శనివారం 28 మార్చి 2020
Peddapalli - Jan 31, 2020 , 03:09:57

అన్ని రంగాల్లో ధర్మారం అభివృద్ధి

అన్ని రంగాల్లో ధర్మారం అభివృద్ధి
  • సెంట్రల్‌ లైటింగ్‌ పనులు ప్రారంభించండి
  • ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  • కరీంనగర్‌ క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష
  • నేడు పత్తిపాకలో పర్యటించనున్న అమాత్యుడు

ధర్మారం: మండలకేంద్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కరీంనగర్‌లోని మంత్రి తన క్యాంప్‌ కార్యాలయంలో పెద్దపల్లి ఆర్‌అండ్‌బీ శాఖ ఎస్‌ఈ రాఘవాచార్యులు, ఈఈ వెంకటరమణ, డీఈఈ రాముతో మంత్రి ఈశ్వర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మారం నుంచి పెద్దపల్లి రహదారికి అనుబంధంగా ఉన్న మండలకేంద్రంలో అంబేద్కర్‌ చౌరస్తా నుంచి ఎస్సారెస్సీ కాల్వ వరకు రోడ్డు డివైడర్‌ ఏర్పాటుతోపాటు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ, నూతన డ్రైనేజీ నిర్మాణం, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటుకు రూ.50లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు.


 కాంట్రాక్టర్‌ను అప్రత్తమం చేసి పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనులు నాణ్యతతోపాటు వేగంగా చేపట్టాలని పేర్కొన్నారు. మొదటి విడతగా కేటాయించిన నిధులు సరిపోకపోతే మరో రూ.50 లక్షల నిధులను కేటాయిస్తామని మంత్రి ఈశ్వర్‌ వెల్లడించారు. ధర్మారం   పట్టణంగా అభివృద్ధి చెందుతు న్న నేపథ్యంలో అక్కడ జరిగేది మొట్టమొదటి అభివృద్ధి పని అని ఆయన పేర్కొన్నారు. వారంరోజుల్లోగా పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని, అందుకు రోడ్డు విస్తరించే స్తలాన్ని సందర్శించి అంతా సిద్ధం చేస్తామని మంత్రి ఈశ్వర్‌కు ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు.


జాతర పోస్టర్‌ ఆవిష్కరణ

నందిమేడారం గ్రామంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర పోస్టర్‌ను జాతర ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి మంత్రి కొప్పుల ఆవిష్కరించారు. అదేవిధంగా జాతరకు రావాలని మంత్రిని ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. జాతరలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి విజయవంతం చేయాలని మంత్రి ఈశ్వర్‌ నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సామంతుల నర్సింగం, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ సలామొద్దీన్‌, ఎంపీటీసీ మిట్ట తిరుపతి, ఉపసర్పంచ్‌ కట్ట రమేశ్‌,  కమిటీ కోశాధికారి రాసూరి శ్రీధర్‌, సభ్యులు కట్ట స్వామి, మేకల రామస్వామి, మిట్ట సత్యనారాయణ, మానుపాటి శ్రీనివాస్‌, మానుపాటి సాగర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo