గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 05, 2020 , 02:41:39

తల్లీ వస్తున్నాం...

తల్లీ వస్తున్నాం...
  • నేటి నుంచే వనదేవతల జాతర
  • నేడు గద్దెకు సారలమ్మ
  • రేపు సమ్మక్క రాక
  • ఎల్లుండి మొక్కులు
  • పూర్తయిన ఏర్పాట్లు
  • తరలివస్తున్న భక్తులు

పెద్దపల్లి ప్రతినిధి,  నమస్తే తెలంగాణ/ సుల్తానాబాద్‌రూరల్‌/ ఓదెల/ ధర్మారం : ‘తల్లీ వస్తున్నాం.. నిలువెత్తు బంగారం తెస్తున్నాం..’ అంటూ తరలివచ్చే భక్తులతో నేటి నుంచి దారులన్నీ సమ్మక్క దిక్కే సాగనున్నాయి. బుధవారం బిడ్డ సారలమ్మ రాకతో జిల్లా అంతటా ‘వన’దేవతల జాతరకు తెరలేవనుండగా, మూడు రోజులపాటు ఉత్సవాలు జనసంద్రం కానున్నాయి. మంగళవారం నుంచే తాకిడి మొదలు కాగా, నేటి నుంచి పోటెత్తనున్నాయి. నేటి నుంచి సమ్మక్క సారలమ్మ జాతరకు తెరలేవనున్నది. బుధవారం నుంచి శనివారం దాకా ఉమ్మడి జిల్లాలోని సుమారు 60 ప్రాంతాల్లో జాతర కన్నుల పండువగా జరగనున్నది. ఇందులో 32 జాతరలను దేవాదాయశాఖ గుర్తించి, ఏర్పాట్లను ముమ్మరం చేసింది. 


నాలుగు రోజుల ఉత్సవాలు..

ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క, సారలమ్మ జాతర మేడారంతోపాటు అన్ని జిల్లాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంతటా ఉత్సవాలు నాలుగు రోజులపాటు ఒకే తీరున సాగుతాయి. గట్టమతల్లి పూజలు, ఎదురుకోళ్ల సమర్పణ, ఒడి బియ్యం, శివసత్తుల పూనకాలు, బెల్లం తూకాలు, కోయ, గోండు గిరిజన నృత్యాలు, అబ్బియ రాగాలు.. ఇలా అంతటా ఒకే తీరున కనిపిస్తాయి. మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను నిర్వహిస్తారు. కోయపూజారులు తమ పద్ధతుల్లో ఉత్సవాలు జరుపుతారు. మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను, రెండో రోజు చిలుకల గుట్టలో కుంకుమ భరిణె రూపాన ఉన్న సమ్మక్కను గద్దెకు తీసుకువస్తారు. డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ ఆహ్వానించి ప్రతిష్ఠిస్తారు. మొదటి రోజు నుంచే తరలివచ్చే భక్తులు, మూడో రోజు పెద్దసంఖ్యలో వచ్చి తల్లీబిడ్డలకు మొక్కులు అప్పజెప్పుతారు. నాలుగో రోజు వనదేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు.


నెల ముందు నుంచే మొక్కులు.. 

మాఘశుద్ధ పౌర్ణమి నెల మొదలైన రోజు నుంచే వన దేవతలకు మొక్కులు చెల్లిస్తారు. యాటలు, కోళ్లు బలిచ్చి ఎవరింట్లో వాళ్లు సమ్మక్కను కొలుస్తారు. జాతర్లకు వెళ్లే ముందు వేములవాడ రాజన్నను ఆనవాయితీగా దర్శించుకుంటారు. తర్వాత తల్లులకు అతి ప్రీతిపాత్రమైన బంగారం (బెల్లం) అప్పజెప్పుతారు. నిలువెత్తు బంగారం సమర్పిస్తారు. జాతర ఎక్కడ జరిగితే అక్కడికి కుటుంబాలతో వెళ్లి గద్దెలపై ఉన్న అమ్మవార్లను దర్శించుకుంటారు. తలనీలాలు సమర్పిస్తారు.  మహిళలు ఒడిబియ్యంతోపాటు ఇద్దరమ్మలకు కుంకుమ, పసుపు, బంగారం(బెల్లం) సమర్పిస్తారు. రాత్రి ఆయాచోట్లే నిద్రజేసి, తెల్లారి మొ క్కులు అప్పగించాక తిరుగుముఖం పడుతారు. 


జిల్లాలో జాతరలు

ఉమ్మడి జిల్లాలో 60 ప్రాంతాల్లో జాతర కనుల పండువగా జరుగనుండగా, జిల్లాలో 15చోట్ల జాతరలను గుర్తించి దేవాదాయశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అందులో ప్రధానంగా రామగుండం మండలం ఖనిలోని గోదావరి తీరంలో, అంతర్గాం మండలం గోలివాడ, సుల్తానాబాద్‌ మండలం నీరుకుళ్ల, గర్రెపల్లి (న్యూ), ఓదెల మండలం కొలనూర్‌, మడక, కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెగడపల్లి, మీర్జంపేట జాతరలు అపర మేడారాలను తలపిస్తాయి. లక్షలాది మందితో నాలుగు రోజులపాటు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోతాయి. 2018లో గోదావరిఖనిలో జరిగిన జాతరకు 7లక్షలు, నీరుకుల్ల, గోలివాడకు 5లక్షల చొప్పున భక్తులు వచ్చారు. ఇదిలా ఉండగా, మిగతా చోట్ల కూడా వేలాది మందితో రద్దీగా మారనున్నవి. 


logo