శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 30, 2020 , 03:47:33

‘డబుల్‌' స్పీడ్‌

‘డబుల్‌' స్పీడ్‌

నిరుపేదల సొంతింటి కల నెరవేరబోతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డబుల్‌ బెడ్రూం’ పథకం జిల్లాలో ఊపందుకున్నది. మంథని, కాల్వశ్రీరాంపూర్‌లో ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా, ఫిబ్రవరిలో గృహప్రవేశాలు చేయించేందుకు అధికారయంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతుంగా, బడుగు బలహీనవర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

  • శరవేగంగా‘డబుల్‌ బెడ్‌ బెడ్రూం’ నిర్మాణాలు
  • మంథని, కాల్వశ్రీరాంపూర్‌లో పూర్తయిన నివాసాలు
  • ఫిబ్రవరిలో గృహప్రవేశాలకు ఏర్పాట్లు
  • పెద్దపల్లి, రామగుండంలో చకచకా పనులు
  • లబ్ధిదారుల ఎంపికకు అధికారుల సన్నాహాలు
  • నిరుపేదల్లో హర్షాతిరేకాలు

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘డబుల్‌ బెడ్‌ రూం’ ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో శరవేగంగా ముందుకుసాగుతున్నాయి. పంచాయతీరాజ్‌, సోషల్‌ వెల్ఫేర్‌, ఆర్‌అండ్‌బీ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాలు మంథని, కాల్వశ్రీరాంపూర్‌లో పూర్తవగా, పెద్దపల్లి, రామగుండంలో వేగవంతంగా జరుగుతున్నాయి. జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ప్రత్యేక చొరవ చూపుతుండగా, పలుచోట్ల త్వరలోనే గృహప్రవేశాలు చేయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలు గ్రామాల్లో సభలను ఏర్పా టు చేసిన అధికారులు, అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. పూర్తి జాబితా తయారు చేసి, ఫిబ్రవరిలో ఇళ్లను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 


శరవేగంగా పనులు..

మంథని మున్సిపాల్టీ పరిధిలోని పోశమ్మవాడ వద్ద 100 డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం శరవేగంగా పనులు చేపడుతున్నారు. కూచిరాజ్‌పల్లి వద్ద మరో 120 ఇళ్ల నిర్మాణ ప నులు రూఫ్‌ లెవల్‌ దాకా చేరుకున్నాయి. మం థని మండలం కాకర్లపల్లి-1 సైట్‌ వద్ద 25 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించగా, ఇక్కడ రెండు బోర్లను వేశారు. 13 ఇళ్లు రూఫ్‌లెవల్‌ వరకూ చేరుకున్నాయి. ఓదెలలో 50 ఇళ్ల నిర్మాణ పనులను చేపట్టగా, 24 గృహాలు ప్లాస్టింగ్‌ దశలో, మరో 24 వాలింగ్‌ పూర్తి చేసుకున్నాయి. పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని రాంపల్లిలో 160 డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. 36 ఇప్పటికే ప్లాస్టింగ్‌ పూర్తికాగా, 72  గోడల వరకు, 40 రూఫ్‌లైడ్‌ లెవల్‌కు చేరుకున్నాయి. 


మరో 12 ఇళ్లు ప్లింత్‌ బీమ్‌ లెవల్‌లో ఉన్నాయి. కాల్వ శ్రీరాంపూర్‌లో 50 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించి, పనులను శరవేగంగా పూర్తి చేశారు. ఇక్కడ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల పనులు మిగిలి ఉన్నాయి. కాల్వ శ్రీరాంపూర్‌లో మరో చోట ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో 190 ఇండ్ల నిర్మాణ పనులను చేపట్టా రు. ఇక్కడ 84 ఇండ్లు ప్లాస్టింగ్‌ లెవల్‌లో, 36  గోడల నిర్మాణ పనులతో, 12 ప్లింత్‌బీమ్‌ నిర్మాణ దశలో కొనసాగుతున్నాయి. ధర్మారం మండలం బొట్లవనపర్తిలో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 15 ఇళ్ల పనులను ప్రారంభించారు. ఇక్కడ 15మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, 10 ఇండ్లు ప్లింత్‌ బీం వరకూ చేరుకున్నాయి. ధర్మారంలో 20 ఇళ్ల నిర్మాణాలకు, దొంగతుర్తిలో 15, మేడారంలో 15, పత్తిపాకలో మరో 15 ఇళ్ల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. సుల్తానాబాద్‌ మున్సిపాల్టీ పరిధిలో 80 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. 


ఇక్కడ 52 ఇళ్లు ప్లింత్‌ బీం, 20 రూఫ్‌ లెవల్‌లో పనులు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని చందపల్లిలో 200 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా, 28 ఇళ్లు రూఫ్‌ లైడ్‌, 136 ప్లింత్‌బీం లెవల్‌లో ఉన్నా యి. రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాంలో పీఆర్‌ ఆధ్వర్యంలో 60 ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇక్కడ 22 ప్లింత్‌ బీం వరకు, 30 రూఫ్‌ లైడ్‌ వరకు, ఎనిమిది ఇళ్లు ఇటుక పనితో కొనసాగతున్నాయి. పాలకుర్తి మండలం పుట్నూర్‌లో 30 ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నా యి. రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని జనగాంలో 160 ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించగా, ఇందులో 124 పనులు చకచకా ముందు కు సాగుతున్నాయి. 36 పనులు ప్లింత్‌ బీం స్థా యిలో ఉన్నాయి. గోదావరిఖనిలో 670 ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించగా, 36 రూఫ్‌ లెవల్‌కు చేరుకున్నాయి. 166 ప్లింత్‌ బీం లెవల్‌లో, 156 ఫౌండేషన్‌ లెవల్‌లో, మరో 312 ఇ ళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. 


