శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Feb 02, 2020 , 03:53:01

పశువులను రక్షిద్దాం

పశువులను రక్షిద్దాం
  • నేటి నుంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
  • నెల రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమం
  • ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో ప్రత్యేక శిబిరాలు
  • మండలాల వారీగా ప్రత్యేక కార్యాచరణ
  • 68 బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు
  • 1,46,579 పశువులకు ప్రయోజనం
పెద్దపల్లి జంక్షన్‌ : పశువుల్లో అత్యంత ప్రమాదకమైనది గాలికుంటు వ్యాధి. ఇది పికార్నో వైరస్‌ వల్ల సోకుతుందని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకడం వల్ల మరణాల శాతం తక్కువే అయినప్పటికీ పశువుల్లో ఉత్పాదక శక్తి, పునరుత్పత్తి సామర్థ్యం కుంటుపడుతుంది. దేశవాళి పశువుల కంటే సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటుంది. మార్చి, ఏప్రిల్‌, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధిని పూర్తిగా నివారించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గత తొమ్మిదేళ్లుగా ఈ వ్యాధి నివారణకు కృషి చేస్తున్నాయి. ప్రతి జనవరి, జూన్‌ నెలల్లో పశువులకు ఈ వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నారు. అయితే ఈసారి వరుసగా ఎన్నికలు రావడంతో ఫిబ్రవరి నెలాంతా ఈ టీకాలు వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి 60 శాతం నిధులు కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ వస్తోంది. అయితే ఈసారి జాతీయ పశువ్యాధి నివారణ (ఎన్‌ఏడీసీపీ) కార్యక్రమం కింద కేంద్రమే ఈ వ్యాధి నివారణ టీకాలు వేయిస్తున్నట్లు పశుసంవర్ధక అధికారులు చెబుతున్నారు.


వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి

పశువుల్లో సోకే ఈ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషి ఫలితంగా పశువులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నాయి. 17వ విడతగా వేస్తున్న ఈ వ్యాధి నివారణ టీకాలను పాడి, పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యాధి సోకిన పశువులు తీవ్రంగా నీరసించి పోతుంటాయనీ, శరీర ఉష్ణోగ్రత 104-106 డిగ్రీలతో ఉంటుందని చెబుతున్నారు. నోరు, గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడి 24 గంటల్లోనే చితికిపోయి పొక్కులు, పుండ్లుగా మారి నొప్పి వల్ల మేత మేయడం, నీరు తాగడం మానేస్తాయని అంటున్నారు. నోటి నుంచి సొంగ కారడం, పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోవడం, గిట్టలో పుండ్ల వల్ల ఎద్దులు వ్యవసాయ పనులు చేయక పోవడం, వ్యాధి సోకిన ఆవులు, గేదెలు పాలు తాగిన దూడలు మరణించే అవకాశాలుంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పశువులను సంరక్షించుకునేందుకు పశుపోషకులు, పాడి రైతులు ప్రభుత్వం పూర్తి ఉచితంగా వేస్తున్న వ్యాధి నివారణ టీకాలను తప్పని సరిగా వేయించుకోవాలని కోరుతున్నారు. అలాగే పాల దిగుబడి తగ్గిపోతుందనీ, నివారణకు టీకాలతోపాటు మేతను సక్రమంగా ఇవ్వాలని సూచిస్తున్నారు. పశుగ్రాసంతోపాటు పచ్చిగడ్డిలో  కాయ జాతి గ్రా సాలు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. 


ప్రతి పశువుకూ టీకా అందే విధంగా.. 

ప్రతి పశువుకూ గాలికుంటు వ్యాధి టీకా అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ రూపొందించింది. గతంలో పశువులకు టీకాలు వేసి లెక్కలు చూపేవారు. కానీ, ఇప్పుడు ఇందుకు భిన్నంగా ప్రతి పశువుకు ముందుగా చెవిబిల్ల వేసిన తర్వాతనే టీకా వేస్తున్నారు. జిల్లాలో 90,633 నల్లజాతి, 55,946 తెల్లజాతి చొప్పున మొత్తం 1,46,579 పశువులు ఉన్నాయి. మూడు నెలలు దాటిన ప్రతి పశువుకు టీకా వేయడమే లక్ష్యంగా చేసుకుని 68 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున ఉంటారు. వీరిలో టీకా వేసేందుకు ఒకరు, చెవిబిల్లా అమర్చి, వివరాలు సేకరించేందుకు మరొకరు వీరికి సహాయకులు మరొకరు ఉంటారు. ఒక్కో గ్రామంలో పశువుల సంఖ్యను బట్టి ఒకే రోజు నాలుగు నుంచి ఐదు బృందాలు వెళ్తాయి. నాలుగైదు ముఖ్య కూడళ్లలో ప్రతి రోజు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు గ్రామంలోనే ఉండి పశువులకు టీకాలు వేస్తారు. ఒక్కో బృందం రోజుకు కనీసం వంద పశువులకు టీకాలు వేయాలని లక్ష్యం విధించినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు. టీకా వేయించుకునేందుకు రైతులు తమ ఆధార్‌ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలనీ, పశువులకు 12 డిజిట్స్‌తో ఉండే ట్యాగ్‌ను ఇస్తామనీ, ఈ వివరాలతోపాటు పాడి రైతులు, పశు పోషకుల వివరాలను ఎప్పటికప్పుడు ఐఎన్‌ఏటీహెచ్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తామని చెప్పారు. 


నేడు జిల్లా వ్యాప్తంగా ప్రారంభం.. 

పశువుల్లో సోకే గాలికుంటు వ్యాధి నివారణ కోసం చేపట్టిన కార్యక్రమాన్ని ఆదివారం అన్ని మండలాల్లో ప్రారంభిస్తున్నారు. ఇందుకు ఆయా మండలాల పరిధిలో పశువైద్యాధికారులు కార్యాచరణ చేసుకున్నారు. నెల రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని ఆయా మండలాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న గ్రామాల్లో రైతులకు ముందుగానే సమాచారం అందించారు. అదీ కాకుండా పశువులు మేతకు వెళ్లకముందే అధికారులు ఈ కార్యక్రమాన్ని ముగించే విధంగా షెడ్యూలు ఖరారు చేసుకున్నారు. కాగా, కార్యక్రమాన్ని సోమవారం పెద్దపల్లి మండలంలోని చీకురాయి గ్రామంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


logo