గురువారం 09 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 08, 2020 , 03:18:35

నులిపురుగును నలిపేద్దాం..

నులిపురుగును నలిపేద్దాం..

కలెక్టరేట్‌: 19 ఏళ్లలోపు పిల్లల్లో రక్తహీనతకు కారణమయ్యే నులిపురుగుల నివారణపై సమరభేరి మోగించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ నెల 10న జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని పురస్కరించుకుని యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసుకున్నది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఏడాది నుంచి 19 ఏళ్లలోపు పిల్లలను 1,96,785మందిని గుర్తించి వారికి ఈనెల 10న అల్బెండజోల్‌ మాత్రలు మింగించేందుకు కార్యచరణ రూపొందించి అందుకోసం ఇప్పటికే జిల్లాకు 2,16,464మాత్రలను తెప్పించి అందుబాటులో ఉంచింది. జిల్లాలోని పెద్దపల్లి, మంథని డివిజన్లుగా 14 మండలాల్లోని 17 పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల ద్వారా మాత్రలను మింగించేందుకు చర్యలు చేపట్టింది. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్న ఉద్దేశంతో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ రెండు రోజుల క్రితమే కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేస్తూ ఆదేశాలు జారీచేశారు. అందుకు సంబంధించిన అవగాహన ర్యాలీని శనివారం కలెక్టరేట్‌ వద్ద సిక్తా పట్నాయక్‌ జెండా ఊపి ప్రారంభించనున్నారు. 


జిల్లాలోని 58 ప్రభుత్వ ఎయిడెడ్‌, ప్రభుత్వ ఐటీఐ, టెక్నికల్‌ కళాశాలలు, 767 ప్రభుత్వ ఎయిడెడ్‌, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో, 706 అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఏడాది నుంచి 19 ఏళ్లలోపు పిల్లందరికీ అల్బెండజోల్‌ మాత్రలు మింగించేలా చర్యలు చేపట్టారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నమోదైన వారు 32,917 మంది కాగా, ఇంకా పేర్లు నమోదు కాని 8282మందికి మాత్రలు వేయనున్నారు. పాఠశాలల్లో విద్యాభ్యాసం చేయని బడిబయటి పిల్లలు 6 నుంచి 19 ఏళ్లలోపు వారు 10,231 మంది, పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో 1,45,357 మందికి మాత్రలు మింగిచేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జాతీయ నులి పురుగుల నివారణ సందర్భంగా విద్యార్థులకు బడి బయటి పిల్లలకు అల్బెండజోల్‌ మాత్రలు మింగించే కార్యక్రమాన్ని విజయవంతం చేసి లక్ష్యాన్ని అధిగమించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా 514 మంది ఆశావర్కర్లు, 706 మంది అంగన్‌వాడీ టీచర్లు, 825 మంది ఇతర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులతో  అల్బెండజోల్‌ మాత్రలను మింగించేందుకు చర్యలు చేపట్టారు. 


ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా..

రాఘవాపూర్‌లో 18,962, రాగినేడులో 10,451, నందిమేడారంలో 15,553, కాల్వశ్రీరాంపూర్‌లో 72,71, ఓదెలలో 4,595, కొలనూర్‌లో 3,732, గర్రెపల్లిలో 13,487, జూలపల్లిలో 5,311, ఎలిగేడులో 4,324, పుట్నూరులో 3,224, బసంత్‌నగర్‌లో 8,302, రామగుండం (పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ)లో 67,091, గద్దలపల్లిలో 15,152, కమాన్‌పూర్‌లో 13,629, ముత్తారంలో 5,701 చొప్పున మొత్తం 1,96,785 మందికి అల్బెండజోల్‌ మాత్రలు మింగించేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్నిఏర్పాట్లు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి  డాక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. 


logo