మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Feb 01, 2020 , 02:17:25

కరోనాపై..కంగారు వద్దు..

కరోనాపై..కంగారు వద్దు..
  • అభయమిస్తున్న జిల్లా వైద్యాధికారులు
  • అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని స్పష్టం
  • వ్యక్తిగత పరిశుభ్రత మేలని వెల్లడి
  • జాగ్రత్తలే అసలైన చికిత్స
  • జిల్లాలో కరపత్రాలు, ఫ్లెక్సీలతో విస్తృత ప్రచారం

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఇప్పుడు ఎక్కడ విన్నా ఒక్కటే మాట.. కరోనా వైరస్‌. ఏ పత్రిక తిరగేసినా, ఏ టీవీ చానల్‌లో చూసినా ఇదే ముచ్చట. ఆ పేరు వింటేనే జనం హడలిపోతున్నా రు. అయితే, జిల్లాలో కరోనా వైరస్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని, కంగారు పడవద్దని స్పష్టంచేస్తున్నారు. చైనాలో ఈ వైరస్‌ బారిన పడి వందలాది మంది మృత్యువాతపడగా సోషల్‌ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నా యి. దీంతో ప్రజల్లో కలవరం మొదలైంది. దగ్గు, జలుబు, గాలి, స్పర్శ, ఆహార పదార్థాలు, తదితరాల ద్వారా ఇవి వ్యాప్తి చెందుతున్నాయి. రోగి పరిస్థితి త్వరగా విషమించే అవకాశం ఉండడంతో చాలా మంది భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.


ఇక్కడ సోకే అవకాశం లేదు..

ఈ కరోనా వైరస్‌ ఎక్కువ చలి ప్రదేశంలో ఉన్న వా ళ్లకు మాత్రమే సోకే అవకాశాలున్నాయి. మనదేశంలో ఎండల తీవ్రత వల్ల వ్యాధి సోకే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు. మనదేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, అందులో వస్తున్నది ఎండా కాలం అయినందున కరోనా వైరస్‌ మనకు వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదని చెబుతున్నా రు. జాగ్రత్తలు పాటించడంతో కరోనా వైరస్‌ నుం చి రక్షణ పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని వారు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్‌లో కేసులు నమోదయ్యాయని, మిగతా ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందుతోందని వస్తున్న ప్రచారాలు కూడా వారు కొట్టి పారేస్తున్నారు. జిల్లా ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురికావొద్దని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. కరోనా వ్యాధి లక్షణాలు, అందు కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.


వైరస్‌ లక్షణాలివీ..

కరోనా వైరస్‌ సోకిన వారిలో ఎక్కువగా ఎడతెరిపి లేని దగ్గు, జలుబుతో పాటు శ్యాస సంబంధ వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా జలుబు, తలనొప్పితో కూడిన జర్వం ఉంటే వెంటనే వైద్యులను కలిసి చికిత్స చేయించుకోవాలి. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం. జలుబు, తీవ్ర తలనొప్పి, దగ్గు, మోకాళ్లనొప్పులు, జ్వరం ఉంటుంది. పూర్తిగా అనారోగ్యం బారిన పడడం.. లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే పరికరాలు ప్రస్తుతానికి స్థానికంగా అందుబాటులో లేవు. హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌, పుణేలోని రీసెర్చీ కేంద్రం లో మాత్రమే వ్యాధి నిర్ధారణ చేస్తారు. జిల్లాలో ఎవరైనా చేస్తారంటే నమ్మవద్దనీ, అలాంటి వారి గురించి తమకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అనవసరమైన ఆందోళన చెంది, పరీక్షల పేరిట డబ్బులు వృథా చేసుకోవద్దని వారు స్పష్టం చేస్తున్నారు.


వ్యాధి వ్యాపించే విధానం ఇది..

గతంలో ఈ వ్యాధి కేవలం గబ్బిలాలు, పక్షులు జంతువుల్లో మాత్రమే వ్యాపించేంది. కానీ, ఇప్పుడు అది మనుషులకు కూడా సోకుతోంది. సాధారణ మనిషి నుంచి మనిషికి ఈ వైరస్‌ వ్యాపిస్తోంది. దగ్గు, తుమ్మినప్పుడు ఆ తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా స్పర్శ, షేక్‌హ్యాండ్‌ ద్వా రా కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. వైరస్‌ కలిగిన పదార్థాన్ని ముట్టుకున్నా, ఇతర పనులేవి చేసినా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నిరంతరం ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతు లు శుభ్రంగా కడుక్కోవాలి. చేతులు కడకుండా, ముఖం, ముక్కు, నోటిని తాకొద్దు. ఇలా చేస్తే కచ్చితంగా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.


నివారణ ఒక్కటే మార్గం..

ఏ వ్యాధి అయినా సోకిన తర్వాత కన్నా నివారణ ఒక్కటే మార్గం. వ్యాధి రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శుచి, శుభ్రత పాటించాలి. జనసమూహంలోకి వెళ్లే వారు తప్పనిసరిగా స్కులు ధరించాలి. చేయిచేయీ కలపకుండా దూరం నుంచే నమస్కారం చేయాలి. సినిమా హాళ్లు, జాతరలు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లలోకి వెళ్లే వారంతా జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు, ఆహారం ఎక్కడపడితే అక్కడ, ఏది పడితే అది తీసుకోవద్దు. మరగబెడ్డి వడకాచిన నీటితో పాటు వేడిగా ఉండే ఆహార పదార్థాలు తినాలి. ఎక్కువగా ఆకు కూరలు, కూరగాయలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మాంసాహారాన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలి. తొందరగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి. జలుబు, దగ్గు, తీవ్ర తలనొప్పి, శ్యాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే ప్రభుత్వ దవాఖానలోని వైద్యులను సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యశాఖాధికారులు తెలిపారు.


అప్రమత్తంగా వైద్య శాఖ..

జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వైద్యశాఖ అప్రమత్తంగా ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి సూచనలు లేవని చెబుతున్నారు. కరోనా వైరస్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైద్యశాఖను అప్రమత్తం చేసింది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సర్కారు ఆదేశాలతో జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ కరపత్రాలు, ఫ్లెక్సీలతో విస్తృత ప్రచారం చేస్తున్నది. ఎంతకూ తగ్గని జలుబు, దగ్గు, శ్యాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉండే వాళ్లను గుర్తించి వెంటనే జిల్లాలోని ప్రధాన దవాఖానలకు తీసుకురావాలని సూచిస్తున్నారు. తుమ్ములు, దగ్గు ఉన్న వారందరికీ కరోనా వైరస్‌ ఉంటుందని అనుకోవద్దని, దగ్గు, జలుబుతో పాటు దమ్ము తీవ్రంగా ఉండేవాళ్లు, వైరస్‌ సోకిందని అనుమానం ఉన్న వాళ్లు వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు.


logo
>>>>>>