సోమవారం 30 మార్చి 2020
Peddapalli - Jan 28, 2020 , 02:31:07

శ్రీధర్‌బాబుది దుష్ప్రచారం

శ్రీధర్‌బాబుది దుష్ప్రచారం

మంథని టౌన్‌  మంథని రూరల్‌  కడుపు చేత పట్టుకున్న పేద వాడు కౌన్సిలర్‌గా ఎన్నికవ్వడాన్ని సహించలేక.. సహనం కోల్పోతూ.. సంస్కారం లేకుండా మంథని ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో కొత్తగా కొలువు దీరిన చైర్మన్‌ పుట్ట శైజల, వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, కౌన్సిలర్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు మాట్లాడుతూ.. మంథనిలో ఎంతో మంది ప్రముఖులు వివిధ దేశాల్లో స్థిరపడ్డారనీ, ఇక్కడి నుంచే ఏదైనా సందేశం వెళ్తుందనీ.. అలాంటి మంథనిలో కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు చీ కొట్టడాన్ని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే సహించలేక పోతున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పాలనలో ఏ నాయకత్వాన్ని కూడా బలపడుకుండా, ప్రజలను హీనంగా చూసిన ఎమ్మెల్యేకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడాన్ని జీర్ణించుకోలేక పోతున్న ఎమ్మెల్యే ఆసత్యపు ప్రచారాలకు తెరలేపారన్నారు. మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుపొందడాన్ని తట్టుకోలేక కాంగ్రెస్‌ నాయకులపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారని ఆసత్యపు ఆరోపణలు చేశారనీ.. ఆ ఆరోపణలను ఎమ్మెల్యే నిరూపించాలని పుట్ట మధు డిమాండ్‌ చేశారు. దవాఖానలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే అక్కడే విధుల్లో ఉన్న దళిత సీఐని అసభ్య పదజాలంతో దూషించడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. మంత్రి అని చూడకుండా కాంగ్రెస్‌ నాయకులు అసభ్యకరంగా మాట్లాడిన తీరుపై ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. అధిష్టానం ఎలా ఉంటే నాయకులు కూడా అలాగే వ్యవహరిస్తారు అనేందుకు నిలువెత్తు నిదర్శనం కాంగ్రెస్‌ పార్టీనే అన్నారు. ఎమ్మెల్యే ఇతరులకు గౌరవం ఇవ్వకుండా వ్యవహరించే తీరునే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సైతం అనుసరిస్తున్నారన్నారు. తమకు సైతం కార్యకర్తలు ఉన్నారనీ, తమ నాయకులపై అసభ్యకరంగా మాట్లాడితే సహించేది లేదని పుట్ట మధు హెచ్చరించారు. ఎమ్మెల్యే ‘నేను మంచోణ్ణి’ అని చెప్పుకుంటూ అన్యాయాలు, అక్రమాలు చేస్తున్న విషయాన్ని మంథని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే తీరును కాంగ్రెస్‌ నాయకులు గమనించి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపల్‌ ఎన్నికల్లో 11 వార్డుల్లో విజయం సాధించగా, దాన్ని జీర్ణించుకోలేని ఆరోపనలు చేయడం ఎమ్మెల్యే అవివేకానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు గమనించి తమ అభ్యర్థులకు పట్టం కట్టారన్నారు. ఒక స్పీకర్‌ కొడుకుగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి మంత్రిగా పని చేసిన మంథని ఎమ్మెల్యే ఒక సీఐని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సిగ్గు చేటన్నారు. ఇక్కడ ప్రగల్భాలతో ఆరోపణలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి.. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేతల కాళ్లు పట్టుకోవడం ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకే చెల్లుతుందన్నారు. మంత్రిగా శ్రీధర్‌బాబు ఉన్న సమయంలో తాము ఎటువంటి అధికారంలో లేకున్నా ప్రతిపక్ష నాయకుడిగా నేరుగా కొట్లాడి ఎక్కడ వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు పోయామని గుర్తు చేశారు. కానీ, ఎమ్మెల్యేగా ముందు ఒకలా... వెనుక ఒకలా వ్యవహరించలేదనీ, అలాంటి దిగజారుడు రాజకీయాలు మా జీవితంలో చేయబోమన్నారు.  