శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 10, 2020 , 02:38:36

కాంగ్రెస్‌ది ముగిసిన కథ

కాంగ్రెస్‌ది ముగిసిన కథ

మంథనిటౌన్‌ : ఐదు దశాబ్ధాలకు పైగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మంథని ప్రాంతంలో, ఇక ఆ పార్టీ కథ ముగిసిందని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ పేర్కొన్నారు. మండలంలోని ఎక్లాస్‌పూర్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు మాజీ సర్పంచ్‌, మాజీ ఎంపీటీసీ లోడారి రాములు, మాజీ సర్పంచ్‌ లోడారి ప్రమీళ దంపతులు, ఖాన్‌సాయిపేటకు చెందిన కుడుదల రాము, ముత్తారం మండల కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి మెంగని తిరుపతి పుట్ట మధు సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరికి జడ్పీ చైర్మన్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోడారి రాములు కుటుంబం తాతల కాలం నుంచి కాంగ్రెస్‌ పార్టీ వాదులనీ, శ్రీపాదరావు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ ఆయనకు అండగా నిలిచిన చాలా మంది ప్రస్తుతం పార్టీని వీడే స్థితికి రావడానికి ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అనుసరిస్తున్న విధానాలే కారణమని దుయ్యబట్టారు. పార్టీ కోసం కష్ట పడిన వారి సేవలను గుర్తించకుండా శ్రీధర్‌బాబు అవమానపరుస్తుండడంతో వారంతా ఆత్మాభిమానం చంపుకోలేక టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. దొడ్డిదారిన ఎన్నికల్లో గెలిచినప్పటికీ స్థానికంగా ప్రజలకు, పార్టీ క్యాడర్‌కు అందుబాటులో ఉండకుండా పట్టణాల్లో తిరుగుతూ ఒంటెద్దు పోకడలతో వ్యవహరించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. 10 రోజులకోసారి చుట్టపు చూపుగా వస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు వచ్చిపోవడం తప్ప ప్రజలకు, పార్టీ శ్రేణులకు చేస్తుంది ఏమీ లేదన్నారు. దీంతో చాలా మంది కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై, గులాబీ దళంలో చేరేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల నుంచి అనేక మంది కాంగ్రెస్‌ పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారని గుర్తు చేశారు. చాలా మంది ముఖ్య నాయకులు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగయ్యే అవకాశాలు దగ్గర పడుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం, గ్రామాల్లో మౌళిక వసతుల కల్పన లాంటి లక్ష్యాలతో ముందుకు సాగుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గంలో మరింతగా బలపడుతున్నదని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో శ్రీధర్‌బాబు విధానాలు నచ్చక ఆసంతృప్తిగా ఉన్న శ్రేణులంతా స్వచ్ఛందంగా పార్టీ వీడి, టీఆర్‌ఎస్‌లో చేరడానికి వస్తే వారిని స్వాగతిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తగరం శంకర్‌లాల్‌, బత్తుల సత్యనారాయణ, రాజబాపు, ఐయిలి రవి, సత్యనారాయణ, మంథని లక్ష్మణ్‌, సదానందం తదితరులు పాల్గొన్నారు. logo