సోమవారం 06 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 03, 2020 , 03:43:57

మోడల్‌ స్కూల్‌ పిలుస్తోంది...

మోడల్‌ స్కూల్‌ పిలుస్తోంది...

విశాలమైన తరగతి గదులు.. సువిశాలమైన మైదానాలు.. కాలంతోపాటే ఎన్నో ఆధునిక కోర్సులు.. ఉచిత పుస్తకాలు.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు.. ప్రైవేట్‌కు దీటుగా అత్యత్తుమ ఫలితాలు.. ఆదర్శ పాఠశాలల్లో చదువుకోవడానికి ఇంతకుమించి ఇంకేం కావాలి! వేలాది మందికి ఉజ్వల భవిష్యత్‌ను ఇచ్చిన ఆ చదువుల కోవెలల్లో తాజాగా ఆరో తరగతిలో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుకాబోతున్నది. ఒక్కో విద్యాలయంలో 100 సీట్ల చొప్పున జిల్లాలోని ఏడు పాఠశాలల్లో 700 ఖాళీలు ఉండగా, ఏప్రిల్‌ 12న ఎంట్రెన్స్‌ టెస్టు జరగనున్నది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య అందుతుండడంతో తల్లిదండ్రుల్లో ఆసక్తి కనిపిస్తున్నది.

 • పేద విద్యార్థులకు వరం మోడల్‌స్కూళ్లు
 • కార్పొరేట్‌కు దీటుగా బోధన.. మెరుగైన వసతులు
 • తాజాగా ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ
 • జిల్లాలో 7 విద్యాలయాలు.. 700 సీట్లు
 • నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
 • ఏప్రిల్‌ 12న ప్రవేశ పరీక్ష
 • ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులు..

పెద్దపల్లిప్రతినిధి, నమస్తే తెలంగాణ/పెద్దపల్లి జంక్షన్‌: ఆదర్శ పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా విద్యా బోధన జరుగుతున్నది. ఇప్పటి వరకు సాధించిన విజయాలను చూస్తే ఈ విషయం కళ్లముందు కనిపిస్తుండగా, తాజాగా ఈ విద్యాలయాల్లో 2020-2021 సంవత్సరానికిగాను ఆరో తరగతిలో ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ మొద లు కాబోతుండగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆసక్తి కనిపిస్తున్నది. 


జిల్లాలో 700 ఖాళీలు.. 

ఆదర్శ పాఠశాలల్లో మెరుగైన వసతులతో పాటు పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే బోధన అందిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు అమితంగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఏటా ఈ ప్రవేశపరీక్షకు పోటీ అధికంగా ఉంటోంది. 6వ తరగతి ప్రవేశపరీక్ష రాసేందుకు ఫిబ్రవరి 3నుంచి ఫిబ్రవరి 29 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. సుల్తాన్‌బాద్‌ మండలం గర్రెపల్లి, జూలపల్లి మండలం పెద్దాపూర్‌, రామగుండం మండలం లింగాపూర్‌, కాల్వశ్రీరాంపూర్‌ మండలం మల్యాల, ముత్తారం మండలం దడియాపూర్‌, ఓదెల, ధర్మారం మండ ల కేంద్రాలలో ఏడు ఆదర్శ పాఠశాలలున్నాయి. ఇందులో మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఆయా పాఠశాలల్లో 2020-2021 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో 100 సీట్ల చొప్పున జిల్లాలో 700 సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే 7 నుంచి 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, మెరిట్‌, రిజర్వేషన్‌ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. 


ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు..

విద్యార్థులు కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలి. దీంతోపాటు ఆధార్‌కార్డు, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో సమీపంలోని మీసేవ, ఆన్‌లైన్‌ సెంటర్‌లోనైనా లేదా స్వయంగానైనా దరఖాస్తు చేసుకునే వీలుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రూ.75, ఓసీలకు రూ.150 దరఖాస్తు రుసుం నిర్ణయించారు. ఈ రుసుం సైతం ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించాలి. దరఖాస్తులను htp:// telanganams.c gg.gov.in వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు పూర్తి చేసిన వివరాల ప్రింట్‌ తీసుకొని ఆ కాపీని విద్యార్థులు ఏ మోడల్‌ స్కూల్‌లో అడ్మిషన్‌ పొందాలనుకుంటున్నారో అక్కడి ప్రిన్సిపాల్‌కు అందజేయాలి.


ప్రవేశ పరీక్ష సిలబస్‌ ఇదే..

ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు ఐదో తరగతి సిలబస్‌కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ప్రశ్న పత్రం తెలుగు, గణితం, సామాన్య, సాంఘికశాస్త్రం, ఇంగ్లిష్‌లో ఉంటుంది. ఒక్కో విభాగానికి 25 మల్టిపుల్‌ చాయిస్‌లో అబ్జెక్టివ్‌ ప్రశ్నలు, 25 మార్కుల చొప్పున 100 మార్కులు ఉంటాయి. 7 నుంచి 10వ తరగతి ప్రవేశ పరీక్షలో అంతకంటే వెనుక తరగతి సిలబస్‌కు సంబంధించిన ఇంగ్లిష్‌, గణి తం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్ర్తాలకు 25మార్కుల చొప్పున 100 మార్కులు తెలుగు, ఆంగ్లంలో ఉంటాయి..


