బుధవారం 08 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 25, 2020 , 03:35:03

పుర ఫలితాలు నేడే

పుర ఫలితాలు నేడే
  • మరికొద్ది గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
  • ఉదయం 8నుంచే కౌంటింగ్ ప్రారంభం
  • మధ్యాహ్నంలోగా విజేతలు తేలే అవకాశం


పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ:జిల్లాలోని రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని బల్దియాల విజేతలెవరో నేడు తేలనుంది.  పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం కలెక్టర్ శ్రీదేవసేన ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. జిల్లాలోని రామగుండం కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాల్టీలకు ఈ నెల 22న పోలింగ్ నిర్వహించగా, బ్యాలెట్ బాక్స్‌లను నేరుగా స్ట్రాంగ్ రూములకు తరలించి భద్రపర్చారు. శుక్రవారం బ్యాలెట్ బాక్స్‌లను తెరిచి, ఓట్లను లెక్కించేందుకు కార్పొరేషన్, మున్సిపాల్టీల పరిధిలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు, పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 34 వార్డులు, సుల్తానాబాద్ బల్దియా పరిధిలోని 15 వార్డులు, మంథని మున్సిపాల్టీలోని 13 వార్డులకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు.

జిల్లాలోని కౌంటింగ్ కేంద్రాలు ఇవే..

కార్పొరేషన్, మూడు మున్సిపాల్టీల పరిధిలో ఎన్నికల లెక్కింపును పూర్తి చేసేందుకు అధికారులు నాలుగు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కిం పు ప్రక్రియను ప్రారంభించనున్నారు. జిల్లాలో మొత్తం 2,39,040మంది ఓటర్లుండగా ఇందు లో 1,68,686 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 70.57శాతం పోలింగ్ నమోదయ్యింది. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో మొత్తం 1,75,741మంది ఓటర్లు ఉండగా, 1,19,067 మంది ఓటేశారు. ఇక్కడ 67.75% పోలింగ్ నమోదైంది. రామగుండంలోని 50 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్‌ను గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నారు. ఇందుకోసం మొత్తం 50 టేబుళ్లు ఏర్పాటు చేసి, 150 మంది సిబ్బందిని నియమించారు. పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలో మొత్తం 36 వార్డులుండగా ఎన్నికలకు ముందే రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 34 వార్డుల్లో 35,369 మంది ఓటర్లు ఉండగా, మొత్తం 26957మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ 76.21% పోలింగ్ నమోదైంది. పెద్దపల్లిలోని 34 వార్డుల ఓట్ల లెక్కింపును పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేపట్టనున్నారు. ఇందుకోసం మొత్తం 18 టేబుళ్లను ఏర్పాటు చేయగా, 54 మంది సిబ్బంది పాల్గొననున్నారు. 
సుల్తానాబాద్ మున్సిపాల్టీ పరిధిలో మొత్తం 15 వార్డులుండగా, 15,167 మంది ఓటర్లున్నారు. ఇక్కడ 12,633 మంది ఓటేయగా, 83.29శాతం పోలింగ్ నమోదైంది. సుల్తానాబాద్‌కు సంబందించిన 15 వార్డుల లెక్కింపును ఇక్కడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నారు. మొత్తం 8 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 24 మంది సిబ్బంది లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఇక మంథని మున్సిపాల్టీ పరిధిలో మొత్తం 13 వార్డులుండగా, 12,763 మంది ఓటర్లున్నారు. ఎన్నికల్లో 10,189 మంది ఓటేయడంతో 70.57శాతం పోలింగ్ నమోదైంది. మంథని పరిధిలోని 13 వార్డులకు సంబంధించిన కౌంటింగ్ కోసం మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్వం సిద్ధం చేశారు. మొత్తం 13 టేబుళ్లను ఏర్పాటు చేసి, లెక్కింపు కోసం 39 మంది సిబ్బందిని నియమించారు. 

623 మంది అభ్యర్థులు..

112 మంది అదృష్టవంతులు..

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లు, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాల్టీల పరిధిలోని 62 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, మొత్తం 623 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రామగుండం కార్పొరేషషన్ పరిధిలోని 50 డివిజన్లలో అత్యధికంగా 355 మంది పోటీ చేశారు. పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలో 36 వార్డులుండగా, 18వ వార్డులో కొలిపాక శ్రీనివాస్, 21వ వార్డులో చిట్టిరెడ్డి మమతారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 34 వార్డులకు 157 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. సుల్తానాబాద్ మున్సిపాల్టీ పరిధిలోని 15 వార్డులకు 61మంది అభ్యర్థులు, మంథని మున్సిపాల్టీ పరిధిలోని 13 వార్డులకు 50 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తంగా 112 స్థానాల్లో ఎవరు గెలుస్తారనేది శనివారం తేలిపోనున్నది.

అభ్యర్థుల్లో ఉత్కంఠ..

శనివారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల కానుండగా, అటు అభ్యర్థులు ఇటు నాయకులు, ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొన్నది. పెద్దపల్లి జిల్లాలో తక్కువ ఓటర్లున్న మంథని, సుల్తానాబా ద్ మున్సిపాల్టీల ఫలితం శనివారం మధ్యాహ్నం వరకే వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఆ తర్వాత పెద్దపల్లి మున్సిపాల్టీ, రామగుండం కార్పొరేషన్‌ల ఫలితాలు వెళ్లడయ్యే అవకాశమున్నది.

అభ్యర్థులందరికీ విప్ జారీ..

జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారందరికీ ఆయా పార్టీల అధినాయకులు విప్ జారీ చేశారు. ఈ మేరకు శనివారం ఎన్నికల ఫలితాలు వెళ్లడికానుండడంతో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ల ఎన్నికలో ఆయా పార్టీల అభ్యర్థులకే ఓటు వేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. 

సంబురాలకు సిద్ధం..

రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాల్టీలను టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సంబురాలకు సిద్ధమవుతున్నారు. వీరి ఉత్సాహానికి తోడు ఆయా చోట్ల జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి విజయయాత్ర కోసం అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు.

27న మేయర్, చైర్మన్ ఎన్నిక..

ఈ నెల 27న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాల్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలెక్టర్ శ్రీదేవసేన ఎన్నికల కోసం ప్రత్యేకాధికారులను నియమించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌కు జేసీ వనజాదేవి, పెద్దపల్లి మున్సిపాలిటీకి ఆర్డీవో శంకర్‌కుమార్, సుల్తానాబాద్ మున్సిపాలిటీకి ఇన్‌చార్జి డీఆర్వో నర్సింహమూర్తి, మంథని మున్సిపాలిటీకి జిల్లా సహకారాధికారి, ఇన్‌చార్జి డీఆర్డీవో చంద్రప్రకాశ్‌రెడ్డిని నియమించారు. వీరు ఆయా పురపాలక సంఘాల్లో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలను నిర్వహించనున్నారు.


logo