మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Jan 26, 2020 , 05:17:55

గులాబీ జయభేరి

 గులాబీ జయభేరి


(పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ): మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ సత్తా చాటుకుంది. జిల్లాలో మొత్తం 50 డివిజన్లు, 64 వార్డులు ఉండగా, 62 స్థానాల్లో గెలుపొంది పట్టణాల్లో తనకు ఎదురు లేదని చాటుకుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు టీఆర్‌ఎస్‌కు దరిదాపుల్లో కూడా లేవు. 23 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలవగా, 8  స్థానాల్లో స్వతంత్రులు సత్తాచాటారు. మరో 8 స్థానాల్లో బీజేపీ, 10 స్థానాల్లో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ గెలిచింది. స్వతంత్రులుగా గెలిచిన కొందరు టీఆర్‌ఎస్‌ పార్టీవైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పెద్దపల్లిలో ఇద్దరు కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. రామగుండంలోనూ 18 స్థానాల్లో సత్తాచాటింది. ఇక్కడ ఇతర పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు 16 మంది టీఆర్‌ఎస్‌కే జైకొట్టగా, 34 మంది బలంతో మరోసారి మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నది.

పెద్దపల్లిలో కారు జోరు..

పెద్దపల్లిలో 36 వార్డులు ఉండగా, రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఇక్కడ 34 వార్డులకు ఎన్నికలు జరుగగా, శనివారం నిర్వహించిన కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్‌ 22 స్థానాల్లో సత్తాచాటగా, ఇక్కడ టీఆర్‌ఎస్‌ బలం ఏకగ్రీవమైన వాటితో కలుపుకొని 24కు చేరింది. కాంగ్రెస్‌ 5 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేవలం 2 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఎంఐఎం 2, ఏఐఎఫ్‌బీ 1, ఇద్దరు స్వతంత్రులు విజయం సాధించారు.

సుల్తానాబాద్‌లోనూ హవా..

మేజర్‌ జీపీ నుంచి మున్సిపాలిటీగా అవతరించిన సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా,  9 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్‌ 6 స్థానాలకే పరిమితం కాగా, కొత్త మున్సిపాలిటీ సుల్తానాబాద్‌పై గులాబీ జెండా రెపరెపలాడబోతున్నది.

మంథనిలో కాంగ్రెస్‌కు చుక్కెదురు..

ఇక్కడా మేజర్‌ జీపీ నుంచి మున్సిపాలిటీగా అవతరించిన మంథనిలో గులాబీ గుబాళించింది. శ్రీధర్‌బాబు ఇలాకాలో గులాబీ జెండా రెపరెపలాడించింది. మంథని నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించగా, ఆ తర్వాత జరుగుతూ వస్తున్న ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవుతూ వస్తున్నది. మొత్తం 13 స్థానాలున్న మంథనిలో టీఆర్‌ఎస్‌ 11 స్థానాల్లో విజయభేరి మోగించగా, కాంగ్రెస్‌ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. 

టీఆఎర్‌కే రామగుండం మేయర్‌ పీఠం..

రామగుండం కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండగా, ఇక్కడ 18 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్‌, బీజేపీలు అంతగా ప్రభావం చూపలేకపోయారు. అయితే ఇక్కడ టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన పలువురు అభ్యర్థులు ఫార్వర్డ్‌ బ్లాక్‌, స్వతంత్రంగా పోటీ చేసి విజయం సాధించారు. వీరిలో మెజార్టీ అభ్యర్థులు తిరిగి సొంత గూటికి చేరగా, అధికార పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకున్నది. ఫలితంగా రామగుండం కార్పొరేషన్‌పై మరోసారి గులాబీ జెండానే ఎగురనున్నది.logo
>>>>>>