శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 30, 2020 , 03:45:04

మోడ్రన్‌ అంగన్‌వాడీ

మోడ్రన్‌ అంగన్‌వాడీ
  • ఆదర్శ గ్రామం కాసులపల్లిలో ఆధునిక శిశు విద్యాలయం
  • ప్రయోగాత్మకంగా ఏర్పాటు
  • పిల్లలకు ఆహ్లాదాన్ని పంచేలా సకల వసతుల కల్పన
  • ఆకట్టుకుంటున్న చిత్రాలు, వస్తువులు
  • త్వరలోనే మండలానికో కేంద్రం
  • ఆనందంలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు

పెద్దపల్లి కలెక్టరేట్‌ : ఆటాపాటలతోనే అక్షర జ్ఞానాన్ని పెంపొందించి, చిన్నారులను స్కూళ్లవైపు మళ్లించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనలతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన జిల్లాలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిర్వీర్యమైపోతున్న అంగన్‌వాడీ వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో మండలానికో మోడల్‌ అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆదేశాలతో రంగంలోకి దిగిన ఐసీడీఎస్‌, జిల్లా సంక్షేమశాఖ అధికారులు అప్పుడే పని మొదలు పెట్టారు. 


ప్రయోగాత్మకంగా కాసులపల్లిలో ప్రారంభం..

జిల్లాలో మూడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 705 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 311 కేంద్రాలు దాతల ఉదార స్వభావంతో అద్దె లేని భవనాల్లో, 178 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, గత ప్రభుత్వాల సరైన పట్టింపులేక వివిధ కారణాల చేత అస్తవ్యస్థంగా మారాయి. ఈ క్రమంలో కేంద్రాలను మళ్లీ కళకళలాడేలా చేస్తూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వినూత్న తరహాలో ఆట పాటలతోనే అక్షరజ్ఞానం నేర్పించాలన్న కలెక్టర్‌ ఆదేశాలతో మండలానికి ఒక మోడల్‌ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. మొదటగా అన్ని రకాల వసతి సౌకర్యాలు ఉండి, స్వచ్ఛతలో ఆదర్శంగా నిలిచిన పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామాన్ని వేదికగా చేసుకున్నారు. ప్రయోగాత్మకంగా గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని మోడల్‌ సెంటర్‌గా తీర్చిదిద్దారు. పిల్లలకు ఆహ్లాదాన్ని పంచేలా, ఆకట్టుకునేలా సెంటర్‌లో ఆట వస్తువులు, గోడలపై జిరాఫీ, జీబ్రా, ఏనుగు, కోతి చిత్రాలు వేసి అందంగా మలిచారు. అదే నెల 30న ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. 


మండలానికో సెంటర్‌కు కసరత్తు.. 

జిల్లా వ్యాప్తంగా మోడల్‌ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కలెక్టర్‌ శ్రీదేవసేన తీసుకున్న నిర్ణయం మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాసులపల్లిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన కేంద్రంపై మంచి స్పందన వస్తుండడంతో మండలానికి ఒక్క కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేశారు. ఒక్కో భవనానికి కలెక్టర్‌ సొంత నిధులు రూ. 2లక్షలు ఖర్చు చేసేలా కార్యక్రమానికి ప్రతిపాదనలు తయారు చేశారు. కలెక్టర్‌ ఆమోదముద్ర వేయగానే, పని మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


మోడల్‌ సెంటర్లు ఇక్కడే.. 

మండలానికి ఒక సెంటర్‌ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేసిన అధికారులు, రామగుండం ప్రాజెక్టు పరిధిలో అర్బన్‌ మండలం ఉండడం, చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అంతర్గా మండలంలో మాత్రం రెండు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మిగతా మండలాల్లో మాత్రం ఒక్కొక్కటి నెలకొల్పనున్నారు. పెద్దపల్లి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో పెద్దపల్లి మండలం కాసులపల్లి, సుల్తానాబాద్‌ మండలం దేవునిపల్లి, కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెగడపల్లి, ఓదెల మండలం నాంసానిపల్లి, ఎలిగేడు మండలం ర్యాకల్‌దేవుపల్లి, జూలపల్లి మండల కేంద్రం, ధర్మారం మండలం నందిమేడారం, రామగుండం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో అంతర్గాం మండలం ముర్మూర్‌, మద్దిరాల, పాలకుర్తి మండలం వేంనూర్‌, మంథని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో మంథని మండలం దుబ్బపల్లి, కమాన్‌పూర్‌ మండలం గుండారం, రామగిరి మండలం నాగెపల్లి, ముత్తారం మండలం లక్కారం గ్రామాల్లో మోడల్‌ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేశారు. 


విద్యాబుద్ధులు నేర్పడమిలా..

మోడల్‌ అంగన్‌వాడీ కేంద్రంలో ఆటపాటలతో చిన్నారులకు అక్షరజ్ఞానాన్ని అందించనున్నారు. ఆహ్లాదానికి జారుడుబండ, వాలీబాల్‌, కోడిపుంజులాట, జంతువుల బిట్స్‌ ప్రదర్శన, బిల్డింగ్‌ కట్టడాలు, ట్రై యాంగిల్స్‌, రింగులు వేయడం, రైలుబండి, ఇంగ్లీషు అక్షరాలు, ఫ్లకార్డులు, ఆత్మరాలు లాంటి ఉపకరణాలతో చిన్నారులకు అంగన్‌వాడీ టీచర్‌, ఆయాలు విద్యాబుద్దులు నేర్పించనున్నారు. అలాగే డ్రాయింగ్‌ పుస్తకాలు, వర్క్‌బుక్స్‌ నింపడం నేర్పించనున్నారు. వీటితో పాటు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకునే లబ్ధిదారులైన గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన పౌష్ఠికాహారాన్ని అందించి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోనున్నారు.


logo