గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 24, 2020 , 03:57:15

27న మేయర్‌ ఎన్నిక

27న మేయర్‌ ఎన్నిక
  • - బల్దియాల అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల ఎన్నికకు ఎస్‌ఈసీ షెడ్యూల్‌
  • - అదే రోజు డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు కూడా
  • -అప్పుడే ఏర్పాట్లలో ప్రధాన పార్టీలు

కార్పొరేషన్‌, మున్సిపాలిటీల అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలెవరో ఈ నెల 27న తేలనున్నది. శనివారం ఫలితాలు వెలువడనుండగా, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికకు ఎస్‌ఈసీ గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది. గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో సోమవారం ప్రమాణస్వీకారం చేయించి, అదే రోజు ఎన్నిక చేపట్టాలని పేర్కొనగా, అప్పుడే మేయర్‌/చైర్మన్‌ ఎవరోనన్న ఆసక్తి మొదలైంది.    
 - పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ

(పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ) మేయర్‌, డిప్యూటీ మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలను ఈ నెల 27న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలోని రామగుం డం కార్పొరేషన్‌, మూడు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్‌ చైర్మన్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నా రు. కలెక్టర్‌ పర్యవేక్షణలో జరిగే ఈ ఎన్నికల కోసం ప్రత్యేక అధికారులను నియమిస్తారు.
రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీలకు ఈ నెల 22న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 25న ఆయా మున్సిపాలిటీల పరిధిలోనే ఓట్ల లెక్కింపు ఉంటుంది. గెలిచిన అభ్యర్థులకు ఇదే రోజు ఆయా మున్సిపాలిటీలకు నియమించిన ప్రత్యేకాధికారులు నోటీసులు జారీ చేస్తారు. ఈ నెల 27న జరిగే ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని నోటీసులు ఇస్తారు. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలకు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఈ నెల 27న ప్రతి మున్సిపాలిటీలో ఉదయం 11.00 గంటలకు ప్రత్యేక అధికారుల అధ్యక్షతన మొదటి సమావేశం జరుగుతుంది. అప్పుడే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల కమిషన్‌ సూచించినట్లు ఈ నెల 27న అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల ఎన్నికలు ఏవైనా కారణాలతో జరగని పక్షంలో మరుసటి రోజైన 28న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కాగా, మేయర్‌, చైర్మన్‌ అభ్యర్థులు ఎవరో జిల్లాలో జోరుగా చర్చ సాగుతున్నది.


logo