శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 22, 2020 , 04:22:31

మున్సిపోల్స్ నేడే

 మున్సిపోల్స్ నేడే


పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ:  జిల్లాలో పురపోరుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల పరిధిలో 64 కౌన్సిలర్, 50 కార్పొరేట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ఇందులో పెద్దపల్లిలోని రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 62 కౌన్సిలర్, 50 కార్పొరేట్ స్థానాలకు నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం దాకా పోలింగ్ నిర్వహించనుండగా, యంత్రాంగం బిజీబిజీగా మారింది.

2, 44, 091 మంది చేతిలో భవితవ్యం..

రామగుండం కార్పొరేషన్ సహా మూడు మున్సిపాలిటీల పరిధిలో  2, 44, 091 మంది ఓటర్ల చేతిలో అభ్యర్థుల భవిత్యం దాగి ఉంది. ఇందులో 1,21,788 మంది పురుషులు, 1,22,275 మంది మహిళలు, ఇతరులు 28 మంది ఉన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,78,741 మంది ఓటర్లుండగా, ఇందులో  పురుషులు 89,157, మహిళలు 89,556మంది ఇతరులు 28మంది ఉన్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో 37, 420 మంది ఓటర్లుండగా, పురుషులు 18,839మంది, మహిళలు 18,581మంది, మంథని మున్సిపాలిటీలో 12,763 మంది ఓటర్లుండగా, ఇందులో పురుషులు 6262, మహిళలు 6,501మంది ఉన్నారు. అలాగే సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 15,167 మంది ఓటర్లుండగా, ఇందులో పురుషులు 7,530 మంది, మహిళలు 7,637 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.  

370 పోలింగ్ కేంద్రాలు..

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50డివిజన్లు, పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 34వార్డులు, మంథనిలో 13వార్డులు, సుల్తానాబాద్ 15వార్డులుండగా, మొత్తంగా అధికారులు 370 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రామగుండంలో 242 పోలింగ్ కేంద్రాలు, పెద్దపల్లిలో 72, సుల్తానాబాద్ 30, మంథని మున్సిపాలిటీ పరిధిలోని 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

2218 మంది సిబ్బంది..

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 2218 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. 443 మంది పీవోలు, 443 మంది ఏపీవోలు, 1332 మంది వోపీవోలు, అలాగే ప్రత్యేక బృందాలు ఉన్నాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2 ఎఫ్ టీంలు, 1 ఎస్ టీంలు,  పెద్దపల్లిలో 2 ఎఫ్ టీంలు, 1 ఎస్ టీం, సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 1 ఎఫ్ టీం, 1 ఎస్ టీం, మంథని మున్సిపాలిటీ పరిధిలో 1 ఎఫ్ టీం, 1 ఎస్ టీం పనిచేయనుండగా, మంగళవారం తమకు కేటాయించిన పురపాలికలకు అంతా తరలివెళ్లారు.

భారీ బందోబస్తు..

ఎన్నికల కోసం రామగుండం సీపీ సత్యనారాయణ, పెద్దపల్లి జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చేపడుతున్నారు. శాంతియుత ఎన్నికల కమిషనరేట్ పరిధిలోని ఒక కార్పొరేషన్, 9మున్సిపాల్టీల పరిధిలో 7వేల మంది సిబ్బందితో భద్రతా చర్యలు చేపడుతున్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో శాంతిభద్రతలకు సంబంధించి సీపీ సత్యనారాయణ, పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలో పెద్దపల్లి జోన్ డీసీపీ రవీందర్, ఏసీపీ హబీబ్ సుల్తానాబాద్ డీసీపీ అడ్మిన్ సంజీవ్ మంథనిలో లా అండ్ డీసీపీ రవికుమార్ పర్యవేక్షించనున్నారు.

సున్నిత, అతిసున్నితమైన పోలింగ్ కేంద్రాలు ఇవే..

మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకుగాను జిల్లాలో 54 లొకేషన్లలోని 167 సున్నితమైన, 32 అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 79, పెద్దపల్లిలోని 70, సుల్తానాబాద్ 8, మంథనిలోని 10 పోలింగ్ కేంద్రాలను సున్నితమైన కేంద్రాలుగా, రామగుండంలో 4, సుల్తానాబాద్ 18, మంథనిలో 10 పోలింగ్ కేంద్రాలను అతి సున్నితమైన కేంద్రాలుగా గుర్తించారు. ఈ కేంద్రాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రతోపాటు నిఘా నేత్రాల పర్యవేక్షణలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.

120 కేంద్రాల్లో వెబ్ మైక్రో అబ్జర్వర్లు

జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లోని 120 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ పర్యవేక్షణకు మైక్రో అబ్జర్వర్లను అధికారులు నియమించారు. రామగుండంలోని 18 పోలింగ్ కేంద్రాలు, పెద్దపల్లిలోని 27 కేంద్రా లు, సుల్తానాబాద్ 18 కేంద్రాలు, మంథనిలోని 14 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ నిర్వహించనున్నారు. అలాగే పర్యవేక్షణకు మైక్రో అబ్జర్వర్లను నియమించారు.

బరిలో 623 మంది అభ్యర్థులు

జిల్లాలోని నాలుగు బల్దియాల్లోని కౌన్సిలర్, కార్పొరేట్ స్థానాల కోసం 623 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో అత్యధికంగా ఒక్క రామగుండం కార్పొరేషన్ 50 కార్పొరేట్ స్థానాల కోసమే 355మంది పోటీ చేస్తున్నారు. ఇక పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 36 కౌన్సిలర్ స్థానాలుండగా, ఇందులో రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 34 స్థానాల కోసం 157మంది, సుల్తానాబాద్ మున్సిపాల్టీ పరిధిలోని 15 కౌన్సిలర్ స్థానాల బరిలో 61మంది, మంథని మున్సిపాల్టీ పరిధిలోని 13 కౌన్సిలర్ స్థానా కోసం 50 మంది పోటీ పడుతున్నారు.

పట్టణాలకు తరలిన సిబ్బంది..

నేటి ఉదయం నుంచి సాయంత్రం పోలింగ్ జరుగనుండగా, సిబ్బంది మంగళవారమే ఆయా పట్టణాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి గోదావరిఖనిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, సామగ్రిని అందజేశారు. పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి మున్సిపాలిటీ, మంథనిలోని జూనియర్ కళాశాలలో మంథని, సుల్తానాబాద్ జూనియర్ కళాశాలలో సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు సంబంధించి సామగ్రిని పంపిణీ చేశారు. 

25న ఫలితాలు..

బుధవారం ఎన్నికలు జరుగుతుండగా, ఈ నెల 25వ లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలు వెలువరించనున్నారు. ఈ మేరకు పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బ్యాక్సులను భద్రపరించేందుకు నాలుగు బల్దియాల పరిధిలో నాలుగు స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేశారు. రామగుండంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథనిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. కాగా, పోలింగ్ ముగిశాక బ్యాలెట్ పేపర్ వివరాలను రిసెప్షన్ కేంద్రాల్లో సమర్పించి, రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్ భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశారు.logo