బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 10, 2020 , 02:39:56

21న ఖనిలో శివరాత్రి జాగరణ మహోత్సవం

21న ఖనిలో శివరాత్రి జాగరణ మహోత్సవం

రాంమందిర్‌ ఏరియా : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 21న గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో విజయమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మహాశివరాత్రి జాగరణ మహోత్స వం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల ఆలోచనల మేరకు ప్రజల్లో భక్తిభావం పెంపొందించడానికి మహోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. శివరాత్రి రోజు సాయంత్రం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కళాకారుల ప్రదర్శనలు ఉంటాయన్నారు. రామగుండం ప్రాంతంలోని కళారంగంలో ప్రావీణ్యం ఉన్న కళాకారులు పాల్గొని, వారి ప్రతిభను ప్రదర్శించాలని  కోరారు. జాగరణ కార్యక్రమం నిర్వాహణకు కమిటీని నియమించామని, కమిటీ కన్వీనర్‌గా తాను వ్యవహరిస్తానని మిగితా సభ్యులను నియమించినట్లు  పేర్కొన్నారు. జానపద నృత్యాలు, కోలాటం, క్లాసికల్‌ డ్యాన్స్‌, సినీ, భక్తి పాటలు సీనియర్‌, జూనియర్‌ విభాగంలో పోటీలు ఉంటాయని తెలిపారు. పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందచేయనున్నామని, మొదటి బహుమతి రూ.3వేలు, రెండో బహుమతి రూ.2వేలు, మూడో బహుమతి రూ.1 వేయి ఇవ్వనున్నామని చెప్పారు. పోటీల్లో పాల్గొనే కళాకారులు తమ పేర్లను ఈనెల 16వ తేదీలోపు తమ పేర్లను డాన్స్‌ మాస్టర్లు సర్వేశ్‌, సందీప్‌ సెల్‌ నంబర్‌ 9849109100, 8074770667 లో సంప్రదించి, పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రామగుండం ప్రాంతంలో జాగరణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తామని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నగర డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, నాయకులు పీటీ స్వామి, తానిపర్తి గోపాల్‌ రావు, పాతిపెల్లి ఎల్లయ్య, తోడేటి శంకర్‌గౌడ్‌, జాగరణ కమిటీ సభ్యులు దయానంద్‌ గాంధీ, దామెర శంకర్‌, డా.జ్యోతి, డాన్స్‌ మాస్టర్లు సర్వేశ్‌, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాగరణ మహోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. 


logo
>>>>>>