అర్హతలు ఇవే..

5వ తరగతి ఉత్తీర్ణులైన వారే ఆరోతరగతి ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హులు. తెలుగు, ఆంగ్ల మీడియంలో ఏ మీడియం వారైనా దరఖాస్తు చేసుకునే వీలుంది. దీంతోపాటే సదరు విద్యార్థి 2018-2019, 2019-2020 విద్యాసంవత్సరాల్లో మోడల్‌ స్కూల్‌ ఉన్న జిల్లాలోని గుర్తింపు పొందిన పాఠశాలలో విద్యనభ్యసించి ఉండాలి. తల్లిదండ్రుల ఆదాయం రూ.1లక్షకు మించరాదు. 6వ తరగతి కోసం పరీక్ష రాసే విద్యార్థి ఈ ఏడాది ఆగస్టు 31నాటికి 10ఏళ్లు పూర్తయి ఉండాలి. 7 నుంచి 10వతరగతి ప్రవేశం కోసం అంతకుముందు తరగతి పాసై ఉండాలి. కాగా, ఈ తరగతులకు కులాల వారీగా వయస్సు, అర్హతను నిర్ణయించారు..


మోడల్‌ స్కూల్‌ ప్రత్యేకతలు..

ఉచితంగా 6వ తరగతి నుంచి ఇంటర్‌ దాకా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతుంది. అన్ని రకాల వసతులతో భవన సముదాయం, ఆధునిక గ్రంథాలయం, కంప్యూటర్‌, సైన్స్‌ల్యాబులు నిర్వహిస్తారు. 6వ తరగతి నుంచి ఇంటర్‌ దాకా ఉచితంగా పాఠ్యపుస్తకాలతోపాటు పదో తరగతి దాకా  యూనిఫామ్స్‌ ఇస్తారు. ఒక్కో మోడల్‌ స్కూల్లో 100మంది చొప్పున బాలికలకు ఉచిత హాస్టల్‌ వసతితోపాటు బాలికలకు కాస్మోటిక్స్‌ పంపిణీ చేస్తున్నారు.  


ప్రవేశ షెడ్యూల్‌ ఇదే.. 

 • 6వ తరగతి ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 29వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ.
 • 7వ తరగతి నుంచి 10వ తరగతులకు ఫిబ్రవరి 8 నుంచి మార్చి 2వరకు దరఖాస్తుల స్వీకరణ.
 • ఏప్రిల్‌ 9 నుంచి 12 దాకా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
 • ఏప్రిల్‌ 12న ఉదయం 10 నుంచి మధ్యాహ్న 12గంటల వరకు ఆరో తరగతికి, అదేరోజు మధ్యాహ్నం 2 నుంచి 4గంటల వరకు 7 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు జిల్లా కేంద్రంలో పరీక్ష ఉంటుంది. 
 • మే 20న ఫలితాల వెల్లడి.
 • మే 21 నుంచి 26 దాకా ఎంపికైన విద్యార్థుల తుది జాబితా విడుదల. 
 • మే 27న ఎంపికైన విద్యార్థుల జాబితా పాఠశాలల్లో ప్రదర్శన.
 • మే 28 నుంచి 31వరకు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన, అడ్మిషన్లు.
 • విద్యాసంవత్సరాన్ని అనుసరించి తరగతులు ప్రారంభం..


విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి..

మోడల్‌ స్కూల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. 6 వ తరగతి నుంచి ఆంగ్ల మాద్యమంలో విద్యను బోధిస్తారు. ప్రతిభ గల పేద, మధ్య తరగతి విద్యార్థులు అన్ని సౌకర్యాలతో ఉచిత విద్యనందించే మోడల్‌ స్కూల్లో ప్రవేశ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పాఠశాలల్లో విద్యతో పాటు  క్రీడలు, ఇతర రంగాల వారీగా ప్రోత్సహించేందుకు కరిక్యులమ్‌, కో-కరిక్యులమ్‌ ఉంటుంది. ఎంసెట్‌ కోచింగ్‌ సైతం ఇవ్వడం జరుగుతుంది. 9వ తరగతి నుంచి ఇంటర్‌ దాకా వొకేషనల్‌ కోర్సులు కూడా ఉంటాయి. సూచించిన విధంగా అన్ని సరైన ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసిన తర్వాత ఒక కాపీని మోడల్‌ స్కూల్లో సమర్పించాలి.

 - నీలకంఠ రాంబాబు, ప్రిన్సిపాల్‌, గర్రెపల్లి మోడల్‌ స్కూల్‌, సుల్తాన్‌బాద్‌ 


logo