెక్టర్‌ కార్యాలయ ఏవో కేవైకే ప్రసాద్‌ పాల్గొన్నారు.


logo