గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 02, 2020 , 03:56:06

‘సహకారం’లోనూ దూసుకెళ్లాలి

‘సహకారం’లోనూ దూసుకెళ్లాలి
  • మున్సిపల్‌ ఎన్నికల స్ఫూర్తిగా సొసైటీలన్నీ దక్కించుకోవాలి
  • పార్టీ శ్రేణులు శక్తివంచన లేకుండా పనిచేయాలి
  • ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
  • పెద్దపల్లిలో టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో సన్నాహక సమావేశం

కలెక్టరేట్‌ : త్వరలో జరుగనున్న సహకార సం ఘాల ఎన్నికల్లోనూ దూసుకెళ్లాలనీ, అన్ని సొసైటీలనూ టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే గెలుచుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సహకార ఎన్నికల దృష్ట్యా జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్‌హాల్‌లో టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో  సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఏవిధంగానైతే టీఆర్‌ఎస్‌ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటూ వచ్చిందో, సహకార సంఘాల ఎన్నికల్లోనూ అదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. అందుకోసం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఆయా సొసైటీల పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. సహకార ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో ఆలోగా డైరెక్టర్ల కోసం అభ్యర్థులను ఎంపిక చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. ప్రజాసేవ కోసం ప్రజలు కోరుకునే వ్యక్తులనే డైరెక్టర్లుగా ఎంపిక చేయాలని, లేదంటే ప్రజలే తిరస్కరిస్తారని చెప్పారు. డైరెక్టర్ల ఎంపికలో టీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్లు, స్థానిక సర్పంచ్‌, ఎంపీటీసీలను సమన్వయం చేసుకుని అభ్యర్థులను నిర్ణంచాలన్నారు. ఈ ప్రక్రియను ఆయా మండలాలకు చెందిన మండల పరిషత్‌ అధ్యక్షులు, జడ్పీటీసీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని 12 సొసైటీల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన చైర్మన్లు, డైరెక్టర్లే ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సొసైటీల పరిధిలో ఉన్న ఓటర్లకు ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, రైతుబీమా ఫించన్‌, సాగునీరు, 24 గంటల కరెంట్‌, పంటలకు మద్ధతు ధర అంశాలను వివరిస్తూ, అన్ని సొసైటీల పరిధిలోని డైరెక్టర్లందరూ టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులే గెలిచేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ మండిగ రేణుక, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జీ రఘువీర్‌సింగ్‌, ఎంపీపీలు నూనేటి సంపత్‌ యాదవ్‌, కూనారపు రేణుకాదేవి, పొన్నమనేని బాలాజీరావు, జడ్పీటీసీలు వంగళ తిరుపతిరెడ్డి, బొద్దుల లక్ష్మీనర్సయ్య, నాయకులు వీసారపు వెంకటేశం, బండారి శ్రీనివాస్‌గౌడ్‌, దేవయ్య, మేకల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. 


రైతు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ..

తెలంగాణ రాష్ట్రంలోని రైతు కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. 2019 ఏప్రిల్‌ 17న పిడుగుపాటుతో మూలసాల గ్రామానికి చెందిన కాసు అజయ్‌ అనే గొర్రెల కాపరి మృతి చెందగా, పశుసంవర్ధకశాఖ నుంచి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.లక్ష చెక్కును అజయ్‌ తండ్రి కాసు కొమురయ్యకు  ఎమ్మెల్యే దాసరి అందజేశారు. జిల్లా కేంద్రంలోని దాసరి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాసరి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కుర్మలు ఆర్థికంగా ఎదిగేందుకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి, వారి సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టితో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అక్కడకక్కడా జరుగుతున్న ఘటనల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతోనే సంబంధిత శాఖ నుంచి ప్రభుత్వం ద్వారా పరిహారం ఇప్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డితోపాటు తదితరులున్నారు.


logo