గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 26, 2020 , 05:16:48

సరిలేరు కారుకెవ్వరు

సరిలేరు కారుకెవ్వరు
  • -ఎన్నిక ఏదైనా గులాబీదే గెలుపు
  • - పెరుగుతున్న ప్రజల మద్దతు
  • -అసెంబ్లీ నుంచి ‘పరిషత్‌' దాకా జయకేతనం
  • - తాజాగా మున్సిపల్‌ ఎన్నికలతో మరోసారి రుజువు
  • - ఉమ్మడి జిల్లాలో ప్రతిపక్షాలకు బేజారు


ఎన్నిక ఏదైనా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకే ప్రజలు పట్టంగడుతున్నారు. అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌,     పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు ఏకపక్షంగా మద్దతు ప్రకటిస్తున్నారు.         అసెంబ్లీ నుంచి పంచాయతీ, పరిషత్‌ దాకా జరిగిన ప్రతి ఎన్నికలోనూ అండగా నిలబడ్డారు. తాజాగా మున్సిపోల్స్‌లోనూ     జై కొట్టారు. మొత్తంగా ‘కారు’ దూసుకపోవడంతో ప్రతిపక్షాలు చెల్లాచెదురయ్యాయి. ఉనికి కోసం ఆరాటపడ్డ కాంగ్రెస్‌,         బీజేపీ మరోసారి బేజారయ్యాయి.

అధికార టీఆర్‌ఎస్‌ విజయాల పరంపర కొనసాగుతున్నది. ఆది నుంచీ ఏ ఎన్నికలు జరిగినా ‘కారు’ హవా సాగిస్తున్నది. కొత్త రాష్ట్రంలో మొదటిసారి 2014 జరిగిన ఎన్నికల్లో జయకేతనం ఎగరేసిం ది. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను, 12 స్థానాలను దక్కించుకొని, అప్ప టి నుంచి ఇప్పటిదాకా ఇదే జోరు కొనసాగిస్తున్న ది. ఆ తర్వాత 2019 జనవరిలో వచ్చిన పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ దూకుడు కొనసాగించింది. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 263  పంచాయతీలుంటే 164 పంచాయతీల్లో విజయఢంకా మోగించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ స్వ తంత్రుల కంటే చాలా వెనకబడి పోయాయి. ప్ర ధాన పార్టీలైన కాంగ్రెస్‌ 63, 26 చోట్ల స్వతంత్రు లు సత్తా చాటారు. బీజేపీ, ఇతర పార్టీలు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. గత ఏప్రిల్‌లో జరిగిన మండల, జిల్లా ప్రజా పరిషత్‌ ఎలక్షన్ల వరకు టీఆర్‌ఎస్‌ మరింత బలపడింది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు అవకాశం లేకుండా పోయింది. జిల్లా రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13 జడ్పీటీసీ స్థానాలకు 11 స్థానాల్లో విజయభేరి మోగించింది. ఏకపక్షంగా జడ్పీ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నది. 138 ఎంపీటీసీ స్థానాలకుగాను 89 స్థానాల్లో విజయం సాధించింది. కాం గ్రెస్‌ 33, బీజేపీ 6 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యాయి. దీంతో జిల్లాలో ఉన్న 13 మండల ప్రజా పరిషత్తు అధ్యక్ష పదవులను దక్కించుకున్నది. ఇప్పుడు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లోనూ పట్టణ ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు చూపారు. పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీల్లో ఘన విజయాన్ని కట్టబెట్టారు. రామగుండం కార్పొరేషన్‌లో ప్రజల ప్రజల ఆశీర్వాదంతో టీఆర్‌ఎస్సే అతిపెద్ద పార్టీగా అవతరించింది. తిరిగి సొంతగూటికి చేరిన పలువురు ఐఎఫ్‌బీ, స్వతంత్ర అభ్యర్థులతో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి, మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నది.

టీఆర్‌ఎస్‌పై విశ్వాసం..

