గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 29, 2020 , 04:32:54

‘వెలుగు దివ్వెల’ వేడుక

‘వెలుగు దివ్వెల’ వేడుక

జ్యోతినగర్‌ : రామగుండం ఎన్టీపీసీ ఒడిలో రూపుదిద్దుకున్న 10మెగా వాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఆరేళ్లు పూర్తి చేసుకుని నేడు 7వ వసంతంలోకి అడుగిడుతున్నది. ఈ ప్లాంటు 2014, జనవరి 29న అప్పటి ఎన్టీపీసీ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరూఫ్‌ రాయ్‌ ప్రారంభించిన ఈ ప్లాంట్‌ విద్యుదుత్పత్తి రంగంలో అడుగుపెట్టి వెలుగులు విరజిమ్ముతున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న సోలార్‌ ప్రాజెక్టుల్లో రామగుండం సోలార్‌ ప్రాజెక్ట్‌ ఉత్పత్తి సామర్థ్యంలో తనదైన ముద్రవేసుకుని లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నది. నిర్ధేశించుకున్న సహజ వాయువుల నుంచి విద్యుదుత్పత్తి లక్ష్యంగా  చేపట్టిన మెగావాట్ల ఉత్పత్తిలో భాగంగా ఇక్కడ మరో 100 మెగావాట్ల సౌరశక్తిని అందించేందుకు, ఎన్టీపీసీ రిజర్వాయర్‌లో కొత్త టెక్నాలజీతో నీటిలో తేలియాడే ‘ఫొటా ఓల్టాయిక్‌ ఫ్యానెల్‌'తో ప్లాంటు నిర్మాణం సామగ్రిని కూడా దిగుమతి చేసుకుని ప్రారంభానికి సిద్దంగా ఉన్నది. 

తెలంగాణకు కొంగు బంగారంగా నిరాటకంగా వెలుగులు అందిస్తున్న 10 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు ఇది. మొదట ఇక్కడి నుంచి ఏపీకి ఆరు మెగావాట్లు, తెలంగాణకు నాలు మెగా వాట్ల చొప్పున విద్యుదుత్పత్తి ఉంది. రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో మొత్తం విద్యుత్‌ను స్వరాష్ర్టానికి మళ్లించేందుకు రెండేళ్ల క్రితం జరుగగా, ప్రస్తుతం మొత్తం విద్యుత్‌ స్వరాష్ర్టానికే సరఫరా అవుతున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి సామర్థ్యంలో మమేకమైన రామగుండం ప్రాజెక్టు మొదటి స్థానంలో ఉంది. 

రోజుకు 40 వేల యూనిట్ల విద్యుదుత్పత్తి.. 

ప్రతి వార్షిక విద్యుదుత్పత్తి 17.01 సీపీఎఫ్‌(శాతం)తో 14.936 మిలియన్‌ యూనిట్ల లక్ష్యం దిశగా  10 మెగా వాట్ల సోలార్‌ ప్రాజెక్టు రోజుకు సుమారు 40 వేల యూనిట్లు(కిలోవాట్స్‌లో)పైగానే  విద్యుదుత్పత్తి జరుగుతున్నది. గడిచిన ఆరేళ్లలో సోమవారం నాటికి 17.566 సీపీఎఫ్‌(శాతం)తో 89.955586 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది.  ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వ్యవధిలో సౌరశక్తి నుంచి అధిక ఉష్ణోగ్రత విడుదలతో ఎక్కువగా ఉత్పత్తి జరుగుతున్నది. ఏడాది పొడవునా మా ర్చి, ఏప్రిల్‌ మాసంలో మాత్రం 10మెగా వాట్లకు రోజుకు 9.5 మెగా వాట్ల వరకు విద్యుదుత్పత్తి నమోదవుతున్నది. 

33 కిలో వాట్స్‌ సామర్ధ్యంతో.. 

దాదాపు 55 ఎకరాల్లో 44వేల 448 ఫ్యానల్స్‌తో విస్తరించిన సోలార్‌ ప్లాంటు సామర్ధ్యం  33 కిలో వాట్స్‌.  ఒక ఫ్యానల్‌లో 225 వాట్స్‌ ఉత్పత్తి జరుగుతుంది. ఫ్యానల్స్‌ నుంచి విద్యుత్‌ నేరుగా 16ఏ వినియోగంతో ఏసీలోకి మార్చబడుతుంది. తర్వాత 630 కేవీ ఇన్వెర్టర్ల నుంచి బయటకు 33 కేవీ లైన్‌ ద్వారా రామగుండంలోని 132 కేవీ సబ్‌స్టేషన్‌తో గ్రీడ్‌కు అనుసంధానం చేయబడింది. ఈ ప్రాజెక్టుకు నీటి అవసరం ఉండదు కేవలం ఫ్యానల్స్‌ను శుభ్రపర్చేందుకే మాత్రమే నీటిని వినియోగిస్తారు. 

100 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు ఏర్పాట్లు 

సోలార్‌ విండో విద్యుత్‌ ప్రాజెక్టులపై దృష్టిసారించిన ఎన్టీపీసీ స్థానిక ఎన్టీపీసీ రిజర్వాయర్‌లో 100మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నది. కొత్త టెక్నాలజీతో నీటిలో తేలియాడే ఫొటా ఓల్టాయిక్‌ ప్యానెళ్లతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనుంది. టెండర్‌ దక్కించుకున్న బీహెచ్‌ఎల్‌ కంపెనీ, సబ్‌ వర్క్‌తో స్వీడన్‌ ఏజెన్సీ పనులు పూర్తి చేసింది. దీంతో బీహెచ్‌ఎల్‌ కంపెనీ  ప్లాంటు నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఒల్టాయిక్‌ ఫ్యానెల్స్‌ను భారీ ఎత్తున తరలించుకున్నది. 


logo