మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Feb 10, 2020 , 02:31:32

క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి

క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి

యైటింక్లయిన్‌ కాలనీ : క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమనీ, వాటిని సమానంగా స్వీకరించి మంచి క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగితేనే విజయాలు సాధిస్తారని ఆర్జీ-2 ఎస్‌ఓటూ జీఎం చందనాల సాంబయ్య పేర్కొన్నారు. స్థానిక అబ్ధుల్‌ కలాం క్రీడా మైదానంలో ఆదివారం అఖిల్‌ ఫ్రెండ్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పరశురాం అఖిల్‌కుమార్‌ స్మారక తెలంగాణ స్టేట్‌ సౌత్‌ జోన్‌ 11ఏ ఇన్విటేషన్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించగా, ఆయన ముఖ్యతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. ముందుగా అఖిల్‌ తల్లిదండ్రులు పరశరాం, విజయలక్ష్మి ముఖేశ్‌లతో కలిసి అఖిల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర స్థాయి నుంచి పోటీలకు హాజరైన 19 జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకొని టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలను రాణించేలా ప్రతి రోజు సాధన చేయాలని సూచించారు. మనం ఎంచుకున్న క్రీడలపై మక్కువ పెంచుకుని నిరంతర సాధన చేయడంతోనే అత్యున్నత ప్రదర్శన చేయగలుగుతామని తెలిపారు. క్రీడా పోటీల ద్వారా వ్యక్తిగతంగా రాణించడంతోపాటు జట్టు గెలుపులో ప్రధాన పాత్ర పోషించేలా క్రీడాకారులు తమ శక్తిని ప్రదర్శించాలన్నారు. గత క్రీడల్లో చేసిన తప్పులను పునరావృతం గాకుండా వాటిని గుర్తించి జట్టు విజయ లక్ష్యమే దృష్టిలో పెట్టుకొని రాణించాలని కోరారు. చిన్న వయసులోనే అఖిల్‌ ఫుట్‌బాల్‌లో జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయమనీ, దీనికి ప్రోత్సహించిన తల్లిదండ్రులు ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా ఉన్నారన్నారు. అలాంటి క్రీడాకారుడు మనమధ్య లేకపోవడం ఎంతో లోటని, ఆ క్రీడాకారున్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర స్థాయిలో రాణించడంతోపాటు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకరావాలని కోరారు.

హోరాహోరీగా పోటీలు 

ఇన్విటేషన్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ అబ్ధుల్‌ కలాం క్రీడా మైదానంలో జరగగా, ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 19 జట్లు పాల్గొని తమ క్రీడా ప్రదర్శన చేశాయి. ఇందులో రామగుండం-2, ఇల్లందు, బెల్లంపల్లి, నర్సంపేట, రామగుండం-1, హుజురాబాద్‌, మహబూబ్‌బాద్‌, మంథని జేఎన్‌టీయూ, గోదావరిఖని, కరీంనగర్‌, సుల్తానాబాద్‌, భూపాలపల్లి, మందమర్రి, వరంగల్‌, కాలనీ బీ, బెల్లంపల్లి ఏ, కరీంనగర్‌ తదితర జట్లు నాకౌట్‌ పద్ధతిలో జరిగిన పోటీల్లో తలపడ్డాయి. హోరాహోరీగా జరిగిన నాకౌట్‌ పోటీల్లో సెమీ ఫైనల్‌లో కాలనీ జట్టుపై కరీంనగర్‌ జట్టు ఫెనాల్టీ షూట్‌ ఔట్‌లో 3-2 గోల్స్‌తో ఫైనల్‌కు చేరగా, మరో సెమీ ఫైనల్‌లో రామగుండం, మంచిర్యాల జట్టుపై 4-2 గోల్స్‌తో విజయం సాధించింది. దీనితో కరీంనగర్‌, రామగుండం జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. వర్షం కురవడం వల్ల ఫైనల్‌పోటీలలకు అంతరాయం కలిగింది. కార్యక్రమంలో ఆర్జీ-2 అధికార ప్రతినిధి ప్రదీప్‌కుమార్‌, గుర్తింపు సంఘం డివిజన్‌ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్‌, సీఈఆర్‌ క్లబ్‌ సెక్రెటరీ సయ్యద్‌ అహ్మద్‌, టోర్నమెంట్‌ నిర్వాహకులు పరశురాం అశిష్‌కుమార్‌, పాశం ఓదెలు, కటకం సత్యం, పాశం శ్రీనివాస్‌, అనిఫ్‌, సునీల్‌, పృథ్వీ, అభిషేక్‌, నాగేంద్ర, శివ, అబ్ధుల్‌ తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>