మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Feb 02, 2020 , 03:47:57

ఇదేం బడ్జెట్‌..

ఇదేం బడ్జెట్‌..
  • తెలంగాణకు మొండిచేయి చూపారు
  • ‘నమస్తే’తో ఎంపీ వెంకటేశ్‌ నేతకాని
  • కేంద్రం తీరుపై పార్లమెంట్‌లో ఎండగడుతాం
  • రైల్వేలు, పరిశ్రమలు మరిచారు
  • బృహత్తర కాళేశ్వరానికి జాతీయ హోదా ప్రస్తావన ఏది..?
  • మిషన్‌ భగీరథ, మిషన్‌కాకతీయ ఊసేలేదు

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు మొండిచేయి చూపిందని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌నేతకాని మండిపడ్డారు. శనివారం సాయంత్రం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ఫోన్‌లో మాట్లాడారు. రైల్వేలు, జాతీయ రహదారుల విషయం లో పెద్దపల్లి సెగ్మెంట్‌కు ఇచ్చిందేమి లేద నీ, పూర్తిగా నిరుత్సాహపరిచిందని చెప్పా రు.  ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ ఎంపీలంతా కలిసి పార్లమెంట్‌లో ఎండగడుతామని చెప్పారు. దేశానికే తలమానికమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని గతేడాది నుంచి గొంతు చించుకొని అరుస్తున్నా కేంద్రంలో ఎలాంటి చలనం లేదనీ, పార్లమెంట్‌లో కనీసం దాని ప్రస్థావన లేకపోవడం బాధాకరమన్నారు. ఎకనామిక్‌ సర్వేలో రైతు బంధు పథకాన్ని బేష్‌ అని చెప్పిన కేంద్రం.. తెలంగాణలో 40లక్షల ఎకరాలకు నీటిని అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్థావన ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. మేడారం జాతరను తెలంగాణలోనే అతి పెద్ద జాతీయ స్థాయి జాతర అని ప్రకటించకపోగా, దాని ఊసే లేకపోవడం దారుణమన్నారు. అలాగే రైల్వే లైన్ల గురించి కేంద్రమంత్రిని ఎన్నోసార్లు తాము కలిశామనీ, సీఎం కేసీఆర్‌ సైతం ఎన్నోసార్లు లేఖలు రాసినా కేంద్రంలో ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. కాళేశ్వరం, పరిశ్రమల విషయంలో తెలంగాణకు ఎలాంటి బడ్జెట్‌ కేటాయించలేదనీ, నీతి అయోగ్‌ కింద మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయలకు రూ. 24వేల కోట్లు ఇవ్వాలని అందరం కోరినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. వీటన్నింటిపై తెలంగాణ ఎంపీలందరం కలిసి సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశకత్వంలో చర్చలో పాల్గొని మనకి రావాల్సిన నిధులు, హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.


ఆశాజనకంగా లేదు.. 

బడ్జెట్‌ తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి ఆశాజనకంగా లేదు. వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, అనుబంధ రంగాలకు కొంత కేటాయించినా ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణం. విద్యారంగానికి నామమాత్ర కేటాయింపులే ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఏర్పాటు చేస్తామన్న మెడికల్‌ కళాశాల ప్రకటన సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాల పునర్విభజన అనంతరం జిల్లా అవసరాలకు అనుగుణంగా విద్య, వైద్యారోగ్య రంగాలకు కేటాయింపులుంటే బాగుండేది. బడ్జెట్‌ను ఏరకంగా చూసినా సామాన్యులకు ప్రయోజనమే కనిపించడం లేదు. 

 దాసరి మనోహర్‌ రెడ్డి, ఎమ్మెల్యే, పెద్దపల్లి (కలెక్టరేట్‌)


అభివృద్ధికి ఆటంకంగా బడ్జెట్‌..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పూర్తిగా నిరాశాజనకంగా ఉంది. ఇది అంకెల గారడి తప్పా మరొకటి కాదు. బడ్జెట్‌ అభివృద్ధి, సంక్షేమానికి ఆటంకంగా ఉంది. అసలు సామా న్యులను గురించి పట్టించుకున్నట్లుగా ఎక్కడా కనిపించలేదు. ప్రజల ఆశలన్నీ అడియాస లయ్యే విధంగా బడ్జెట్‌ ఉంది. తెలంగాణ రాష్ర్టానికి ఏ మాత్రం ప్రయోజనం లేదు. ఇంత వివక్ష తెలంగాణపై ఎందుకు చూపుతున్నారని బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. రాష్ట్ర పథకాలను మెచ్చుకున్న కేంద్రం ఒక్క పథకానికి నిధులు మంజూరు చేయకపోవడం బాధాకరం. 

 కోరుకంటి చందర్‌, ఎమ్మెల్యే (పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ)


యువతకు మొండి చేయి..

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో యువతకు మొండి చేయి చూపింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం రూ. 3వేల కోట్ల బడ్జెట్‌ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. విద్యా, వైద్యరంగంలోనూ కేటాయింపులు సంతృప్తికరంగా లేవు. ఇక రాష్ర్టానికైతే ప్రయోజనాలే లేవు. వ్యవసాయరంగాన్నీ నిరూత్సాహ పరిచింది. 

 ఈద శంకర్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్‌, (కలెక్టరేట్‌)


logo
>>>>>>