సోమవారం 06 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 05, 2020 , 02:40:29

సమర్థవంతమైన విధులతోనే గుర్తింపు

సమర్థవంతమైన విధులతోనే గుర్తింపు

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సమర్థవంతంగా విధులు నిర్వర్తించడంతోనే అధికారులకు మంచి గుర్తింపు వస్తుందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్‌లో శ్రీదేవసేనకు వీడ్కోలు, నూతన కలెక్ట ర్‌ సిక్తా పట్నాయక్‌కు స్వాగత సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి ఈశ్వర్‌, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌, నూతన కలెక్టర్‌తో కలిసి హాజరై శ్రీదేవసేనను సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ప్రణాళికా బద్ధం గా పనిచేసిన ప్రతి అధికారినీ ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని చెప్పా రు. ప్రజా హిత కార్యక్రమాలు గొప్పగా అమలు చేయడంతో జిల్లాకు 5 జాతీయ స్థాయి అవార్డులు లభించాయని పేర్కొ న్నారు. రాష్ట్రంలోని 33జిల్లాల్లో పెద్దపల్లి చిన్నది అయినా ఆదాయం ఎక్కువ ఉన్నదని గుర్తు చేశారు. ఇక్కడ ఉన్న అన్ని వనరులను ఉపయోగించి జిల్లాను దేశ పటంపై ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిన ఘనత శ్రీదేవసేనకు దక్కుతుందన్నారు.


ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూనే వినూత్నమైన కార్యక్రమాలకు రూపకల్పన చేసి వాటిని విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపుగా 3వేల ఎకరాల భూసేకరణలో, ఎంపీ, ఎమ్మెల్యే, సర్పంచ్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్‌ ఇలా అన్ని ఎన్నికల్లోనూ ఇబ్బందులు లేకుండా సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తూనే ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకు సాగారని వివరించారు. ఒకవైపు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూనే పంచసూత్రాలు, సీడ్‌బౌల్స్‌, హరితహారం, ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టి దేశంలోనే అగ్రగామిగా నిలవడం అభినందనీయమన్నారు.  అధికార యంత్రాంగం ఒక జట్టుగా పనిచేయడంతోనే ఇంత గొప్ప విజయం సాధ్యమైందని వివరించారు. శ్రీదేవసేన ఆదిలాబాద్‌ జిల్లాలో సైతం సమర్థవంతంగా పనిచేసి మరింత గొప్ప పేరును తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిక్తా పట్నాయక్‌ సైతం పూర్వపు కలెక్టర్‌ మొదలు పెట్టిన అన్ని కార్యక్రమాలను కొనసాగిస్తూనే మరి న్ని కొత్తవాటికి శ్రీకారం చుట్టాలన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి జిల్లాలో మంచి ప్రజా ప్రతినిధులు ఉన్నారని వివరించారు. ఇక్కడ పనిచేసి వెళ్లే ప్రతి అధికారి ఇదే విషయాన్ని చెబుతారని చెప్పా రు. ప్రజా ప్రతినిధులు, ప్రజల సంపూర్ణ సహాయ సహకారాలతో సిక్తాపట్నాయక్‌ గొప్ప పాలనను జిల్లా ప్రజలకు అందించాలని సూచించారు. 


వీడ్కోలు.. స్వాగతం సమావేశం

ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వెళ్లిన శ్రీదేవసేనను ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి, జడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యేలు, నూతన కలెక్టర్‌, జేసీ వనజాదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, రామగుండం మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు ప్రసగించి ఆమె జిల్లాకు అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు శ్రీదేవసేనను ఘనంగా సన్మానించారు. అదే విధంగా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సిక్తా పట్నాయక్‌ను సైతం మంత్రి, జడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు.  

 

వారి నుంచే కొత్త ఆలోచనలు: శ్రీదేవసేన

జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన కొత్త ఆలోచనలను  అమలు చేయడంతో పెద్దపల్లికి జాతీ య స్థాయిలో గుర్తింపు లభించిందని కలెక్టర్‌గా పనిచేసి ఆదిలాబాద్‌కు బదిలీపై వెళ్లిన అల్లమరాజు శ్రీదేవసేన అన్నారు. జిల్లాను వదిలి వెళుతున్నందుకు ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజల మధ్యకు వెళితేనే అనేక రకాల సమస్యలు తెలిశాయనీ, ప్రజా ప్రతినిధులతో మాట్లాడితేనే అనేక రకాల ఆలోచనలు వచ్చాయని వివరించారు. జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు చూపు ఆలోచనలేనన్నారు. పాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాల ఏర్పాటు చేయడంతో పెద్దపల్ల్లిలో ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఉన్న ఈ 14మండలాల్లో అమలు చేయడం చా లా సులువైందని చెప్పారు. పెద్దపల్లి ఉమ్మడి జిల్లాలో ఉండి ఉంటే.. ఎన్ని కార్యక్రమాలు చేసినా వాటికి గుర్తింపు లభించేది కాదన్నారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఇక్కడ పనిచేసే అధికారులు చాలా గొప్పవారన్నారు. ఇక్కడ తాను చాలా స్వేచ్ఛగా పనిచేశానని వివరించారు. జిల్లాకు లభించిన పేరు ఎప్పటికీ కొనసాగేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆకాంక్షించారు.   


