గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 21, 2020 , 01:34:27

అభివృద్ధిలో మంత్ర‘పురి’

అభివృద్ధిలో మంత్ర‘పురి’


మంథని టౌన్‌: మౌలిక వసతులు లేక ఏళ్లతరబడి తండ్లాడిన మంథని, స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, అప్పటి ఎమ్మెల్యే మధు చొరవతో ఎంతో ప్రగతి సాధించింది. కష్టాల చీకట్లను చీల్చుకుని ఐదున్నరేళ్లకే అభివృద్ధి వెలుగులు పంచుతున్నది. సీసీ రోడ్లు.. డ్రైనేజీలు, ఏకో పార్కు, పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించగా, నిరుపయోగంగా మారిన మున్సిపల్‌ షెటర్ల వినియోగంతో ఎంతో మందికి జీవనోపాధి దొరుకుతున్నది. ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుతో రాత్రివేళలో పట్టణం తళుకులీనుతుండగా, హరితహారం మొక్కలతో పచ్చదనం పంచుతున్నది.

ఒకప్పుడు కనీస వసతులు లేక అల్లాడిన మంథని పట్టణం, నేడు అభివృదికి కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఐదేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, అప్పటి ఎమ్మెల్యే మధు, అప్పటి సర్పంచ్‌ పుట్ట శైలజ చొరవతో ప్రగతికి బాటపట్టింది. సీసీ రోడ్లు, పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణం, ఏకో పార్కు.. ఇలా ఒక్కటేమిటి అనేక అభివృద్ధి పనులతో పట్టణ రూపురేఖలే మారిపోయాయి.

నిరుద్యోగులకు ఉపాధి..

మంథనిలో అప్పట్లో నిర్మించిన మున్సిపాలిటీ షెట్టర్లు కంపు కాసారంలో మగ్గేవి. ఏళ్ల తరబడి చెత్తాచెదారం, బురద మయంతో పందులకు ఆవాసంగా మురికి కూపాళ్లా పడి ఉన్న అండర్‌ గ్రౌండ్‌ షెటర్ల వైపు ఎవరూ కన్నెత్తి చూడలేదు.  వర్షపు నీరు ఈ అండర్‌ గ్రౌండ్‌ షెటర్‌లోకి వెళ్లి బురదతో దుర్వాసన వెదజల్లేది. ఇలాంటి పరిస్థితుల్లో  2014లో సర్పంచ్‌గా ఎన్నికైన పుట్ట శైలజ అప్పటి ఎమ్మెల్యే పుట్ట మధు సహకారంతో ఈ షెటర్లను వినియోగంలోకి తెచ్చారు. చెత్త, చెదారాన్ని, బురదను తొలగించి, ముందు భాగంలో సీసీ రోడ్లు వేసి, విద్యుత్‌ లైన్‌లు ఏర్పాటు  సుందరంగా తీర్చిదిద్దారు.  ఆనంతరం బహిరంగ వేలం ద్వారా అర్హులైన నిరుద్యోగ యువత అతి తక్కువ డిపాజిట్‌, కిరాయిలతో ఈ షెటర్లను కేటాయించారు. దీంతో పలువురు నిరుద్యోగ యువకులు ఈ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఫొటో షాపు, మొబైల్‌, ఎలక్ట్రికల్‌, కొరియర్‌, ఆన్‌లైన్‌లైన్‌ సెంటర్లతో ఉపాధి పొందుతున్నారు. ఒకప్పుడు ఇటు వైపు చూసేందుకే సాహసించలేని పరిస్థితులుండగా.. ప్రస్తుతం నిత్యం ప్రజల రాక పోకలతో ఈ షాపింగ్‌ కాంప్లెక్స్‌ సందడిగా మారింది.

చిరు వ్యాపారులకూ బాసట..

వీరితోపాటే పట్టణంలో కూరగాయల మార్కెట్‌ ఆవరణలో గాజులు, ఇతర చిరువ్యాపారాలు చేసుకునే వారికి, చేపలు, మటన్‌ సెంటర్ల నిర్వాహకుల కోసం ప్రత్యేకంగా షెటర్లు నిర్మించి తక్కువ కిరాయితో అందజేశారు. ఇందులో పలువురు చిరు వ్యాపారాలు చేసి ఉపాధి పొందుతున్నారు. మత్స్యకారులు చేపలను శుభ్రం చేసుకునేందు ప్రత్యేక భవనం నిర్మించి నీటి వసతి కోసం ట్యాప్‌లను ఏర్పాటు చేశారు. ఇలా చెప్పుకుంటే వెళ్తే ప్రజలకు అవసరమున్న అన్ని మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సహకారం, అప్పటి ఎమ్మెల్యే పుట్ట మధు అండదండలతో మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పుట్ట శైలజ నిర్వహించారు.

పబ్లిక్‌ టాయిలెట్లు..

