బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 28, 2020 , 02:26:04

ఎమ్మెల్యే దాసరికి ప్రభుత్వ విప్‌, ఎంపీ అభినందనలు

ఎమ్మెల్యే దాసరికి  ప్రభుత్వ విప్‌, ఎంపీ అభినందనలు

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాల్టీలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించేందుకు అకుంఠిత దీక్షతో, చాకచక్యంగా వ్యవరించి, గులాబీ జెండా ఎగురవేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత అభినందించారు. పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా చిట్టిరెడ్డి మమతా రెడ్డి ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే నివాసంలో విప్‌, ఎంపీలు కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలలో చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ పదవులు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవటంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పలు అభివృద్ధి, సంక్షేమ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఫలితంగా ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారన్నారు. ప్రజల ఆశీస్సులతోనే పెద్దపల్లి, సుల్తాన్‌బాద్‌ పట్టణాలను రానున్న ఐదేండ్లలో మరింత అభివృద్ధి చేసేలా ప్ర ణాళికతో ముందుకు సాగుతామని వివరించారు. 

సంక్షేమమే లక్ష్యంగా ముందుకు.. 

కలెక్టరేట్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచిన చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లందరూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే దాసరి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. నియోజకవర్గంలోని పెద్దపల్లి మున్సిపాలిటీ, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించిన పట్టణ ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోనే పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలు కైవసం చేసుకునేలా చేసిన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. గెలిచిన కౌన్సిలర్లు పాలకవర్గాలు ప్రస్తుతం రాజకీయాలు పక్కన బెట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. కేవలం ఎన్నికలు ముగిసే వరకే పార్టీలు, రాజకీయాలు ఉండాలని చెప్పారు. కొత్తగా ఎన్నికైన చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు ఆయా పాలకవర్గంలోని కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుంటూ పట్టణాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషిచేయాలన్నారు. అందుకు తనవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాసేవలో ముందుకు సాగాలన్నారు. ఇప్పటికే మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ విడుదల చేసిన నిధులతో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయనీ, త్వరలోనే మరిన్ని నిధులు మంజూరు కానున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లాలోనే పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాల్టీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. 


logo
>>>>>>