సోమవారం 30 మార్చి 2020
Peddapalli - Feb 06, 2020 , 03:06:48

గద్దెపైకి సారలమ్మ

గద్దెపైకి సారలమ్మ

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/గోదావరిఖని టౌన్‌: సమ్మక్క-సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల నడుమ కుంకుమభరిణె రూపంలో ఉన్న సారలమ్మ బుధవారం సాయంత్రం గద్దెలపైకి తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 50 చోట్లకు పైగా జాతరలు మొదలు కాగా, ఉదయం నుంచే భక్తులు తరలివచ్చారు. మొదటి రోజే రెండు లక్షల మందికిపైగా భక్తులు సారలమ్మను దర్శించుకున్నారు. ప్రధానంగా రేకుర్తి, కేశవపట్నం, హుజూరాబాద్‌ శివారులోని రంగనాయకులగుట్ట, వీణవంక, గోదావరిఖని, గోలివాడ, నీరుకుల్ల, కొలనూర్‌, హన్మంతునిపేట, జాతర్లకు పోటెత్తారు. చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డి, కరీంనగర్‌ మండలం రేకుర్తిలో నగరపాలక సంస్థ వల్లూరి క్రాంతి పూజలు చేశారు.


పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, రామగుండం మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ దర్శించుకున్నారు. అంతర్గాం మండలం గోలివాడలో జాతరను కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, సుల్తానాబాద్‌ మండలం నీరుకుల్లలో జేసీ వనజాదేవి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రేకుర్తిలో ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా పోలీస్‌ సీఐ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు, ఎన్‌సీసీ కేడెట్లు జాతర వద్ద సేవలు చేపడుతున్నారు. ఇక్కడ వ్యవస్థాపక చైర్మన్‌ శ్రీనివాస్‌, స్థానిక ప్రజాప్రతినిధులు ఎస్‌ మాధవి, నాయకులు పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌, నరేశ్‌, సతీశ్‌, తదితరులు పాల్గొన్నారు.


నేడు గద్దెలపైకి సమ్మక్క..

తల్లి సమ్మక్క నేటి సాయంత్రం గద్దెలపైకి వేంచేయనున్నది. గురు, శుక్ర, శనివారాల్లో తల్లీబిడ్డలకు మొక్కులు అప్పజెప్పేందుకు లక్షలాది మంది రానున్నారు. మొత్తం 10 లక్షలకుపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, ఉత్సవ కమిటీల సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.logo