మంగళవారం 07 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 04, 2020 , 01:50:59

ప్రజా సేవే లక్ష్యం

ప్రజా సేవే లక్ష్యం

(పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ):ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా తాను సివిల్‌ సర్వీసెస్‌లోకి వచ్చాననీ, అభివృద్ధి, సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా ముందుకుసాగుతానని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీదేవసేన ఆదిలాబాద్‌కు బదిలీ కావడంతో ఆమె స్థానంలో హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీల అదనపు కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సిక్తా పట్నాయక్‌ ఇక్కడికి వచ్చారు. దీంతో ఆమె సోమవారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. 

నమస్తే తెలంగాణ: పెద్దపల్లి కలెక్టర్‌గా అవకాశం 

లభించడంపై మీరెలా ఫీలవుతున్నారు..?

కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌: పెద్దపల్లి జిల్లా ప్రజలు ఎంతో చైతన్యవంతులు. అధికారులు ఎంతో చిత్త శుద్ధితో పనిచేస్తారు. ఇలాంటి జిల్లాకు కలెక్టర్‌గా పనిచేసే అవకాశం రావడాన్ని అదృష్టంగా ఫీలవుతున్నా. 

మీ కుటుంబ నేపథ్యం ఏమిటి..? 

కలెక్టర్‌: మాది ఒడిశా రాష్ట్రంలోని గంజాన్‌ జిల్లా.నా విద్యాభ్యాసం మొత్తం ఢిల్లీలోనే జరిగింది. మా తండ్రి అజిత్‌కుమార్‌ పట్నాయక్‌. ఆయన సివిల్స్‌ అధికారి. నా భర్త జీవింత్‌ రాంపాల్‌ ఆయన ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. మాకు సారంగ పట్నాయక్‌ అనే ఏడాది వయసు ఉన్న కొడుకు ఉన్నాడు. 

మీకు ఎవరు స్ఫూర్తి?  ఎప్పుడు ఐఏఎస్‌ సాధించారు?

కలెక్టర్‌: మా కుటుంబంలో చాలా మంది ఐఏఎస్‌లు, ఐపీఎల్‌ లు ఉన్నారు. మా నాన్న సివిల్‌ సర్వెంట్‌ అజిత్‌కుమార్‌ పట్నాయ క్‌, మా అంకుల్‌ అమూల్యకుమార్‌ పట్నాయక్‌ ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ స్ఫూర్తిగా తీసుకొని 2014లో ఐఏఎస్‌ సాధించా.  

మీరు ఇంతకు ముందు ఎక్కడైనా పనిచేశారా? 

కలెక్టర్‌: నా మొట్ట మొదటి పోస్టింగ్‌ నల్గొండ జిల్లా అక్కడ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించా. అనంతరం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో సబ్‌ కలెక్టర్‌గా పనిచేశా. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీకి ఆడిషనల్‌ కమిషనర్‌గా వెళ్లా. జీహెచ్‌ఎంసీలో దాదాపు అన్ని శాఖల్లో ఆడిషనల్‌ కమిషనర్‌గా విధులు నిర్వహించా. అనంతరం హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో జోనల్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తించా.

జిల్లాలో మీ పరిపాలన ఎలా కొనసాగిస్తారు..? 

కలెక్టర్‌: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ముఖ్యంగా పల్లె ప్రగతి-4, ప్రజావాణితో పాటు పలు కార్యక్రమాల అమలుతో పాటు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలపై ప్రత్యేక దృష్టి సారించి అధికారుల సాయంతో జిల్లా ప్రజలకు సుపరిపాలన అందిస్తా. ప్రభుత్వం ఏమైనా నూతన కార్యక్రమాలకు చేపడితే జిల్లా, క్షేత్ర స్థాయిలో అధికారులతో చర్చించి నివేదికలు తయారు చేయించిన అనంతరం వాటి అమలుకు కృషి చేస్తా. అధికారుల సాయంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతా. 

అధికారులకు మీరు చేసే సూచనలు ఏమిటి?

కలెక్టర్‌: జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తూ పరిపాలన కొనసాగిస్తా. ఉద్యోగ పరంగా ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించడంతో పాటు ప్రజలకు సేవ చేసేలా అధికారులను ప్రోత్సహిస్తాం. ప్రజలకు సేవ చేయకుండా ఎవరైనా అధికారులు తమ విధులపై అలసత్వం వహిస్తే మాత్రం ఊరుకునేది లేదు. 

పాలన పరంగా మీ ప్రథమ ప్రాధాన్యాలు  ఏమిటి?

కలెక్టర్‌: కలెక్టర్‌గా నా ప్రథమ ప్రాధాన్యాలు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం. ఆయా కార్యక్రమాలకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలగాలన్నదనే నా అభిమతం. ప్రజా ప్రయోజనం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. వాటిని ప్రజలకు అందేలా చూస్తా. పాలనలో నేను దానికే అధిక ప్రాధాన్యం ఇస్తా. ఆ తర్వాతే ఇతర అంశాలు, విషయాలు. 

 జిల్లాపై మీకున్న అభిప్రాయం..? 

కలెక్టర్‌: జిల్లాపై మంచి అభిప్రాయం ఉంది. ఇక్కడ పని చేసే అధికారులు, ఉద్యోగులు మంచి క్రమ శిక్షణతో వ్యవహరిస్తారని ఇక్కడ పని చేసిన ఐఏఎస్‌ అధికారి శ్రీదేవసేన ద్వారా తెలుసుకున్న. ఇలాంటి క్రమ శిక్షణ ఉన్న టీం దొరకడం చాలా ఆనందంగా ఉంది. అధికారుల సాయంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా.

చివరగా మీరిచ్చే సందేశం ఏమిటి?

కలెక్టర్‌: జిల్లాలో పని చేస్తున్న అన్ని శాఖల అధికారులు, సిబ్బంది క్రమ శిక్షణతో తమ విధులను నిర్వహించాలి. 24 గంట ల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా సేవ చేయాలి. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలి. logo