పుట్ట మధు చొరవతో ..

మంథని నియోజకవర్గానికి ప్రభుత్వం మొ త్తం 1400 ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో మంథని మున్సిపాల్టీ పరిధిలో మొదటి విడుతలో భాగంగా 100, రెండో విడతలో మరో 92 నివాస గృహాలు మంజూరు కాగా, మొత్తంగా 192 ఇళ్లను నిర్మించేందుకు సర్కారు పచ్చ జెం డా ఊపింది. పనులను అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్‌ ప్రారంభించారు. ఇప్పటి నుంచే నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, పనులను పరుగులు పెట్టించారు. అధికారులు, కాంట్రాక్టర్లను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ, ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పోచమ్మవాడలో ప్రధాన రహదారిని ఆనుకొని జీ+1 పద్ధతిలో 92 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి, రంగులు కూడా వేయించారు. 


ఇళ్ల మధ్యలో విశాలమైన రోడ్లు, ఎలక్ట్రిసిటీ లైన్‌, స్ట్రీట్‌ లైట్లు, వాటర్‌ లైన్‌, డ్రైనేజీ సిస్టంతోపాటు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నా రు. మంథని మున్సిపల్‌ పరిధిలోని కూచీరాజ్‌పల్లిలో జీ+1 పద్ధతిలో నిర్మిస్తున్న 100 ఇండ్ల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయి తే డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఒక్కసారి కూడా పరిశీలించకపోవడాన్ని స్థానికులు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఓటమి చెందినా, జడ్పీ చైర్మన్‌ హోదాలో పుట్ట మధు పలుసార్లు డబుల్‌ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. కాంట్రాక్టర్‌, అధికారులకు సలహాలు సూచనలు అందిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయిస్తున్నారు. 


దాసరి నేతృత్వంలో ముందుకు..

పేదవాడి సొంతింటి కలను నిజం చేసేందుకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ముందుకుసాగుతున్నారు. కాల్వశ్రీరాంపూర్‌లో 50 ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించి ఇప్పటికే పూర్తి చేశారు. ఇక్కడ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌళిక సదుపాయాలను కల్పించే పనులు మిగిలి ఉన్నా యి. కాల్వ శ్రీరాంపూర్‌లో మరోచోట ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో 190 ఇళ్ల నిర్మాణ పనులు, ఓదెలలో 50, పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని రాంపల్లిలో 160 డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను శరవేగంగా సాగుతున్నాయి. ఆయా చోట్ల నిర్మాణాలను ఎమ్మెల్యే నిరంతరం పర్యవేక్షిస్తుండగా, పనుల్లో వేగం పుంజుకున్నది. 


కోరుకంటి చొరవతో గాడిలో.. 

డబుల్‌ బెడ్రూం ఇళ్ల విషయంలో గత నాయకుల నిర్లక్ష్యం రామగుండం నియోజకవర్గానికి శాపంగా మారింది. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినవారు పట్టించుకోకపోవడంతో ఇక్కడ ఆదిలోనే హంస పాదు ఎదురైంది. 2016-17సం.లో డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరుకాగా, అప్పటి నాయకుల పర్యవేక్షణ కరువవడంతో రామగుండం పూర్తిగా వెనుకబడిపోయింది. నియోజకవర్గానికి వెయ్యికి పైగా ఇళ్లు మంజూరీ కాగా, ఒక్కటి కూడా పూర్తి కాలేదు. అయితే గతేడాది రామగుండం ఎమ్మెల్యేగా గెలుపొందిన కోరుకంటి చందర్‌ ప్రత్యేక చొరవ చూ పడంతో పనులు గాడిలో పడ్డాయి. అంతర్గాం లో పీఆర్‌ ఆధ్వర్యంలో 60 ఇళ్ల నిర్మాణ పనులు, పాలకుర్తి మండలం పుట్నూర్‌లో 30 ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రామగుం డం కార్పొరేషన్‌ పరిధిలోని జనగాంలో 160 , గోదావరిఖనిలో 670 ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించగా  కొనసాగుతున్నాయి. 


గృహ పవేశాలకు సన్నాహాలు..

మంథని, కాల్వశ్రీరాంపూర్‌లో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసి, ఫిబ్రవరిలో గృహ ప్రవేశాలు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అత్యధికంగా పేద కుటుంబాలున్న మంథని నియోజకవర్గానికే తొలి ఫలితం దక్కాలనే తాపత్రయంతో జడ్పీ చైర్మన్‌ ప్రత్యేక చొరవతో పనులు చేయిస్తున్నారు. ఇటు కాల్వ శ్రీరాంపూర్‌లోనూ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.  ఇటు కలెక్టర్‌ శ్రీదేవసేనతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాల సొంతింటి కల నెరవేర్చేందుకు చేపట్టిన డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను చివరి దశకు చేరుకోగా, ఆయాచోట్ల లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 


నాణ్యతతో పనులు

 ఇంటి నిర్మాణంలో ఉపయోగించే సామగ్రి అత్యంత నాణ్యమైనవే. ఒక కుటుం బం అన్ని వసతులతో నివసించేలా పూర్తి చేయిస్తు న్నం. మంథనిలో పనులు వేగవంతంగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల పనులు పూర్తి కావస్తుండగా ఆయా ప్రాంతాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పనులు చేయాల్సి ఉంది. త్వరలోనే పనులన్నీ పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నం. 

-మహ్మద్‌ సిద్ధిఖీ, డీఈఈ    


logo