గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Jan 31, 2020 , 03:23:01

ఆరు నెలల్లో అభివృద్ధి చూపిస్తా

ఆరు నెలల్లో అభివృద్ధి చూపిస్తా
  • ప్రజల నమ్మకాన్ని వమ్మచేయకుండా పనిచేస్తా
  • ఎమ్మెల్యే సహకారంతో ముందుకెళ్తా మేయర్‌ అనిల్‌కుమార్‌
  • నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
  • ఎమ్మెల్యే కోరుకంటి
  • బాధ్యతలు స్వీకరించిన బల్దియా పాలకవర్గ సభ్యులు

గోదావరిఖని టౌన్‌ : రామగుండం నగర ప్రజలు తనపై ఎంతో నమ్మకంతో గొప్ప బాధ్యతను అప్పగించారనీ, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ సహకారంతో నగరాన్ని ఆరు నెలల్లోనే అభివృద్ధి చేసి చూపిస్తానని మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు నగర పాలక సంస్థ కార్యాలయంలో గురువారం శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించి మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌ రావు తమతమ చాంబర్‌లలో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌ అనిల్‌ మాట్లాడుతూ, ఆరు నెలల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అనుగుణంగా అభివృద్ధి చేస్తామన్నారు. 


ముఖ్యమంత్రి, మున్సిపల్‌ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు అవసరమైన కొత్త పనులు కూడా జాప్యం జరగకుండా త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తామన్నారు. అనంతరం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బంది కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రకారంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. పనుల జాప్యంపై అధికారులను ప్రశ్నించారు. భూగర్భ పైపులైను వేయుకండానే రోడ్డు వేసి ఆ తర్వాత కొత్త రోడ్డును పగులగొట్టి లైన్‌ చేయడం ద్వారా ప్రజాధనం వృథా అవుతుందన్నారు. ఇక ముందు ఇలాంటివి జరగరాదని హెచ్చరించారు. పనికే ప్రాధాన్యం ఇస్తాననీ, 24 గంటలు అర్ధరాత్రి అయిన అందుబాటులో ఉంటాననీ, పనులు మాత్రంనిక్కచ్చిగా జరగాలన్నారు. పారిశుధ్యం విషయంలో ఏవైనా సమస్యలుంటే పరిష్కరించి మెరుగుపర్చాలన్నారు. 


ఆదర్శనగరంగా తీర్చిదిద్దుదాం..

కొత్తగా కొలువుదీరిన రామగుండం నగర పాలక సంస్థ పాలకవర్గాన్ని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ, నగరాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొత్త పాలక వర్గం హయాంలో అభివృద్ధి వేగంగా జరగడంతోపాటు ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించనున్నట్లు తెలిపారు. నగర పాలక సంస్థకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏటా ఇస్తున్న రూ.100 కోట్లను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులకు వినియోగిస్తూ రామగుండాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. 


పాలకవర్గ సభ్యులు కూడా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్‌ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ అందేలా చూడాల్సిన గొప్ప బాధ్యత మీకు ప్రజలు అప్పగించారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా అందరూ నడుచుకోవాలని సూచించారు. నిస్వార్థ సేవలను అందిస్తూ డివిజన్‌ను అందంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. సమావేశంలో నగర పాలక సంస్థ ఏఈ సుచరణ్‌, మేనేజర్‌ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్‌ ముసాబ్‌, అహ్మద్‌, పూర్ణ చందర్‌, మోహిసిన్‌, ఆర్‌ఐ శంకర్‌రావు టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు పాల్గొన్నారు.