ఇక్కడి ప్రజల యోగ క్షేమాలు, మంథని ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం ఇక్కడే ఉండే తాము సేవ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ పాలనలో జరగని అభివృద్ధి తాము కేవలం ఐదు సంవత్సరాల్లో చేసి చూపించామన్నారు. ఇది గమనించిన ప్రజలు తమకు ఒక్క సారి ఎమ్మెల్యేగా, మరోసారి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా అవకాశం ఇవ్వడం, ప్రస్తుతం తన సతీమణి పుట్ట శైలజకు మున్సిపల్‌ చైర్మన్‌గా ప్రజలు అవకాశం కల్పించి ఆశీర్వదించారన్నారు. తాము సంపాదించే ప్రతి రూపాయిలో 95 పైసలు ఇక్కడి ప్రజల అభివృద్ధికే ఖర్చు చేస్తామే తప్పా తమ సొంతానికి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవన్నారు. ఏది ఉన్నా.. లేకున్నా తాము మొఖం సూటిగా ఉంటామే తప్పా వెనుకుండి గోతులు తీసే అలవాటు తమకు లేదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌ పార్టీలో కూడా తమకు బదునాం చేయాలని చూస్తున్నారనీ, అందుకే ఇలాంటి చిన్నచిన్న విషయాలను సైతం పెద్దదిగా చేసి చూసి చూపిస్తారన్నారు. ప్రజాబలమున్న తమకు ఇలాంటి ప్రచారాల వల్ల ఎలాంటి నష్టం జరగదన్నారు. బడుగు, బలహీన వర్గాల మధ్య చిచ్చు పెడుతూ ఓట్ల దండుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మా జీవితం ఉన్నంత వరకు ఎమ్మెల్యే ఆరాచకాలు నడవనివ్వకుండా అడుగడుగునా అడ్డుకుంటామన్నారు. ఎవరికీ ఏ సమస్య ఉన్నా పార్టీలతో సంబంధం లేకుండా తమను ఆశ్రయిస్తే వారికి న్యాయం చేస్తామన్నారు. అక్రమ ఆస్తులు సంపాదించుకున్నామని తమపై అబాండాలు మోపిన ఎమ్మెల్యే స్థానిక అంబేద్కర్‌చౌరస్తాలో బహిరంగ చర్చకు రావాలన్నారు. ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకుల ఆరాచకాలను మంథని ప్రజలు గమనించాలనీ, విజ్ఞులైనటువంటి మంథని ప్రజలు మరింత చైతన్య వంతులై భవిష్యత్తులో సైతం కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. మంథని మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మంథనిని అద్దంలా తయారు చేస్తామన్నారు. తమ 11 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులతో మంథనిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా ఎవరికీ లంఛం ఇవ్వకుండా మున్సిపల్‌ సేవలు నేరుగా ప్రజలకు చేరేలా ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉంచుతామన్నారు. మంత్రి, సీఐపై అసభ్యంగా మాట్లాడిన ఆడియో టేపులను ఈ సందర్భంగా ప్రజలకు పుట్ట మధు వినిపించారు. అనంతరం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, మున్సిపల్‌ చైర్మన్‌ పుట్ట శైలజ దంపతులను మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు గజమాలతో సన్మానించి స్వీట్లు తినిపించారు. కార్యక్రమంలో ఎంపీపీలు కొండ శంకర్‌, ఆరెల్లి దేవక్క, భాన్సువాడ రాణిభాయి, జడ్పీటీసీ తగరం సుమలత, మాజీ ఎంపీపీ ఏగోలపు కమల, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కనవేన శ్రీనివాస్‌యాదవ్‌, వైస్‌ ఎంపీపీ కొమ్మిడి స్వరూప్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తగరం శంకర్‌లాల్‌, జక్కు రాకేశ్‌, కొత్త శ్రీనివాస్‌, ఏగోలపు శంకర్‌గౌడ్‌, బత్తుల సత్యనారాయణ మంథని నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులున్నారు. 


logo