మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Jan 20, 2020 , 02:12:31

టీఆర్‌ఎస్‌తోనే ప్రగతి

టీఆర్‌ఎస్‌తోనే ప్రగతి


పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రచారానికి మరికొద్ది గంటల సమయమే ఉండడంతో గులాబీ సేన జోరు పెరిగింది. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం చేస్తున్నది. ఇంటింటా ఓట్లు అభ్యర్థించడంతోపాటు పట్టణాల్లో కలియదిరుగుతున్నది. ప్రధానంగా రామగుండం కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాల్టీల్లో జోరు పెంచింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, దాసరి మనోహర్‌రెడ్డి విస్తృతంగా పర్యటించి సభలు, రోడ్డుషోలను నిర్వహించి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. సుల్తానాబాద్‌ మున్సిపాల్టీ పరిధిలోని 10వ వార్డులో, పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 8, 24, 30వ వార్డుల్లో, రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 43, 34వ డివిజన్లతోపాటు మంథని మున్సిపాల్టీ పరిధిలోని గాంధీచౌక్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు.

అలాగే అంతకు ముందు ఉదయం జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ మంథనిలోని 1, 3, 4, 8, 9వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. గుండా విజయలక్ష్మి, ఆరెపల్లి కుమార్‌, కుర్ర లింగయ్యను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌, ఇతర పార్టీల నాయకుల మాయ మాటలు నమ్మి మోస పోవద్దని కోరారు. అలాగే రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 18వ డివిజన్‌లో పార్టీ అభ్యర్థి కోండ్ర మాధవిస్టాలిన్‌గౌడ్‌ను గెలిపించాలని ఓటర్లను జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అభ్యర్థించారు. ఇక రామగుండంలోని 1, 13, 20, 21, 22, 34, 35, 36, 37, 44, 45వ డివిజన్లల్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కలియదిరిగారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి అనీ, పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు. అలాగే పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 8, 24, 10, 7, 6వ వార్డుల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అలుపెరుగని పర్యటన చేశారు. ఆయా వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి టీఆర్‌ఎస్‌ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. గెలిపించాలని కోరారు.

నేడు భారీ ర్యాలీలు.. విస్తృత ప్రచారం..

నేటి సాయంత్రంతో ప్రచారానికి తెరపడుతుండడంతో టీఆర్‌ఎస్‌ అగ్ర నాయకత్వం జోరుగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. మంథనిలో జడ్పీ చైర్మన్‌ మధు, పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో ఎమ్మెల్యే దాసరి, రామగుండంలో చందర్‌ వ్యూహాత్మకంగా ముందుకుసాగుతుండగా, ఈ మేరకు సోమవారం ఆయా పట్టణాల్లో భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించి, ఓట్లు అభ్యర్థించాలని నిర్ణయించినట్లు తెలిసింది.