పెరిగిన అవార్డులు: జడ్పీ చైర్మన్‌ మధూకర్‌

తెలంగాణ ఆవిర్భావానికి ముందు ప్రజా ప్రతినిధులు వేరు అధికారులు వేరు అనే భావ న ఉండేదనీ, కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత జిల్లా ఆవిర్భవించిన అనంతరం కలెక్టర్‌గా శ్రీదేవసేన బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ప్రజా ప్రతినిధులు, అధికారులు వేరుకాదనే భావనను తీసుకువచ్చారని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. జిల్లా పాలనాధికారిగా జిల్లాలో పాలనను పరుగులు పెట్టించారన్నారు. గతంలో జిల్లాలో అనేక మంది అధికారుల సస్పెన్షన్లు, సరెండర్లు ఉండేవని అప్పుడు ఎలాంటి అవార్డులు రాలేదని చెప్పారు. శ్రీదేవసేన వచ్చిన తర్వాత అవి తగ్గుముఖం పట్టి అవార్డులు పెరిగాయన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు సంపూర్ణ సహకారాలతోనే ఇది లభించిందన్నారు.  ఇన్ని రకాల ఎన్నికలను శ్రీదేవసేన నేతృత్వంలో అధికారులు సమర్ధవంతగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. నూతన కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సైతం ఇదే స్పూర్తితో పనిచేయాలని సూచించారు. 


శ్రీదేవసేన స్ఫూర్తితో : నూతన కలెక్టర్‌

జిల్లాలో వినూత్న కార్యక్రమాలను నిర్వహించి జాతీయ స్థాయి లో జిల్లాకు అనేక అవార్డులను తీసుకువచ్చిన శ్రీదేవసేన స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని నూతన కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. యువ ఐఏఎస్‌ అధికారులందరికీ శ్రీదేవసేన రోల్‌ మోడల్‌ అన్నారు. గత రెండు రోజుల్లో జిల్లాలో అనేక రకాలైన వినూత్న కార్యక్రమాలను చూశానని వాటిని కొనసాగిస్తూనే మరిన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకువెళతామన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సంపూర్ణ సహా య, సహకారాలతో పాలన సాగిస్తామని ఆమె పేర్కొన్నారు. 


సలహాలు, సూచనలతో: ఎమ్మెల్యే దాసరి

కలెక్టర్‌గా శ్రీదేవసేన జిల్లాలోని అధికారులకు ఒక గైడింగ్‌ ఫోర్స్‌ గా నిత్యం అనేక సలహాలు, సూచనలతో పనిచేయించారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. స్వచ్ఛతలో తాను కలెక్టర్‌ పోటీ పడేవారమని గుర్తు చేశారు. అలాగే హరితహారంలో సైతం తాను, కలెక్టర్‌ భావసారూప్యం కుదిరిందన్నారు. అందుకే చాలా కార్యక్రమాలు పెద్దపల్లి నియోజకవర్గంలో విజయవంతం అయ్యే లా తాను సహకరించానని వివరించారు. నాలుగేళ్ల క్రితం తాను మొదలు పెట్టిన హరిత విప్లవం, స్వచ్చ సమరం కలెక్టర్‌గా శ్రీదేవసేన వచ్చిన తర్వాత తన పని సులువై కార్యక్రమాలు విజయవంతమయ్యాయని చెప్పారు. గవర్నర్‌ సైతం మె చ్చుకునేలా కార్యక్రమాలను నిర్వహించి జిల్లాను జాతీయ పటంపై శ్రీదేవసేన నిలిపారన్నారు. 


ప్రత్యేక కార్యాచరణతో: ఎమ్మెల్యే చందర్‌

ఒక లక్ష్యాన్ని ముం దు పెట్టుకొని ఆ లక్ష్య సాధన కోసం ప్రత్యేక కార్యాచరణతో పనిచేసిన వారే మహానీయులుగా నిలిచిపోతారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. అందరినీ సమన్వయం చేస్తూ అనేక కార్యక్రమాలు జిల్లాలో విజయవంతం అయ్యేలా శ్రీదేవసేన కృషి చేశారని కొనియాడారు. జిల్లాను అభివృద్ధి, సంక్షేమంతో పాటుగా సామాజిక కార్యక్రమాల్లోనూ దేశ పటంపై అగ్రస్థానంలో నిలిపిన ఘనత శ్రీదేవసేనకు దక్కుతుందన్నారు. 


logo