శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 05, 2020 , 02:39:11

ఇదే స్ఫూర్తితో ముందడుగేద్దాం

ఇదే స్ఫూర్తితో ముందడుగేద్దాం

రామగిరి: మండలంలోని ఆదివారంపేట, లొంకకేసారం గ్రామాల స్ఫూర్తితోనే జిల్లాలోని పల్లెలన్నింటినీ ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేయాలని  కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. మంగళవారం ఆయాగ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా పల్లె ప్రగతి అమలుతీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రతి ఇంటిలో స్వచ్ఛతకు తీసుకుంటున్న చర్యలు, ఇంకుడుగుంతల నిర్మాణాలు, కిచెన్‌గార్డెన్‌, కంపోస్ట్‌ ఫిట్‌లను పరిశీలించారు. జిల్లాలో ఆదివారంపేట, లొంకకేసారం గ్రామాలు ఆదర్శంగా నిలిచాయని కలెక్టర్‌ కితాబిచ్చారు. ఇదే స్ఫూర్తిని మిగతా గ్రామాల్లో కూడా వందశాతం అమలు చేసేందుకు చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామాల్లో చెత్త నిర్వహణ, విద్యుత్‌ స్తంభాల మూడో లైన్‌ పనుల పురోగతిని తెలుసుకున్నారు. హరితహారం, సామాజిక మరుగుదొడ్డి, వానరవనాల  అధికారులు, ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. 


తర్వాత అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందుతున్న పౌష్టికాహార వివరాలపై ఆరా తీశారు. గ్రామాల్లో నిరక్షరాస్యుల వివరాలు సేకరించాలనీ, ఈచ్‌ వన్‌, టీచ్‌ వన్‌ స్ఫూర్తితో అందరికీ కనీస విద్యఅందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామాల్లోని నర్సరీల నిర్వహణ తీరును తెలుసుకున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో తప్పనిసరిగా డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక నిర్మాణం, పురోగతి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట జాయింట్‌ కలెక్టర్‌ వనజాదేవి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి చంద్రప్రకాశ్‌రెడ్డి, మత్స్యశాఖ అధికారి మల్లేశం, తాసిల్దార్‌ పుష్పలత, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి సునీత, సర్పంచ్‌లు ఎండీ మంజూర్‌ అహ్మద్‌, మైదం కుమార్‌, పలువురు అధికారులు ఉన్నారు.


logo