బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 23, 2020 , 03:44:44

నగరంలో 67.75 శాతం పోలింగ్

నగరంలో 67.75 శాతం పోలింగ్గోదావరిఖని, నమస్తే తెలంగాణ / గోదావరిఖని టౌన్ : రామగుండం నగర పాలక సంస్థలోని 50 డివిజన్లకు బుధవారం జరిగిన ఎన్నికలు నిర్దేశిత సమయానికి ప్రశాతంగా ముగిసాయి. సాయంత్రం 5 గంటలు ముగిసేసరికి 67.75 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం లక్షా 75వేల 741 ఓట్లకు గానూ, 1, 19, 067 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 60,565 మంది పురుషులు, 58,489 మంది స్త్రీలు, 13 మంది ఇతరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం ఉదయం మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమంగా పుంజుకుంది. ఉదయం 9 గంటల వరకు కేవలం 22,034 (12.54శాతం) ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత 11 గంటల వరకు పుంజుకొని 48,137 ఓట్లు 27.39 శాతం పోలయ్యాయి.

మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 78,655 ఓట్లు పోలై పోలింగ్ శాతం 44.76 శాతానికి చేరుకుంది. సాయంత్రం 3 గంటల సమయానికి లక్షా 1,275 ఓట్లు పోలై 57.63 శాతానికి చేరుకుంది. ఒక దశలో పోలింగ్ శాతం 70 శాతానికి పైగా దాటుతుందన్న అంచనా వేసినప్పటికీ చివరకు పోలింగ్ ముగిసేనాటికి 1,19,067 ఓట్లు పోలై 67.75 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాగా, రామగుండం సీపీ సత్యనారాయణ ఓటింగ్ సరళిని పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, పలు రాజకీయ పార్టీల నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, గత 2014లో ఎన్నికల్లో రామగుండంలో 67.19 పోలింగ్ నమోదైంది.

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..

కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పీహెచ్ చైర్మన్ కోలేటి దామోదర్ రామగుండంలో, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ స్థానిక 25వ డివిజన్ పరిధిలో గల శారదానగర్ బాలికల జూనియర్ కళాశాలలో, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి 7వ డివిజన్ తన ఓటు హక్కు వినియోగించుకుంది. అలాగే మాజీ మేయర్ జాలి రాజమణి సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అంతర్గాం (రామగుండం) : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 1, 20, 21, 22 డివిజన్లలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేయగా, పోలీసులు లాంటి సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ 1, 21 డివిజన్ పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని ఓటింగ్ సరళిని పరిశీలించి అభ్యర్థులు బద్రి రాజు, బొడ్డుపెల్లి సరిత శ్రీనివాస్, కార్యకర్తలతో పలు విషయాలపై చర్చించారు.

ఎన్టీపీసీలో..

జ్యోతినగర్ : ఎన్టీపీసీ పరిధిలోని 2, 3, 4, 5, 23, 24 డివిజన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్టీపీసీ టౌన్ జిల్లా పరిషత్ పాఠశాల, సెయింట్ విశ్వభారతి, రావూస్, దుర్గయ్యపల్లి, న్యూపోరట్ మల్కాపూర్ ప్రభుత్వ పాఠశాలలోపాటు మేడిపల్లి, పీకే రామయ్యకాలనీలోని ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా  ప్రశాంత వాతావారణంలో పోలింగ్ జరిగింది. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువత ఆనందం వ్యక్తం చేశారు. వృద్ధులు, వికలాంగులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కాలనీలో...

యైటింక్లయిన్ కాలనీ : యైటింక్లయిన్ కాలనీ పరిధిలోని 15, 16, 17, 18, 19 డివిజన్లలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 15వ డివిజన్ సీఈఆర్ క్లబ్ 16వ డివిజన్ వాణి నికేతన్ పాఠశాలలో, 17వ డివిజన్ సెయింట్ గ్రేరియస్ పాఠశాలలో, 18వ డివిజన్ డీఏవీ శాంతినికేతన్ పాఠశాలలో, 19వ డివిజన్ న్యూమారేడుపాక ప్రభుత్వ పాఠశాలలో మొత్తం 10,443 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాలనీలోని 15వ డివిజన్ టూ టౌన్ సీఐ గాండ్ల వెంకటేశ్వర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచి మందకొడిగా పోలింగ్ జరిగినప్పటికీ మొత్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


logo
>>>>>>