తెలంగాణ సాధించిన పార్టీగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చి బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకెళ్తూ, రాష్ర్టాన్ని, తమ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న పార్టీగా టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో విశ్వాసం ఏర్పడింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనం. రూరల్‌, అర్బన్‌ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలనూ సమ దృష్టితో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. గతంలో పట్టణాల్లో విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉండేది. గంటల కొద్దీ కోతలు విధించే వారు. ఇప్పుడు కనురెప్పపాటు కూడా కరెంట్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా, ఇప్పుడు పూర్తిస్థాయిలో పరిష్కారమైంది. అర్బన్‌ మిషన్‌ భగీరథతో ప్రతి పట్టణానికీ కావాల్సిన తాగునీటి సదుపాయం కల్పిస్తున్నది. రోడ్ల పరిస్థితి కూడా గతంలో కంటే ఎంతో మెరుగుపడింది. ఇప్పుడు ఏ చిన్న మున్సిపాలిటీలో చూసినా సుందరంగా రోడ్లు విస్తరిస్తున్నాయి. ఇలాంటి మౌలిక సదుపాయాలు కోరుకుంటున్న పట్టణ ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం వాటిని తీరుస్తున్నది. వీటన్నింటినీ బేరీజు వేసుకున్న పట్టణ ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీ వైపు మరోసారి మొగ్గు చూపారు.

ప్రతిపక్షాలను తిరస్కరిస్తున్న ప్రజలు..

జిల్లాలో ప్రతిపక్ష పార్టీలకు తావులేకుండా పోతున్నది. ఒక్కో ఎన్నిక కోసం ప్రతిపక్షాలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. కానీ, ఓట్ల విషయంలోకి వచ్చే సరికి బొక్కబోర్లా పడుతున్నాయి. ఇప్పటికే అనేక ఎన్నికల్లో తిరస్కరణకు గురైన కాంగ్రెస్‌, బీజేపీ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ భంగపడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు అందనంత దూరంలో ఉన్న ఈ పార్టీలు, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. అయినా ప్రజలు వాటిని తిరిస్కరిస్తూనే వస్తున్నారు. మొన్నటి అసెంబ్లీలో మంథనిలో సత్తాచూపిన కాంగ్రెస్‌ ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికలోనూ ప్రభావం చూపలేకపోయింది. ప్రజల్లో కాంగ్రెస్‌కు మద్దతు లేదని పరిషత్‌ ఎన్నికల్లో స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఆ పార్టీ గెలుపు నీటి బుడగలాంటిదేనని మరోసారి నిరూపితమైంది. మంథనిలో కాంగ్రెస్‌ బొక్కబోర్లా పడింది. 13 స్థానాలున్న మంథని కౌన్సిల్‌లో కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. అదే జిల్లా వ్యాప్తంగా 114 వార్డులు, డివిజన్లు ఉండగా, దాదాపుగా అన్నింటిలో పోటీ చేసిన కాంగ్రెస్‌ కేవలం 23 స్థానాలే గెలుచుకోగలిగింది. బీజేపీ కూడా సింగిల్‌ డిజిట్‌ దాటలేదు. అదే టీఆర్‌ఎస్‌ 63 వార్డులు, డివిజన్లలో విజయకేతనం ఎగరేసింది. మూడు మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయి మెజార్టీ రాగా, రామగుండంలోనూ తిరిగి సొంతగూటికి చేరిన పలువురు ఐఎఫ్‌బీ, స్వతంత్ర అభ్యర్థులతో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి, మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నది.  కాంగ్రెస్‌ పూర్తిగా కనుమరుగవుతుంటే, ప్రజలు బీజేపీని విశ్వసించడం లేదని మున్సిపల్‌ ఎన్నికలను బట్టి మరోసారి రుజువైంది. సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీల్లో ఒక్క వార్డు కూడా గెలువలేని బీజేపీ, రామగుండంలో 6, పెద్దపల్లిలో 2 వార్డులకు పరిమితమైంది.logo