జనసంచారం అధికంగా ఉండడంతో పాటు వ్యాపార, వాణిజ్య కేంద్రాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో మలమూత్ర విసర్జనకు జనం పడుతున్న ఇక్కట్లు, ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో పబ్లిక్‌ టాయిట్లెకు శ్రీకారం చుట్టారు. ప్రధాన చౌరస్తాకు సమీపంలో ఉన్న దాబా లైన్‌లో, కూరగాయల మార్కెట్‌లో సుందరంగా, పరిశుభ్రంగా సామూహిక మరుగుదొడ్లు, మూత్ర శాలల భవనాలను నిర్మించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలో సైతం పబ్లిక్‌ మూత్రశాలను నిర్మించారు. గత మూడేళ్లుగా వీటిని నిత్యం వందలాది మంది వినియోగించుకుంటున్నారు. వీటి వినియోగంతో రోడ్లపై మలమూత్ర విసర్జనకు చెక్‌ పెట్టినట్లయింది.

ఆహ్లాదాన్ని పంచుతున్న ఏకో పార్కు..

ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పంచేందుకు పట్టణ ప్రజలకు ఎలాంటి వసతులు లేని సమయంలో టూరిజం శాఖ ద్వారా అప్పటి ఎమ్మెల్యే పుట్ట మధు సహకారంతో మాజీ సర్పంచ్‌ పుట్ట శైలజ స్థానిక దొంతులవాడలోని బొక్కలవాగు సమీపంలో ఏకో పార్క్‌ నిర్మించారు. రంగుల రంగుల పూలమొక్కలు, పచ్చటి చెట్లు, గ్రీనరీ తలపించే విధంగా పచ్చటి గడ్డిని ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకునేందుకు నిచ్చెన, జారుడుబల్ల, ఉయ్యాల, తదితర ఆట సామాగ్రీని ఏర్పాటు చేశారు. పార్కు మధ్యలో సేద తీరేందుకు ఆర్చి నిర్మించి కూర్చునేందుకు బెంచీలను వేశారు. ఈ పార్కు ఆదివారం, సెలువుదినాల్లో వచ్చే పిల్లలు, పెద్దలకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నది. 

లెక్కకు మించిన పనులు..

పట్టణంలో దాదాపు అన్ని వార్డులు, ప్రధాన రహదారుల్లో సీసీ రోడ్లను విస్తారంగా నిర్మించారు. అప్పటి సర్పంచ్‌ శైలజ తన ఐదేళ్ల పదవీ కాలంలో వందలాది సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలు, నిర్మాణాలు, విద్యుత్‌ లైన్ల విస్తరణ చేపట్టారు. పట్టణంలోని పాత పెట్రోల్‌ పంపు నుంచి బస్‌ డిపో వరకు దాదాపు రెండు కిలో మీటర్ల వరకు ప్రధాన రహదారి వెంట ఎల్‌ఈడీ సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయడంతో రాత్రి వేళల్లో ప్రధాన రహదారి జిగేల్‌మంటున్నది. ఇదే ప్రధాన రహదారిపై రోడ్డు డివైడర్‌ నిర్మాణంతో పాటు పచ్చని చెట్లు, పూల చెట్లను ఏర్పాటు చేయడంతో వాహన చోదకులు, పట్టణ ప్రజలు ఆహ్లాదాన్ని పొందుతున్నారు.  మెట్ట ప్రాంతాలకు, పట్టణ శివారులోని పలు కాలనీలకు తాగునీటిని అందించేందుకు ప్రత్యేక పైపులైన్‌లతో ప్రజలకు తాగునీటి కనెక్షన్లు అందించారు. స్లమ్‌ ఏరియాలో పలు చోట్ల పబ్లిక్‌ ట్యాప్‌లతో పాటు బోర్లుకూడా వేసి పేద ప్రజలకు నీటి వసతులు కల్పించగా, పట్టణ ప్రజలు ఎంతో సంబురపడుతున్నారు.


తక్కు ధరకే షాపు ఇచ్చిన్రు..

ఒకప్పుడు అండర్‌గ్రౌండ్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిరుపయోగంగా చెత్తతో నిండి ఉండేది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి చేసి ఇచ్చిన్రు. ఇందులో నేను షాపు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్న. అంబేద్కర్‌చౌరస్తా, గాంధీచౌక్‌, శ్రీపాదచౌక్‌ ఏరియాల్లో ఒక షెటర్‌ కిరాయికి తీసుకోవాలంటే లక్షల్లో డిపాజిట్‌ పెట్టడంతో పాటు వేలల్లో కిరాయి కట్టాల్సి వచ్చేది. కానీ నాకు తక్కువ డిపాజిట్‌,   కిరాయికే షాపు ఇచ్చి ఆదుకున్నరు.
- మాడిశెట్టి నాగార్జున, ఫొటోస్టూడియో నిర్వాహకుడు

మంథని రూపురేఖలే మారిపోయాయి..

గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధితో మంథని రూపురేఖలే మారిపోయాయి. ఒకప్పుడు మంథని అంటే మారుమూల ప్రాంతం అనే పేరుండేది. ప్రస్తుతం మంథనిని చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నరు. పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, ఎల్‌ఈడీ లైట్లు, అండర్‌ డ్రైనేజీలు, ఆహ్లాదాన్ని పంచే విధంగా చెట్లను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతో మంథని ఎంతో అందంగా కనిపిస్తుంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే మంథనిలో ఈ మార్పు సాధ్యమైంది. 
- సాయిదీపక్‌రెడ్డి, మంథని


logo