గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 24, 2020 , 03:57:15

వార్‌ వన్‌సైడే మున్సి‘పోల్స్‌'లో

వార్‌ వన్‌సైడే మున్సి‘పోల్స్‌'లో
  • - మున్సిపోల్స్‌పై గెలుపు ధీమాలో టీఆర్‌ఎస్‌ నేతలు
  • -ఓటింగ్‌ సరళి పరిశీలన తర్వాత బూత్‌లవారీగా లెక్కలు
  • -పరిషత్‌ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని అంచనాలు
  • -25న ఫలితాలు.. మెజార్టీపైనే ఆశలు
  • - నిర్వేదంలో ప్రతిపక్ష నేతలు


వార్‌ వన్‌సైడేనని స్పష్టమవుతున్నది. కార్పొరేషన్‌, మూడు మున్సిపాలిటీల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తున్నది. బుధవారం ఓటింగ్‌ ముగిసిన మరుక్షణం నుంచే ప్రధాన పార్టీలన్నీ ఎవరికీ వారే లెక్కలు వేసుకోగా, పోలింగ్‌ సరళిని క్షుణ్ణంగా పరిశీలించిన టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో మాత్రం గెలుపు ధీమా వ్యక్తమవుతున్నది. పురపోరు ఏకపక్షంగానే సాగిందనీ, సీఎం కేసీఆర్‌ నాయకత్వానికే ప్రజలు జై కొట్టారనే అభిప్రాయం మెజార్టీ ప్రజల నోట వినిపించింది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తూగలేకపోయామనే మాట ప్రతిపక్ష పార్టీల నుంచే వ్యక్తమైనట్లు తెలుస్తుండగా, మొత్తంగా రేపటి కౌంటింగ్‌ తర్వాతే అందరి భవితవ్యం తేలనున్నది.   

పెద్దపల్లి ప్రతినిధి / గోదావరిఖని, నమస్తే తెలంగాణ/  జిల్లాలోని రామగుండం కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీల్లోనూ గులాబీ పాగా వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బల్దియా ఎన్నికల భేరి మోగినప్పటి నుంచే వార్‌ టీఆర్‌ఎస్‌ వైపు  వన్‌సైడే అన్న మాటలు వినిపించినా ప్రతిపక్షాలు తమ ఉనికి చాటుకునేందుకు అనేక ప్రకటనలు గుప్పించాయి. పోలింగ్‌ సరళిని పరిశీలించిన అనంతరం కనీస పోటీని సైతం ఇవ్వలేని స్థితికి వెళ్లినట్లు విపక్ష శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. జిల్లా పరిధిలోని రామగుండం కార్పొరేషన్‌లో 50 వార్డులకు, పెద్దపల్లిలో 36, సుల్తానాబాద్‌లో 15, మంథనిలో 13 వార్డులకు ఎన్నికలు జరిగాయి. పెద్దపల్లి మున్సిపాలిటీలో రెండు వార్డులు ఏకగ్రీవం కావడంతో 112 వార్డులకు బుధవారం ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా సగటున 70.63 శాతం పోలింగ్‌ నమోదైంది. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో సగటున 70 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. ఓటింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత అన్ని పార్టీల కీలక నాయకులు, అభ్యర్థులు, పోలింగ్‌ సరళిని బట్టి గెలుపు ఓటములను బేరీజు వేసుకున్నారు. నాలుగు బల్దియాల్లోనూ టీఆర్‌ఎస్‌ ఘనవిజయాన్ని సాధించే అవకాశాలున్నాయని అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షాలు అంచనాకు వచ్చాయి. మొత్తంగా ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు లేకుండానే టీఆర్‌ఎస్‌ అన్ని బల్దియాల్లోనూ అధికారాన్ని దక్కించుకొని చైర్మన్‌ పీఠాలను కైవసం చేసుకుంటుందని పార్టీ శ్రేణులు, కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల కార్యకర్తలు, నాయకులు, పోలింగ్‌ సరళితో పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయినట్లు తెలుస్తున్నది. మున్సిపాలిటీల్లో గులాబీ గెలుపు ఖాయమని ముందే ఊహించినా, కనీసం గట్టిపోటీ ఇస్తామని భావించామని, పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే, దరిదాపు పోటీని సైతం ఇవ్వలేకపోయామని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

అభివృద్ధి, సంక్షేమానికే పట్టం..

ఐదున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలపై ప్రభావం చూపాయనీ, జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో తమదే విజయమని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్య పింఛన్లు, షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్లు, వికలాంగ పింఛన్లు, ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపాయంటున్నారు. లబ్ధిదారులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు కారు గుర్తుకే ఓటేశారంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఓటర్లు, ఇంకో మాటనేదే లేకుండా వన్‌సైడ్‌ వెళ్లిపోయారంటున్నారు. గతంలో జిల్లాలో బల్దియాలుగా ఉన్న రామగుండం కార్పొరేషన్‌, పెద్దపల్లి మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌కే విజయాన్ని కట్టబెట్టిన ప్రజలు, ఈసారి వీటితోపాటు కొత్తగా ఏర్పడ్డ మంథని, సుల్తానాబాద్‌లోనూ అన్ని స్థానాల్లో గెలిపిస్తున్నారన్న బలమైన విశ్వాసం ప్రకటిస్తున్నారు. అయితే, గతంతో పోలిస్తే కొన్ని చోట్ల కొంత మెజార్టీ అటు ఇటుగా ఉన్నా, తమ గెలుపు మాత్రం ఖాయమని చెబుతున్నారు. మెజార్టీపైనే లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తంగా బుధవారం జరిగిన పోలింగ్‌ సరళి నేపథ్యంలో జిల్లాలోని మున్సిపాలిటీల్లో వార్‌ వన్‌సైడేనని విశ్లేషకులు ప్రకటిస్తుండడం గమనార్హం.
ఇదిలా ఉండగా, రామగుండంలో ఓటేసిన తర్వాత మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కార్పొరేషన్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి గెలుపు దీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ పాలనపై విశ్వాసంతో ప్రజలు టీఆర్‌ఎస్‌కే ఓటు వేశారనీ, తమ గెలుపు ఖాయమని ప్రకటించగా, జడ్పీ చైర్మన్‌ మధు, ఎమ్మెల్యే దాసరి సైతం మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాల్టీలపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని విలేకరులతో చెప్పారు. అయితే అసలు విజయం ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంఠ అభ్యర్థుల్లో కనిపిస్తున్నది. జరిగిన పోలింగ్‌ సరిళిపై మాత్రం పెద్దపల్లి జిల్లాలోని టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల్లో గెలుపు తమదేననే ధీమా కనిపిస్తున్నది. 


logo